Ram Gopal Varma: ఏపీలో ఆర్జీవీపై వరుస కేసులు... ఫిర్యాదులు ఏమిటంటే..
ABN , Publish Date - Nov 29 , 2024 | 06:09 PM
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలతో సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై వరుస కేసులు నమోదవుతున్నాయి. కాపునాడు నాయకులు అమలపురంలో ఈరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంబేద్కర్ కోనసీమ(అమలాపురం): అమలాపురంలో సంచలన సినీ దర్శకుడు(Director) రామ్ గోపాల్ వర్మపై (Ram Gopal Varma) పోలీసులకు ఇవాళ(శుక్రవారం) కాపునాడు నాయకులు ఫిర్యాదు చేశారు. కాపులను కించపరిచే విధంగా మాట్లాడాడంటూ అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ X లో "కాపు" కులంపై చేసిన వాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్న తరుణంలో రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్‌పై కాపునాడు నేతలు ఫిర్యాదు చేశారు.
అనుచిత పోస్టులు ..
కాగా... సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలతో వేర్వేరు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఏపీ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు విచారణకు వచ్చాయి. రామ్‌గోపాల్ వర్మ తరఫు న్యాయవాది స్పందిస్తూ పిటిషనర్‌ను అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉందని, వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో విచారణ చేపడతామని న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కె కృపాసాగర్ ప్రకటించారు. విచారణ చేసిన న్యాయస్థానం నాటికి వాయిదా వేసింది.
ఏపీ హైకోర్టు ఝలక్ ..
అయితే.. సామాజిక మాధ్యమాలలో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టిన దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. క్వాష్ పిటిషన్‌లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. పోలీసుల ముందు హాజరయ్యేందుకు మరికొంత సమయం ఇవ్వాలన్న రామ్‌గోపాల్ వర్మ తరఫు న్యాయవాది అభ్యర్థననూ తోసిపుచ్చింది. ఈ తరహా అభ్యర్థనను సంబంధిత స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) వద్ద చేసుకోవాలని, కోర్టు ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని పేర్కొంది. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ముత్తనపల్లి రామలింగయ్యకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో రాంగోపాల్ వర్మ విచారణకు హాజరు కావడం అనివార్యమైంది.
ఇంకా అజ్ఞాతంలోనే రామ్‌గోపాల్‌వర్..
మరోవైపు.. రామ్‌గోపాల్‌వర్మ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అతని కోసం ఒంగోలు పోలీసులు (Ongole Police) గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తెలంగాణ (Telangana), తమిళనాడు (Tamilnadu) రాష్ట్రాలకు ప్రత్యేక పోలీస్ బృందాలను పంపారు. అటు వర్చువల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో ఆర్జీవీ ముందస్తు బెయిల్ కోసం ఆయన తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈనెల 25న ఒంగోలు పీఎస్‌లో విచారణకు రావాల్సి ఉండగా.. అదే రోజు ఆయన విచారణకు రాకుండా గైర్హాజరయ్యారు. అప్పటి నుంచి పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. రెండు రోజుల క్రితం రాంగోపాల్ వర్మ ఒక వీడియో విడుదల చేశారు. తానెక్కడికి పారిపోలేదని, పోలీసులు విచారణకు పిలిస్తే తాను వెంటనే విచారణకు రావాలా.. అంటూ ఎదురు ప్రశ్నిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఆ వీడియో ఎక్కడి నుంచి విడుదల చేశారన్న కోణంలో ఐటీ సిబ్బంది ఆరా తీస్తున్నారు. అయితే రాంగోపాల్ వర్మ విచారణకు రాకుండా కోర్టుల నుంచి రక్షణ పొందేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఒంగోలు పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. వర్మకు హైకోర్టులో బెయిల్ పిటిషన్ లభిస్తే రాంగోపాల్ వర్మ అప్పుడైనా వెలుగులోకి వస్తారా.. బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ అయితే అజ్ఞాతంలోనే ఉంటారా అన్నది ఉత్కంఠంగా మారింది. రాంగోపాల్ వర్మపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 9 కేసులు నమోదయ్యాయి. ఒంగోలు మద్దిపాడులో నమోదైన కేసులో రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణకు రానుంది.