Share News

Vangalapudi Anitha: అనితకు హోం మంత్రి పదవి దక్కడం వెనుక..?

ABN , Publish Date - Jun 15 , 2024 | 12:50 AM

పాయకరావుపేట శాసనసభ్యురాలు వంగలపూడి అనితకు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక శాఖ లభించింది. ఆమెకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హోం, విపత్తుల నిర్వహణ శాఖ కేటాయించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి హోం మంత్రిత్వ శాఖ దక్కించుకున్న తొలి వ్యక్తిగా ఆమె అరుదైన గుర్తింపుపొందారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎంతోమంది మంత్రులుగా పనిచేశారు. అయితే హోం మంత్రిగా పనిచేసే అవకాశం మాత్రం ఎవరికీ లభించలేదు.

Vangalapudi Anitha: అనితకు హోం మంత్రి పదవి దక్కడం వెనుక..?

  • ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి..

  • హోం మంత్రి పదవి దక్కించుకున్న..

  • తొలి నేతగా రికార్డు

  • విపత్తుల నిర్వహణ శాఖ కూడా కేటాయింపు

  • సర్వత్రా హర్షం

అనకాపల్లి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): పాయకరావుపేట శాసనసభ్యురాలు వంగలపూడి అనితకు (Vangalapudi Anitha) రాష్ట్ర మంత్రివర్గంలో కీలక శాఖ లభించింది. ఆమెకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హోం, విపత్తుల నిర్వహణ శాఖ కేటాయించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి హోం మంత్రిత్వ శాఖ దక్కించుకున్న తొలి వ్యక్తిగా ఆమె అరుదైన గుర్తింపుపొందారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎంతోమంది మంత్రులుగా పనిచేశారు. అయితే హోం మంత్రిగా పనిచేసే అవకాశం మాత్రం ఎవరికీ లభించలేదు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పాడేరు నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మత్స్యరాస మణికుమారి గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశారు. అలాగే సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు రోడ్లు, భవనాలు, అటవీ, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా మరో టీడీపీ సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు సమాచార శాఖా మంత్రిగా పనిచేశారు. మాడుగుల నియోజకవర్గానికి చెందిన రెడ్డి సత్యనారాయణ పశు సవర్ధక శాఖా మంత్రిగా, బండారు సత్యనారాయణమూర్తి మునిసిపల్‌ మంత్రిగా, ప్రస్తుత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మానవ వనరుల మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో చోడవరం ప్రాంతానికి చెందిన బలిరెడ్డి సత్యారావు నీటి పారుదల శాఖా మంత్రిగా, అనకాపల్లి చెందిన కొణతాల రామకృష్ణ వాణిజ్య పన్నుల శాఖా మంత్రిగా, పాడేరుకు చెందిన మత్స్యరాస బాలరాజు ప్రింటింగ్‌, స్టేషనరీ శాఖా మంత్రిగా, పసుపులేటి బాలరాజు గిరిజన సంక్షేమ శాఖా మంత్రులుగా పనిచేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పర్యాటక శాఖా మంత్రిగా,మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా, గుడివాడ అమర్‌నాథ్‌ పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రిగా పనిచేశారు. గతంలో చూస్తే...1967-1977లో భీమిలి నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎన్నికైన పీవీజీ రాజు విద్యాశాఖా మంత్రిగా, 1992లో పెందుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికైన గుడివాడ గురునాథరావు సాంకేతిక శాఖా మంత్రిగా పనిచేశారు. 1983లో భీమిలి నుంచి టీడీపీ తరపున గెలిచిన పూసపాటి ఆనందగజపతిరాజు విద్యా మంత్రిగా పనిచేశారు. 1989లో భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన ఆర్‌ఎస్‌డీపీ అప్పలనరసింహరాజు ఆబ్కారీ శాఖా మంత్రిగా పనిచేశారు. అయితే మొట్ట మొదటిసారి జిల్లాకు హోం మంత్రి పదవి లభించింది.

Anitha-And-Chandrababu.jpg

విషయ పరిజ్ఞానం..

వంగలపూడి అనిత ఉపాధ్యాయినిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి తొలిసారి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో పోటీ చేసి ఓటమి చవిచూసిన ఆమె... ఈసారి పాయకరావుపేట నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. రెండు రోజుల క్రితం కొలువుతీరిన కొత్త ప్రభుత్వంలో మంత్రిగా స్థానం దక్కించుకున్నారు. ఉపాధ్యాయినిగా పనిచేయడం ఆమెకు కలిసొచ్చింది. సామాజిక, రాజకీయ అంశాలపై ఆమెకు చక్కటి అవగాహన ఉంది. విషయ పరిజ్ఞానంతో సూటిగా మాట్లాడగలరు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఆమెను గత వైసీపీ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని యత్నించినా వెనక్కి తగ్గలేదు. ధైర్యంతో ముందడుగు వేశారు. వైసీపీ అరాచకాలు, పాలనాపరమైన వైఫల్యాలను గట్టిగా నిలదీశారు. ఎస్సీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమెపై వైసీపీ ప్రభుత్వం అప్పట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి భయపెట్టే ప్రయత్నం చేసింది. అయినా ఆమె ఏమాత్రం జంకలేదు. అనిత పోరాట పటిమను గుర్తించిన టీడీపీ అధిష్ఠానం రాష్ట్ర మంత్రివర్గంలో హోం మంత్రిగా బాధ్యతలు అప్పగించిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Vangalapudi-Anitha.jpg

నేడు అనిత రాక

రాష్ట్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గానికి శనివారం రానున్నారు. ఒకవైపు అధికారులు, మరోవైపు టీడీపీ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సాయంత్రం 3 గంటలకు పాయకరావుపేట వస్తున్న అనిత పట్టణంలో పాండురంగస్వామిని దర్శించుకుంటారు. అనంతరం విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు నక్కపల్లి మండలం ఉపమాక వేంకటేశ్వరస్వామిని ఆమె దర్శించుకుంటారు. నియోజకవర్గం నలుమూలల నుంచి టీడీపీ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పాయకరావుపేట పట్టణంలో మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా మండలంలో అనేక ప్రాంతాల్లో కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పాయకరావుపేట పట్టణంతో పాటు పలుచోట్ల మంత్రిని సత్కరించేందుకు గజమాలలు సిద్ధం చేశారు. అదివారం నక్కపల్లిలోని తన నివాసంలో హోం మంత్రి అందుబాటులో ఉంటారని తెలిసింది. అయితే మంత్రి అనిత షెడ్యూల్‌ మాత్రం అధికారికంగా ఇంకా రావాల్సి ఉంది.

Anitha.jpg

Updated Date - Jun 15 , 2024 | 09:19 AM