Share News

Tirumala: తిరుమల రామానుజాచార్యులకు అరుదైన కానుక సమర్పించిన డీఎన్వీ ప్రసాద్ స్థపతి..

ABN , Publish Date - Nov 16 , 2024 | 07:29 PM

తిరుమల శ్రీవారి ఆలయంలో కొలువైన శ్రీ భాష్యకార రామానుజాచార్యులకు వజ్రాలు పొదిగిన బంగారు హారాన్ని విగ్రహాల రూపశిల్పి డీఎన్వీ ప్రసాద్ స్థపతి సమర్పించారు.

Tirumala: తిరుమల రామానుజాచార్యులకు అరుదైన కానుక సమర్పించిన డీఎన్వీ ప్రసాద్ స్థపతి..

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో కొలువైన శ్రీ భాష్యకార రామానుజాచార్యులకు వజ్రాలు పొదిగిన బంగారు హారాన్ని విగ్రహాల రూపశిల్పి డీఎన్వీ ప్రసాద్ స్థపతి సమర్పించారు. తన కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకున్న స్థపతి రూ.11 లక్షల విలువైన హారాన్ని రామానుజాచార్యులకు అందించారు. హారంలో 132 వజ్రాలు, 57 కెంపులు పొదిగి ఉన్నట్లు ఆయన తెలిపారు.


హైదరాబాద్‌లోని 216 అడుగుల ఎత్తైన సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల విగ్రహ రూపశిల్పి ఈ డీఎన్వీ ప్రసాద్ స్థపతినే. హైదరాబాద్‌లోని మానేపల్లి జ్యువెల్లర్స్‌తో ఈ హారాన్ని ఆయన తయారు చేయించారు. తిరుమల శ్రీవారితో విడదీయరాని అనుబంధం ఉన్న రామానుజాచార్యులకు ఏదో ఒక కైంకర్యం సమర్పించాలనే సంకల్పం మేరకు చినజీయర్ స్వామి ఆశీస్సులతో వజ్రాల హారాన్ని సమర్పించినట్లు డీఎన్వీ ప్రసాద్ స్థపతి తెలిపారు.


టీటీడీ నిర్వహిస్తున్న శిల్ప కళాశాల పూర్వ విద్యార్థి అయిన డీఎన్వీ ప్రసాద్ స్థపతి అంచెలంచెలుగా ఎదిగారు. చినజీయర్ స్వామి సంకల్పించిన ప్రపంచంలోనే అతి ఎత్తైన శ్రీ రామానుజాచార్యుల బృహత్ విగ్రహాన్ని, మరో 108 దివ్య దేశాలను రూపకల్పన గావించిన స్థపతిగా ప్రపంచఖ్యాతిని డీఎన్వీ ప్రసాద్ పొందారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓంకారేశ్వర్‌లో ప్రతిష్టించిన 108 అడుగుల శ్రీ ఆది శంకరాచార్యుల విగ్రహ నిర్మాణంలోనూ ఆయన కీలక భూమిక పోషించారు. దేశ విదేశాల్లో అనేక హిందూ దేవాలయాలను రూపొంచించారు డీఎన్వీ ప్రసాద్ స్థపతి.


చినజీయర్ స్వామి ఆశీస్సులతో తన చిన్నతనం నుంచి శ్రీవారి దర్శనానికి అనేక పర్యాయాలు వచ్చేవాడినని డీఎన్వీ ప్రసాద్ స్థపతి తెలిపారు. అన్నమయ్య కీర్తనల ప్రభావంతో వచ్చిన ప్రతిసారీ తిరుమల నడకదారిలో ఉండే త్రోవ భాష్యకారులని పిలువబడే శ్రీ రామానుజాచార్యులను, శ్రీవారి ఆలయంలో జ్ఞాన ముద్రలో ఉండే రామానుజాచార్యులను ఆరాధించే వాడినని ఆయన తెలిపారు. ఆ అనుగ్రహం తనను ఎన్నో గొప్పగొప్ప నిర్మాణాలు చేయగలిగే స్థపతిగా, ఇద్దరు జగద్గురువుల బృహత్ విగ్రహ నిర్మాణాలలో కీలకపాత్ర పోషించే వ్యక్తిగా తీర్చిదిద్దిందని డీఎన్వీ ప్రసాద్ స్థపతి పేర్కొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 07:29 PM