Pawan Kalyan: ఎన్నో బాధలు, ఇబ్బందులు, అవమానాలు పడి ప్రభుత్వాన్ని స్థాపించాం..
ABN , Publish Date - Aug 05 , 2024 | 11:09 AM
ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 97శాతం స్ట్రైకింగ్ రేట్‌తో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Klayan) మాట్లాడుతూ.. 97శాతం స్ట్రైకింగ్ రేట్‌తో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. తాము అనేక బాధలు పడి.. ఇబ్బందులు పడి అవమానాలకు గురై ఈ ప్రభుత్వాన్ని స్ధాపించడానికి కారణం వ్యవస్థలను కాపాడటంతో పాటు బలోపేతం చేయడానికేనని పేర్కొన్నారు. ‘ మేము ఈసారి అధికారంలోకి రాకపోయినా ప్రజాస్వామ్యంలో నిలబడి ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని వచ్చాం. మాది మంచి ప్రభుత్వం.. అకౌంటిబులిటీ ఉన్న ప్రభుత్వం. గత అయిదేళ్లుగా పాలన ఎలా ఉందో అందరూ చూశారు’ అని పవన్ చెప్పుకొచ్చారు.
ఇవన్నీ చేస్తాం..!
‘ ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో గత అయిదేళ్లగా రాష్ట్రం అలా ఉంది. ఎలా ఉండకూడదనే దానికి రాష్ట్రం మోడల్ స్టేట్‌గా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం మనకు ఎంతో ఉపయోగపడుతుంది అనే నమ్మకం మాకు ఉంది. రాష్ట్రం మొత్తం మీద ఒకే రోజు 13,326 గ్రామ పంచాయితీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి రిజల్యూషన్‌లు చేస్తున్నాం. తద్వారా గ్రామాలను బలోపేతం చేస్తాం. గ్రామాల్లో సాలిడ్ మేనేజ్మెంట్‌ను అమలు చేస్తున్నాం. అటు పిఠాపురంలో లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా పైలెట్‌గా చేపడుతున్నాం. ఈ సంవత్సరం 5కోట్ల 40 లక్షల గృహలకు తాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కొత్త రోడ్లు, ఉన్న రోడ్లు బాగు చేయడం మా ప్రభుత్వ లక్ష్యమని పవన్ తెలిపారు. గుంటూరు, కర్నూలు, పశ్చిమగోదావరిలో ఫారెస్ట్ కవర్ పెంచే ప్రయత్నం చేస్తున్నాం’ అని కలెక్టర్ల సమావేశంలో మాట్లాడారు.
సీబీఎన్.. విజన్‌తో ముందుకు!
రాజ్యంగం ఎంత గొప్పగా ఉన్నా.. దాన్ని అమలు పరిచేవారు సరిగా లేకపోతే ఆ వ్యవస్థ పనిచేయదన్నారు. బలహీనమైన రాజ్యంగం ఉన్నా ప్రజల కోసం పనిచేసేవారు ఉంటే ఆ వ్యవస్థ కచ్చితంగా పనిచేస్తుందన్నారు. అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు, నేర్చుకోవలనుకునే తనలాంటి వారు కలిసి వ్యవస్థలను ముందుకు తీసుకువెళతామన్నారు. చంద్రబాబు విజన్‌ను తాము ముందుకు తీసుకువెళతామన్నారు. విభజన వల్ల 20 ఏళ్ల పాటు అవమానాలు.. ఇబ్బందులు పడ్డామన్నారు. చివరకు బోర్డర్ దాటడానికి కూడా ఇబ్బందులు పెడితే వాటిని కూడా లెక్క చేయకుండా ముందకు వెళ్లామన్నారు. ముఖ్యమంత్రి చెబుతున్న స్కిల్ సెన్సెస్‌కు సలహాలు సూచనలు అవసరమని కలెక్టర్లకు పవన్ తెలిపారు.