HYD: మూడు స్థానాలపై కాంగ్రెస్ నజర్..
ABN , Publish Date - May 07 , 2024 | 04:56 AM
గ్రేటర్ హైదరాబాద్‌లో కీలకంగా ఉన్న సికింద్రాబాద్, మల్కాజిగిరి ఎంపీ స్థానాలను.. వాటితోపాటు మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులేస్తోంది.
సికింద్రాబాద్, మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ బాధ్యత రేవంత్ సన్నిహితుడికి
నేతలు, కార్యకర్తల నడుమ సమన్వయ సాధన.. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా
అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ, రాజధాని శివారు జిల్లాల్లో గెలుపునకు కృషి
హైదరాబాద్ సిటీ, మే 6 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్‌లో కీలకంగా ఉన్న సికింద్రాబాద్, మల్కాజిగిరి ఎంపీ స్థానాలను.. వాటితోపాటు మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులేస్తోంది. అందులో భాగంగా.. అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో గెలుపునకు దోహదపడిన తన అత్యంత సన్నిహితుణ్ని సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దింపారు. వారం రోజులుగా ఆయన ఆయా నియోజకవర్గాల అభ్యర్థులతో పాటు ముఖ్య నేతలను సమన్వయం చేస్తూ.. అంతా తానై ప్రచారాన్ని ఉధృతం చేశారు. పార్టీకి గంపగుత్తగా ఓట్లు పడే బూత్‌లను గుర్తించి వాటిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి పార్టీ విజయానికి ఆయన కృషి చేస్తున్నట్లు తెలిసింది. ఈ మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో.. కాంగ్రెస్ ఒక్కచోట కూడా గెలవలేదు.
సాక్షాత్తూ రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలోనూ అదే పరిస్థితి. ఆ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలోనూ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో ఓడిన రేవంత్ రెడ్డిని.. ప్రశ్నించే గొంతుకగా గుర్తించిన మల్కాజిగిరి ప్రజలు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన్ను తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. ఎంపీగా గెలిపించారు. ఆ మల్కాజిగిరి స్థానమే తాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావడానికి దోహదపడిందని పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి సైతం ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చోట్లా పోటీ హోరాహోరీగా ఉంది. ఇక.. తన సొంత నియోజకవర్గం ఉన్న మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానంలోనూ ప్రత్యర్థి అభ్యర్థి బలంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో.. సీఎం రేవంత్ ఈ మూడు స్థానాలనూ సీరియ్‌సగా తీసుకున్నట్లు తెలిసింది. అవి ఏమాత్రం చేజారకుండా.. ట్రబుల్ షూటర్ అయిన తన సన్నిహితుడికి బాధ్యత అప్పగించినట్లు తెలిసింది. గత ఎంపీ ఎన్నికల్లోనూ, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన పార్టీ తరఫున కీలకంగా పనిచేశారని.. ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు, నగర శివారు జిల్లాలోనూ పలు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ దక్కించుకునేందుకు దోహద పడ్డారని సమాచారం.
అలిగినవారిని బుజ్జగిస్తూ..
సికింద్రాబాద్, మల్కాజిగిరి ఎంపీ స్థానాల పరిధిలో అభ్యర్థులు ఖరారు అయిన తర్వాత.. కొందరు కాంగ్రెస్ నేతలు తమకు సీటు దక్కలేదని అలకబునారు. దీనికితోడు.. ఆ రెండుచోట్లా కాంగ్రెస్ అభ్యర్థులు దానం నాగేందర్, పట్నం సునీత మహేందర్ రెడ్డి మొన్నటి వరకూ వేరే పార్టీలో ఉన్నారు. దీంతో.. వారికి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో సమన్వయం లేదు. వారితో కొందరు కలిసిపోతున్నా.. మరికొందరు సహకరించే పరిస్థితి లేదు. అలాంటిచోట్ల సీఎం సన్నిహితుడు వారి మధ్య సమన్వయం కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణకు.. ఖైరతాబాద్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగినప్పుడు.. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన పీజేఆర్ కూతురు విజయారెడ్డికి సమాచారం ఇవ్వలేదు. ఇది పార్టీలో విభేదాలకు అద్దం పట్టే ఘటన.
ఈ నేపథ్యంలో.. సదరు ట్రబుల్ షూటర్.. విజయా రెడ్డి, దానం నాగేందర్ మధ్య సమన్వయం కుదిర్చి, ఇద్దరూ కలిసే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనే విధంగా సర్దుబాటు చేసినట్లు తెలిసింది. అదేవిధంగా బొంతు రామ్మోహన్‌ను ప్రచారంలో భాగం చేయడంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. అలాగే.. నియోజకవర్గాల వారీగా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాలు జరిపి క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి తెలుసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో బూత్‌ల వారిగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలకు వచ్చిన ఓట్ల గురించి.. కష్టపడితే ఓట్లు వచ్చేందుకు ఉన్న అవకాశాలున్న ప్రాంతాల గురించి ఆయన ఆరా తీస్తునట్లు తెలిసింది. అధికంగా పోలింగ్ జరిగే కాలనీలు, బస్తీలలో బూత్‌ల వారిగా ఓట్లు వేయించే ఇతర పార్టీల కార్యకర్తలనూ కాంగ్రె్‌సలో చేర్చుకోవడం, వారికి స్థానికంగా బాధ్యతలు అప్పగించడం వంటి చర్యలను ఆయన తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.