Ram Mohan Naidu: ఏపీ, తెలంగాణలో మరిన్ని ఎయిర్‌పోర్టులు.. రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 11 , 2024 | 05:39 PM
ఆంధ్రప్రదేశ్‌లోని ఓర్వకల్లు, దగదర్తి, నాగార్జునసాగర్, కుప్పంలో ఎయిర్‌పోర్టులను త్వరలో నిర్మిస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. వీటితో పాటు తెలంగాణలో కూడా కొత్త ఎయిర్ పోర్టులను నిర్మిస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా చాలా ఎయిర్ పోర్టులను త్వరలో పూర్తి చేయనున్నామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌లోని ఓర్వకల్లు, దగదర్తి, నాగార్జునసాగర్, కుప్పంలో ఎయిర్‌పోర్టులను త్వరలో నిర్మిస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu ) ప్రకటించారు. వీటితో పాటు తెలంగాణలో కూడా కొత్త ఎయిర్ పోర్టులను నిర్మిస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా చాలా ఎయిర్ పోర్టులను త్వరలో పూర్తి చేయనున్నామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
రామ్మోహన్ నాయుడు ఆదివారం నాడు విజయనగరంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనుల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే శక్తి భోగాపురం ఎయిర్ పోర్ట్‌కి ఉందని తెలిపారు. 2026 జూన్ నెలలోపు ఎయిర్ పోర్ట్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నామని అన్నారు.
ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ప్రతినెల ఎయిర్ పోర్ట్ పనులను పరిశీలించి వేగవంతం చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు 36.6 శాతం పనులు పూర్తి అయ్యాయని స్పష్టం చేశారు. అనుకున్న సమయానికి ముందే పనులు పూర్తి చేస్తామని అన్నారు. ఉదాన్ స్కీమ్ వల్ల భారతదేశ విమానయాన శాఖ ప్రపంచంలోనే ఉన్నతంగా తయారైందని మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
జలహారతులను పునరుద్ధరిస్తాం: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
మరోవైపు.. కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Minister Anam Ramanaraya Reddy)తెలిపారు. జలహారతులపై మంత్రుల కమిటీ భేటీ అయింది. దేవస్థానాలకు త్వరలో కొత్త పాలకమండళ్లు నియమిస్తామని తెలిపారు. CGF కింద 160 ఆలయాలు పున: నిర్మిస్తామని ఆనం రామనారాయణరెడ్డి వివరించారు.
ఆలయ భూములు పరిశీలించి ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. రూ.50వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు ఆర్థిక సాయం పెంచుతున్నట్లు ప్రకటించారు. తిరుమల నుంచే దేవాదాయ శాఖలో ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. ఏ చిన్న ఆరోపణలు వచ్చినా నివేదికలు తెప్పించుకుంటున్నామని అన్నారు. నెల్లూరు జిల్లాలో ఐదుగురు దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మరో వివాదాస్పద అధికారిపై విచారణ చేపడతామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.