AP Politics: సీఎం జగన్ రాష్ట్రాన్ని తాకట్టాంద్రప్రదేశ్‌గా మార్చారు.. మాజీ మంత్రి గంటా ఆగ్రహం
ABN , Publish Date - Mar 03 , 2024 | 04:48 PM
ఏపీ సచివాలయం తాకట్టుపై X(ట్విట్టర్) వేదికగా మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టేశారని... ఇప్పుడు ఏకంగా రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
విశాఖపట్నం: ఏపీ సచివాలయం తాకట్టుపై X(ట్విట్టర్) వేదికగా మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టేశారని... ఇప్పుడు ఏకంగా రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అప్పుల ఊబిలో మునిగిపోయిన శ్రీలంక కూడా తమ పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టలేదని కానీ ఇది ఒక జగనన్నకు మాత్రమే సాధ్యమనేలా అన్నింటిని తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. మళ్లీ జగన్‌కు ఇంకో అవకాశం ఇస్తే శ్రీహరికోట, సాగర్ డ్యాం, శ్రీశైలం డ్యాం, పోలవరం డ్యాంలను కూడా తాకట్టు పెట్టేస్తారేమో అని ఆరోపించారు. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెరలేపి... రాష్ట్రాన్ని ఒక్క రాజధాని కూడా లేకుండా చేసి.. చివరకి ఉన్న రాజధానిలోని రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారని మండిపడ్డారు. నిన్న విశాఖలో 13 ప్రభుత్వ భవనాలు, కాలేజీలు తాకట్టుపెట్టి రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చారని ధ్వజమెత్తారు. మద్య షాపులను తాకట్టుపెట్టి రూ.48 వేల కోట్లు అప్పు తెచ్చారన్నారు. R&B ఆస్తులు తాకట్టు పెట్టి రూ.7 వేల కోట్లు అప్పు చేశారు కానీ రోడ్లు ఎందుకు వేయలేదని నిలదీశారు.
ప్రజలపై లక్షల కోట్ల భారం
టిడ్కో ఇళ్లు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు అప్పు ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. ఆ టిడ్కో ఇళ్లు కూడా సరిగా పూర్తి చేయలేదని... చెత్త పన్నుతో సహా రకరకాల పన్నులతో రూ.లక్షల కోట్లు ప్రజలపై బాదారని విరుచుకుపడ్డారు. ఇలా ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాదుడుతో ఇప్పటికే ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల భారం మోపారని మండిపడ్డారు. ఇప్పుడు మరో రూ.370 కోట్ల అప్పు కోసం రాష్ట్ర సచివాలయ సముదాయాన్ని HDFC బ్యాంకుకు తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రతిష్ఠ మంటకలిపారని అన్నారు. ఈ 58 నెలల కాలంలో రూ.12 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలకు రూ.2 లక్షల కోట్లు పోగా మిగిలిన లక్షల కోట్లు ఏమయ్యాయని నిలదీశారు. రేపు మన ప్రైవేటు ఆస్తుల్ని, భూముల్ని తాకట్టుపెట్టి లక్షల కోట్లు అప్పు తెచ్చుకొని లూటీ చేసే ప్రమాదం కూడా పొంచి ఉందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలందరూ ఈ ప్రభుత్వ అరాచకాలపై ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ రాష్ట్రాన్ని తాకట్టాంద్రప్రదేశ్‌గా మార్చిన ఈ అరాచక ప్రభుత్వాన్నీ ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టాలని గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి