Share News

Andhra Pradesh: టీడీపీకి లైన్ క్లియర్.. ఇక మిగిలింది అదే..!

ABN , Publish Date - Aug 18 , 2024 | 10:25 AM

మున్సిపల్‌ పీఠం అధిష్టించేందుకు టీడీపీకి లైన్‌ క్లియర్‌ అయ్యింది. వైసీపీకి చెందిన మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ టీడీపీలో చేరి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎక్కువమంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడంతో చైర్మన్‌ పీఠం సులువుగా టీడీపీ పరం కానుంది. 2021లో జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లో..

Andhra Pradesh: టీడీపీకి లైన్ క్లియర్.. ఇక మిగిలింది అదే..!

హిందూపురం, ఆగస్టు 18: మున్సిపల్‌ పీఠం అధిష్టించేందుకు టీడీపీకి లైన్‌ క్లియర్‌ అయ్యింది. వైసీపీకి చెందిన మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ టీడీపీలో చేరి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎక్కువమంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడంతో చైర్మన్‌ పీఠం సులువుగా టీడీపీ పరం కానుంది. 2021లో జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైసీపీ గెలిచింది. మునిసిపల్‌ చైర్మన్‌ స్థానం జనరల్‌ వ్యక్తికి అయినప్పటికీ పార్టీలో అంతర్గత వ్యవహారాల నేపథ్యంలో బీసీ కులానికి చెందిన ఇంద్రజకు చైర్‌పర్సన్‌గా వైసీపీ అవకాశం కల్పించింది. అయితే మొదటి రెండు మూడు నెలలు మాత్రమే పాలన సజావుగా సాగింది. ఆ తరువాత అన్నీ ఒడిదుడుకులే. పాలకవర్గంలో ఉన్న వైసీపీ సభ్యులు రెండు వర్గాలుండగా విడిపోవడంతో ఇంద్రజకు పదవి ముళ్లకిరీటంగా మారింది. అయినా అప్పటి వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఇక్బాల్‌ సహకారంతో వ్యవహారం సజావుగానే సాగింది.


కానీ 2023లో ఇక్బాల్‌ను ఇన్‌చార్జ్‌గా తొలగించారు. దీపిక ఇన్‌చార్జ్‌గా వచ్చింది. అప్పటి నుంచి చైర్‌పర్సన్‌కు మరిన్ని కష్టాలు పెరిగాయి. పేరుకు చైర్‌పర్సన్‌ అయినా హక్కులన్నీ వైసీపీ నాయకులు లాక్కున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో వైసీపీని వీడాలని చాలా మంది సొంత పార్టీ సభ్యులే సూచించారు. ఈక్రమంలో చైర్‌పర్సన్‌గా వైసీపీలో ఉండి అవమానం భరించడం కంటే పదవినే త్యాగంచేసి టీడీపీలో గౌరవంగా ఉండాలని నిర్ణయించుకుని రెండు రోజుల కిందట పచ్చకండువా కప్పుకున్నారు. పార్టీలో చేరి మరుసటి రోజే చైర్‌పర్సన్‌ పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు.


మార్గం సుగమం..

హిందూపురం మునిసిపాలిటీలో 38వార్డులుండగా 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 30స్థానాలు తెలుగుదేశం 6, బీజేపీ1, ఎంఐఎం1 గెలిచాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైసీపీకి చెందిన ఇద్దరు, ఎంఐఎం సభ్యురాలు టీడీపీలోకి చేరడంతో ఆపార్టీ బలం 9కి పెరిగింది. బీజేపీ కౌన్సిలర్‌తో కలుసుకుని పది మంది ఉండగా రెండ్రోజుల క్రితం చైర్‌పర్సన్‌ ఇంద్రజతోపాటు ఎనిమిది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో తెలుగుదేశం బలం 19కి పెరిగిన నేపథ్యంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈనెల 20న మునిసిపల్‌ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.


సమావేశంలో చైర్‌పర్సన్‌ రాజీనామాను మెజార్టీ సభ్యులు తీర్మానం చేస్తే ఇక ఆమె పదవి కోల్పోయినట్లే. తెలుగుదేశం పార్టీ తరపున చైర్మన్‌ కావడానికి 20మంది సభ్యులు అవసరం కాగా 19మంది కౌన్సిలర్లతోపాటు ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఎంపీ, ఎమ్మెల్యే ఓటు ఉండటంతో కావాల్సినదాని కంటే ఒక్క ఓటు అధికంగానే ఉంది. ఆ ప్రకారం తెలుగుదేశం పార్టీకి 21ఓట్లు, వైసీపీకి 18ఓట్లే ఉంటాయి. కానీ మరికొంతమంది వైసీపీ కౌన్సిలర్లు కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.


వైస్‌ చైర్మన్‌ కోసం టీడీపీలో పోటీ..

తెలుగుదేశం పార్టీ తరపున చైర్మన్‌ స్థానానికి అభ్యర్థి ఖరారైనట్లే భావిస్తున్నారు. కానీ రెండు వైస్‌ చైర్మన్‌ పదవులు ఉన్నాయి. వాటిలో వైసీపీ వారే ఉన్నారు. వారిని పదవి నుంచి తప్పించాలంటే మరో ఆరు నెలలు వేచి ఉండాలి. ఒకవేళ వారై పదవులకు రాజీనామా చేస్తే తెలుగుదేశం పార్టీవారికి అవకాశం వస్తుంది. అలా కుదరని పక్షంలో నాలుగేళ్లు పూర్తయ్యే వరకు తొలగించడానికి ఆస్కారం లేదని అధికారులు చెబుతున్నారు. అయినా ఆఖరి ఏడాదైనా టీడీపీవారు వైస్‌ చైర్మన్‌గా ఉండాలనుకుంటున్నారు. ఇప్పటికే మొదట టీడీపీలో గెలిచిన ఆరుగురు సభ్యుల్లో ఒకరు చైర్మన్‌ కాబోతుండగా మరో ఐదుగురు ఉన్నారు. వారిలో ఇద్దరు కౌన్సిలర్లు వైస్‌ చైర్మన్‌ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. కానీ అన్ని సజావుగా జరిగితే వైసీపీ నుంచి వచ్చిన వారికి ఒకరికి, టీడీపీ కానీ లేదా కూటమి పార్టీలో ఉన్న ఒకరికి వైస్‌చైర్మన్‌ దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


Also Read:

గాలితో ‘నడిచే శిల్పాలు’

సువాసనల రాజభోగం

అనుబంధాల ‘రక్షా’బంధన్‌

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Aug 18 , 2024 | 10:25 AM