Andhra Pradesh: కాంగ్రెస్ ఎందుకు రాలేదు.. జగన్ సూటి ప్రశ్న...
ABN , Publish Date - Jul 26 , 2024 | 05:24 PM
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రం పురోగతిలో వెళ్తుందా? వెనక్కి వెళ్తుందా? అని ప్రశ్నించారు. దీనిని ప్రజలంతా ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయి 50 రోజులు అయ్యిందని..
అమరావతి, జులై 27: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రం పురోగతిలో వెళ్తుందా? వెనక్కి వెళ్తుందా? అని ప్రశ్నించారు. దీనిని ప్రజలంతా ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయి 50 రోజులు అయ్యిందని.. కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి హత్యలు, దాడులు జరుగుతున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం అణచివేత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు.
బడ్జెట్ ప్రవేశపెట్టలేని స్థితిలో ప్రభుత్వం..
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావొస్తున్నా.. రెగ్యూలర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేకపోతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు రెగ్యులర్ బడ్జెట్‌లో చూపాలని జగన్ డిమాండ్ చేశారు. రెగ్యులర్ బడ్జెట్‌లో కేటాయింపులు చూపక పోతే ప్రజలు రోడ్లపైకి వస్తారని, అందుకే చంద్రబాబు బడ్జెట్ కూడా పెట్టలేక పోతున్నారని అన్నారు. ప్రజలెవరూ రోడ్లపైకి రాకూడదనే ఉద్దేశ్యంతోనే.. ఏకంగా హత్యలు, దాడులతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని జగన్ ఆరోపించారు.
వాస్తవంగా అప్పు ఎంత?
చంద్రబాబు ఎప్పటిలాగే.. వంచన, గోబెల్స్ ప్రచారాన్ని ఫాలో అవుతున్నారని జగన్ విమర్శించారు. సొంత మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు ఇదే రీతిలో ప్రచారం చేశారన్నారు. బీజేపీతో వెళ్లాలి అనుకున్నప్పుడు, వద్దనుకున్నప్పుడు కూడా ఇదే విధంగా ప్రచారం చేశారని ఆరోపించారు. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయింది అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగంలో కూడా అబద్ధాలే చెప్పారని విమర్శించారు. రాష్ట్రంలో రూ. 14 లక్షల కోట్లు అప్పు ఉన్నట్లు ప్రచారం చేశారని.. ఆ అప్పును చూపించడానికి పడరాని పాట్లు పడుతున్నారని చంద్రబాబుపై జగన్ విమర్శల వర్షం కురిపించారు. చివరకు గవర్నర్ ప్రసంగంలో పది లక్షల కోట్లు అప్పు ఉన్నట్లు ప్రకటించారన్నారు. చంద్రబాబు గవర్నర్‌తోనూ అబద్ధాలు చెప్పించారని విమర్శించారు. రాష్ట్రం అప్పులు వాస్తవంగా గత జూన్ వరకు మొత్తం రూ. 7.8 లక్షల కోట్లు ఉందని జగన్ క్లారిటీ ఇచ్చారు. 14 లక్షల కోట్లు అని సీఎం చంద్రబాబు, 10 లక్షల కోట్లు అని గవర్నర్ చెప్పడం దేనికి సంకేతం అని ప్రశ్నించారాయన. అప్పులు చేయడానికి ఎఫ్‌ఆర్ఎంబీ అవకాశం ఇచ్చిన దానికన్నా తక్కువ అప్పులు చేశామన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను తప్పించుకోవడానికి పద్ధతి ప్రకారం ఇలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
తల్లికి శఠగోపం..
తల్లికి వందనం అని పేరు పెట్టి.. తల్లులందరికీ శఠగోపం పెడుతున్నారని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. జగన్ వుండి వుంటే ఈపాటికి రైతు భరోసా డబ్బు వచ్చేదని ప్రజలు భావిస్తున్నారన్నారు. రైతులు ఇరవై వేలు ఎపుడు ఇస్తారా? అని ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.
జగన్ కామెంట్స్ యధావిధిగా..
‘జగనే వుండి వుంటే ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు వచ్చేవి అని విద్యార్థులు, తల్లులు అనుకుంటున్నారు. జగనే వుండి వుంటే వసతి దీవెన క్రమం తప్పకుండా వచ్చేవి అని విద్యార్థులు అనుకుంటున్నారు. వసతి, విద్యా దీవెన కింద రూ. 18,000 కోట్లు ఇచ్చాం. జగనే వుండి వుంటే పొదుపు సంఘాలకు డబ్బులు వచ్చేవి అనుకుంటున్నారు. రాష్ట్రంలో 1.80 కోట్ల మందికి రూ. 1,500 ఎపుడు ఇస్తారు? అని అడుగుతున్నారు. నా 3,000 నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తావని నిరుద్యోగులు అడుగుతున్నారు. మత్స్యకార భరోసా ఇవ్వడం లేదు. ఇవన్నీ ప్రజలు అడగడడానికి, రోడ్ ఎక్కడానికి ప్రజలు సిద్ధం అవుతారనే భయంతోనే వైట్ పేపర్లు అని డ్రామా స్టార్ట్ చేశారు.’ అని జగన్ విమర్శించారు.
ఆయనే తప్పు చేశారు..
‘కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండానే మెయిన్ డ్యామ్ పనులను చంద్రబాబు మొదలు పెట్టారు. పోలవరం నిర్మాణం బాధ్యతలు తీసుకోవడం చంద్రబాబు చేసిన తప్పు. మీరు చేసిన తప్పులు కప్పి పుచ్చుకోవడానికి వేరే వారిపై నిందలు. ఇసుక విషయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో టెండర్లకి వెళ్ళాము. అత్యంత ట్రాన్స్‌పరెంట్‌గా టెండర్లు నిర్వహించాము. దీని వల్ల ప్రతి ఏటా రాష్ట్రానికి రూ. 765 కోట్లు ఆదాయం వచ్చింది. ఐదేళ్లలో రూ. 3,825 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ డబ్బంతా చంద్రబాబు హయాంలో ఎక్కడకి వెళ్ళాయి? ఉచిత ఇసుక అంటున్న చంద్రబాబు.. వైఎస్ఆర్‌సీపీ హయంలో కంటే ఎక్కువ రేటుకు ఇసుక అమ్ముతున్నారు. చంద్రబాబు, లోకేష్ ఎన్నికల ముందు ఇసుక కొండలు, గుట్టలు అంటూ ఫోటోలు దిగారు. ఇప్పుడు ఆ ఇసుక కొండలు, గుట్టలు ఏమయ్యాయి. ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే ఎమ్మేల్యేలు, టీడీపీ నేతలు ఇసుక అమ్మారు. వారిపై చర్యలు తీసుకుంటారా? వైఎస్ఆర్‌సీపీ హయాంలోనే ఇసుక తక్కువ ధరలు వున్నాయని ప్రజలు అంటున్నారు. కళ్ళ ఎదుట దోపిడీ కనపడుతుంది. ఘనులు లీజుల గురించి మాట్లాడారు. చంద్రబాబు హయాంలో మెజర్, మైనర్ శాఖకు ఆదాయం రూ. 2,200 కోట్లు వచ్చింది. 2024 నాటికి ఆ ఆదాయం రూ. 4,000 కోట్లకు చేరింది. చంద్రబాబు హయాంలో ఏపీఎండీసీ ఆదాయం రూ. 400 కోట్లు. ఇప్పుడు రూ. 3000 కోట్లు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై దుష్ప్రచారం చేశారు. ల్యాండ్ తైటిలింగ్ యాక్టుని చివరకు రద్దు చేశారు. ఈ యాక్ట్ రద్దు చేయడంపై కేంద్రం రివర్స్ అయింది. ఇవన్నీ చేయకుండా చంద్రబాబు ఎందుకు అడ్డుకున్నారో ప్రజలు ఆలోచించాలి. ల్యాండ్ డిస్ప్యూట్ అలా కొనసాగించి చంద్రబాబు మనుషులతో తక్కువ ధరకు కోనిపించేందుకే ఇవన్నీ చేస్తున్నారు.’ అని జగన్ ఆరోపించారు.
చంద్రబాబు హయాంలో వచ్చిన బ్రాండ్లే..
‘లిక్కర్ అంశంపైనా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. బాగా తాగి పడి పోయిన వారు కూడా చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పరు. చంద్రబాబు హయాంలోనే మద్యం ఏరులై పారింది. చంద్రబాబు హయాంలో తీసుకువచ్చిన బ్రాండ్లే రాష్ట్రంలో వున్నాయి. రాష్ట్రంలో పవర్ సెక్టార్‌లో రిఫార్మ్స్ తీసుకువచ్చాము. పవర్ రిఫార్మ్స్‌లో ఎవరైనా గోల్డ్ మెడల్ ఇవాలి అంటే రాష్ట్రానికి ఇవ్వాలి. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీని గుర్తించరు. ప్రతిపక్ష నేతను కూడా గుర్తించరు.’ అని టీడీపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పించారు జగన్.
షర్మిలపై పరోక్ష కామెంట్స్..
తాము ఢిల్లీలో చేసిన ధర్నాకు అన్ని పార్టీలకు ఆహ్వానం పంపామని వైఎస్ జగన్ తెలిపారు. ఈ నిరసనకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో ఆ పార్టీని అడగాలన్నారు. పరోక్షంగా షర్మిలపై ఈ కామెంట్స్ చేశారని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్‌తో చంద్రబాబు సంబంధాలు కొనసాగిస్తున్నారని జగన్ ఆరోపించారు.