Share News

Andhra Pradesh: మట్టినీ వదలని వైసీపీ నేతలు..

ABN , Publish Date - Aug 18 , 2024 | 01:46 PM

వైసీపీ ప్రభుత్వంలో మట్టి దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. నేతల కనుసన్నల్లో మట్టి మాఫియా కోట్ల రూపాయలు దోచుకున్నది. ఐదేళ్లపాటు జిల్లాలో ఇటువంటి అక్రమ రవాణాకు అడ్డూ అదుపూలేకుండా పోయింది. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను తేల్చేందుకు..

Andhra Pradesh: మట్టినీ వదలని వైసీపీ నేతలు..
Land Grabbing

పొలాలను తవ్వుకుంటాం. మెరకలను తొలగిస్తాం. చెరువులు తవ్వుకుంటాం. మట్టిని వెంచర్‌లలో పూడ్చుకుంటాం. అనుమతులు లేకపోయినా ఫర్వాలేదు. నేతల ఆశీస్సులు ఉంటే చాలు అనుకునే మట్టి మాఫియాకు అడ్డుకట్ట పడనుంది. వెంచర్‌లలో మట్టిని పూడ్చుకునే అనుమతులకు కూటమి ప్రభుత్వం బ్రేక్‌ వేసింది. మైనింగ్‌ శాఖకు ఆ దిశగా ఆదేశాలు జారీచేసింది. వైసీపీ హయాంలో సాగిన దందాను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంది. కొత్త మార్గదర్శకాలు వచ్చిన తర్వాతే మైనింగ్‌ శాఖ అనుమతులు మంజూరు చేయనుంది. గతంలో జరిగిన దందాపైనా కూటమి ప్రభుత్వం కన్నేసినట్టు సమాచారం.


భీమవరం, ఆగష్టు 18: వైసీపీ ప్రభుత్వంలో మట్టి దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. నేతల కనుసన్నల్లో మట్టి మాఫియా కోట్ల రూపాయలు దోచుకున్నది. ఐదేళ్లపాటు జిల్లాలో ఇటువంటి అక్రమ రవాణాకు అడ్డూ అదుపూలేకుండా పోయింది. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను తేల్చేందుకు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తోంది. జిల్లాలోనూ జరిగిన దందాపై దృష్టి సారించింది. ఇప్పటికే తణుకు, తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీఆర్‌ కుంభకోణంపై రాష్ట్ర స్థాయి విచారణ చేపట్టనుంది. సీబీసీఐడీ రంగంలోకి దిగనుంది, మరోవైపు జగనన్న ఇళ్ల పేరుతో సాగిన దందాపైనా కూటమి ప్రభుత్వం దర్యాప్తుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు కూటమి నేతల దృష్టి గత ఐదేళ్లలో వైసీపీ నేతల మట్టి, ఇసుక దందాలపైనా దృష్టి సారించారు. అప్పట్లో సొంత వెంచర్‌లకు వైసీపీ నేతలు మట్టిని తరలించారు.


భీమవరంలో మాజీదే పెద్ద వెంచర్‌..

భీమవరం నియోజకవర్గంలో మాజీ ప్రజాప్రతినిధి తన హయాంలో సొంత వెంచర్‌ కోసం మట్టిని అక్రమంగా తరలించేందుకు ప్రోత్సహించారు. సదరు నేత పేరుతో వైసీపీకి చెందిన నేతలు భీమవరం, వీరవాసరం మండలంలో కోట్లాది రూపాయల విలువైన మట్టిని తరలించారు. భీమవరంలో 84 ఎకరాల పేదల ఇళ్ల లేఅవుట్‌ను వైసీపీ ప్రభుత్వం పూడ్చలేకపోయింది. అధికారులకు నాడు మట్టి లభ్యం కాలేదు. అదే మాజీప్రజాప్రతినిధి వెంచర్‌తోపాటు, దాని చుట్టుపక్కలా దాదాపు 70 ఎకరాలకు మాత్రం మట్టి లభ్యమైంది. అక్రమంగా తరలించి వెంచర్‌ను పూడ్చారు. దానికోసం ప్రభుత్వానికి పైసా పన్నుకూడా చెల్లించలేదు. మట్టిని తరలించేటప్పుడు అధికారులు అడ్డు తగిలితే వైసీపీ హయాంలో ప్రజాప్రతినిధి పేరును అక్రమార్కులు వినియోగించుకున్నారు. అయితే ముందుగా మట్టిని మాజీ ప్రజాప్రతినిధి వెంచర్‌కు తరలిస్తేనే ఇతర ప్రాంతాలకు రవాణా చేసే అవకాశం కల్పించేవారు. దీనివల్ల ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరలేదు. పేదల ఇళ్లకోసం సేకరించిన 84 ఎకరాల స్థలాన్ని కూడా వదిలేశారు. ఇప్పటికే పేదల ఇళ్ల స్థలం నిర్మాణానికి నోచుకోలేదు. వర్షాకాలంలో స్థలం చెరువుమాదిరిగా తయారైపోయింది. జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ వైసీపీ నేతలు ఇటువంటి దందా చేయడంలో ఆరితేరిపోయారు.


ఆదేశాలు బుట్టదాఖలు..

వెంచర్‌ పూడికలో మైనింగ్‌ శాఖకు పన్నుకూడా చెల్లించలేదు. జిల్లా వ్యాప్తంగా వెంచర్‌లపై వైసీపీ ప్రభుత్వంలోనే పన్ను వసూలు చేయాలంటూ మైనింగ్‌ శాఖకు ఆదేశాలిచ్చారు. అందుకు అనుగుణంగా మైనింగ్‌ విభాగంలోని విజిలెన్స్‌ శాఖ తొలుత జిల్లాలోని వెంచర్‌లను గుర్తించింది. జరిమానాతో సహా వెంచర్‌లపై పన్ను వసూలు చేయాలంటూ గత ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జిల్లా వ్యాప్తంగా రూ. 45 కోట్లు వసూలు చేయాలంటూ లక్ష్యాన్ని నిర్దేశించింది. భూవినియోగ మార్పిడిపైనా రుసుము వసూలు చేయాలని ఉత్తర్వులు జారీచేసి హడావుడి చేశారు. వినియోగమార్పిడి పన్నును కూడా మూఽడు శాతం నుంచి 5శాతానికి పెంచారు. అనుమతి లేకుండా వ్యవసాయ భూములను పూడ్చితే రెట్టింపు పన్ను వసూలు చేయాలని దిశానిర్దేశం చేశారు. రెవిన్యూశాఖ కూడా ఇటువంటి వెంచర్‌లపై కన్నేసింది. గ్రామస్థాయిలో వీఆర్‌వోల ద్వారా వెంచర్‌లను గుర్తించారు. తీరా అమలులోకి వచ్చేసరికి తుస్సుమనిపించారు. వైసీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు వెనక్కుతగ్గారు. పన్ను వసూలు చేస్తే ముందుగా వైసీపీ నేతలనుంచి వసూలు చేయాల్సి ఉంటుంది. దాంతో అధికారులు చేతులెత్తేశారు.


కొత్త మార్గదర్శకాలు రావాల్సిందే..

తాజాగా పెనాల్టీలు చెల్లించి అనుమతులు తీసుకుందామన్నా కుదరదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతులను నిలిపివేశారు. కొత్త మార్గదర్శకాలు వచ్చేంత వరకు అనుమతులు ఇవ్వకూడదంటూ మైనింగ్‌ అధికారులు ఆదేశాలిచ్చారు. దాంతో పెనాల్టీలు చెల్లించి అయినా సరే వెంచర్‌లకు అనుమతి తెచ్చుకోవడం కుదరడం లేదు. కొత్త వెంచర్‌లలోనూ మట్టి పూడికకు అనుమతి తెచ్చుకోవాలన్నాసరే కొత్త మార్గదర్శకాలకోసం వేచి చూడాల్సిందే. అప్పటిదాకా జిల్లాలో మైనింగ్‌ అధికారులు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించనున్నారు.


Also Read:

మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. అధికారుల కీలక ప్రకటన..

వాకింగ్ వల్ల లాభాలే కాదు.. నష్టాలు కూడా ఉంటాయి.

జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Aug 18 , 2024 | 01:46 PM