Share News

Raghurama: రాబోయే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమి విజయం ఖాయం.. రఘురామ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ABN , Publish Date - Jan 14 , 2024 | 03:08 PM

రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అద్భుత విజయం సాధించబోతుందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Raghurama: రాబోయే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమి విజయం ఖాయం.. రఘురామ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

రాబోయే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమి అద్భుత విజయం సాధించబోతోందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రస్తుతం 135 స్థానాల్లో కూటమి గెలవబోతోందన్న ఆయన షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఆ సంఖ్య 155కు పెరిగే అవకాశం ఉందన్నారు. చాలామంది కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందన్న ఆయన.. షర్మిల, ఆమె భర్త ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తారని చెప్పారు. ‘‘ వైసీపీ నేతలు 99 శాతం పనులు చేశామని చెప్తున్నారు. కానీ అవి చేసిన పనుల గురించి కావు. చేయని పనుల గురించి. వారి మోసాన్ని ప్రజలు గ్రహించారు’’ అని అన్నారు. జగన్ స్వయంకృతాపరాధం వల్లే ఆ పార్టీ ఓడిపోబోతున్నదని ఆయన జోస్యం చెప్పారు. కేంద్ర పథకాలకు వారి స్టిక్కర్లు పెట్టుకుని బటన్ నొక్కుతున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. తాను జగన్‌కు సహాయం చేశాను గానీ, ఆయన నుంచి ఎప్పుడు సహాయం తీసుకోలేదన్నారు. అందరి దగ్గరి నుంచి జగన్ కు తీసుకోవడమే తెలుసని, ఇవ్వడం తెలీదని చెప్పారు.

ప్రజలకు తన తప్పేమిటో చెప్పే ప్రయత్నంలో సీఎం జగన్ చేసిన కుట్ర పరోక్షంగా తనను ప్రజలకు దగ్గరయ్యేలా చేసిందని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. భీమవరంలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఒక ఎంపీ నియోజకవర్గానికి రాకుండా ఇన్ని రోజులు ఉండటం జరగలేదన్న రఘురామ.. నియంతగా పాలిస్తున్న ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లో టీటీడీ భూములు అమ్మాలని నిర్ణయిస్తే తాను వారితో విబేధించినట్లు చెప్పారు. ఇసుక రేటు పెంచడం మంచిదికాదని చెప్పినప్పుడే తనపై కేసులు పెట్టారని వెల్లడించారు. అప్పటి నుంచి నియోజకవర్గానికి వస్తానంటే రకరకాలుగా కేసులు పెట్టారని, తనపై తప్పుడు రాజద్రోహం కేసు పెట్టి, అరెస్ట్ చేశారని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు.


ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు నా గురించి మరోసారి చర్చించుకున్నారు. కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసినవారే నిజమైన ఆత్మీయ బంధువు. అల్లూరి విగ్రహావిష్కరణకు భీమవరం రానివ్వలేదు. ఏదోరకంగా వద్దామనుకుంటే రైలు తగులబెట్టడానికి వారు సిద్ధమయ్యారనే సమాచారంతో రాలేదు. నేను ఎందుకు ఇక్కడకు రాలేదో కొందరు అర్ధం చేసుకున్నారు. మరికొందరు అర్ధం చేసుకోలేదు. మా నానమ్మ చనిపోయినా నన్ను రానివ్వలేదు. ఇక్కడికి రాకపోయినా అందరికి అందుబాటులో ఉన్నాను.

- రఘురామకృష్ణరాజు, వైసీపీ ఎంపీ

తన ఎంపీ ల్యాడ్స్ నిధులను ఆచంట, నరసాపురంలలో ఖర్చుచెయ్యకుండా అక్కడి ఎమ్మెల్యేలు అడ్డుకున్నారని రఘురామ చెప్పారు. మిగిలిన అన్ని నియోజకవర్గాలలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో పనులు చేయించగలిగానన్నారు. తాను నిధులు తీసుకురాగలను ఇవ్వగలను కానీ అడ్డుకుంటే మాత్రం తానేమీ చేయలేనని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్తరైళ్లు నరసాపురం నుంచి ప్రారంభం కానున్నాయన్నారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువకాగలిగానని, అందుకు ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వివరించారు.

Updated Date - Jan 14 , 2024 | 03:26 PM