Share News

Eluru: తనిఖీల కోసం వెళ్లిన పోలీసులపై తేనెటీగలు దాడి..

ABN , Publish Date - Dec 15 , 2024 | 08:18 PM

పోలవరం ప్రాజెక్టు వద్ద పోలీసులపై తేనెటీగలు దాడి చేశాయి. సోమవారం రోజు పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టింది.

Eluru: తనిఖీల కోసం వెళ్లిన పోలీసులపై తేనెటీగలు దాడి..
Polavaram Project

ఏలూరు: పోలవరం ప్రాజెక్టు వద్ద పోలీసులపై తేనెటీగలు దాడి చేశాయి. సోమవారం రోజు పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టింది. అయితే స్విల్‌వే ఒకటో నంబర్ గేట్‌ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. పోలసులంతా తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా తేనెటీగలు మాత్రం వదిలిపెట్టలేదు. ఈ దాడిలో డీఎస్పీ రామకృష్ణకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో ఆయన్ను హుటాహుటిన పోలవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య కోసం రాజమండ్రికి తరలించారు.


రెండోసారి చంద్రబాబు..

కాగా, పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించనున్నారు. 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించేవారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్, అధికారుల నుంచి సమాచారం తెలుకునేవారు. అయితే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత రెండోసారి ఆయన పోలవరానికి వెళ్లనున్నారు. సీఎం అయ్యాక ఈ ఏడాది జూన్ 17న మెుదటిసారి ఆయన ఆ ప్రాజెక్టును సందర్శించారు. తాజాగా మరోసారి పోలవరాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు గురించి సమగ్ర సమాచారాన్ని అధికారులను అడిగి చంద్రబాబు తెలుసుకోనున్నారు. ముఖ్యంగా డయాఫ్రం వాల్ నిర్మాణం గురించి అధికారులతో మాట్లాడనున్నారు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ఇంజనీర్లతో మాట్లాడనున్నారు.


భారీ భద్రతా ఏర్పాట్లు..

అయితే చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం రోజు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సీఎం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులు, నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్) సిబ్బందికి పలు సూచనలు చేశారు. చంద్రబాబు వచ్చిన సమయంలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. హెలిప్యాడ్ నుంచి చంద్రబాబు పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. కాన్వాయ్ ట్రయిల్ రన్ నిర్వహించారు. కాగా, సీఎం పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఈ ఏర్పాట్లలో భాగంగానే పోలవరం వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులపై తేనెటీగలు దాడి చేశాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

Visakha: రుషికొండ భవనాల నిర్మాణం పిచ్చి పని: అశోక్ గజపతిరాజు ఆగ్రహం..

CM Chandrababu: వారివి అన్నీ దొంగ బుద్దులే.. అన్నీ దొంగ నాటకాలే: సీఎం చంద్రబాబు..

Updated Date - Dec 15 , 2024 | 08:40 PM