Share News

Hiccups: ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి, వస్తే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకోండి..

ABN , Publish Date - Sep 18 , 2024 | 07:20 AM

మన శరీరంలో డయాఫ్రమ్ అనే కండరం ఉంటుంది. ఇది శ్వాస తీసుకునేందుకు, వదిలేందుకు ఉపయోగపడే కండరం. ఇది అస్వస్థతకు గురైనప్పుడు మనకు ఎక్కిళ్లు వస్తాయి. కండరం అకస్మాత్తుగా సంకోచించడం వల్ల ఎక్కిళ్లు వస్తుంటాయి.

Hiccups: ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి, వస్తే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకోండి..

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా మనకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అందులో క్యాన్సర్, గుండె, లివర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ఉంటాయి. అలాగే ఓ వారం రోజులపాటు ఇబ్బంది పెట్టి తగ్గిపోయే వ్యాధులూ ఉంటాయి. జ్వరం, జలుబు, దగ్గు వంటివి ఆ కోవలోకే వస్తాయి. అయితే మనకు వచ్చే అలాంటి చిన్నచిన్న ఆరోగ్య సమస్యల్లో ఎక్కిళ్లు ఒకటి. ఇది ప్రాణాంతకం కాకపోయినా, నిమిషాల్లో తగ్గిపోయినా ఉన్నంత సేపు చాలా ఇబ్బంది పెడుతుంది. ఆగకుండా కొన్ని నిమిషాలపాటు వచ్చే ఎక్కిళ్లతో చాలా ఇబ్బందికి గురవుతాం. అయితే ఇవి ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు ఏం చేయాలి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ఎక్కిళ్లు ఎందుకు వస్తాయంటే?

మన శరీరంలో డయాఫ్రమ్ అనే కండరం ఉంటుంది. ఇది శ్వాస తీసుకునేందుకు, వదిలేందుకు ఉపయోగపడే కండరం. ఇది అస్వస్థతకు గురైనప్పుడు మనకు ఎక్కిళ్లు వస్తాయి. కండరం అకస్మాత్తుగా సంకోచించడం వల్ల ఎక్కిళ్లు వస్తుంటాయి.


చాలా కారణాలే ఉన్నాయి..

డయాఫ్రమ్ కండరం అస్వస్థతకు గురై ఎక్కిళ్లు వచ్చేందుకు చాలా కారణాలే ఉన్నాయి. వేగంగా తినడం వల్ల పొట్టలో గాలి చేరి ఎక్కిళ్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆహారాన్ని నెమ్మదిగా తినాలి. బాగా ఆకలిగా ఉన్న సమయంలో తింటే ఎక్కిళ్లు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే మసాలా దినుసులు ఎక్కువగా వేసిన ఆహారం భుజించడం వల్లా ఎక్కిళ్లు వస్తుంటాయి. తరచూ ధూమపానం చేసే వారికి కూడా ఎక్కిళ్లు వచ్చే అవకాశం లేకపోలేదు. మానసిక ఆందోళన, ఒత్తిడి, మనోవేదనకు గురైయ్యే వారిలోనూ తరచూ ఎక్కిళ్లు వస్తుంటాయి. అలాగే సోడా, బీర్ వంటి పానీయాలు తాగినా ఎక్కిళ్లు వస్తాయి.


ఎక్కిళ్లు ఎలా తగ్గుతాయంటే?

డయాఫ్రమ్ కండరం అస్వస్థతకు గురై ఎక్కిళ్లు వచ్చేటప్పుడు కొన్ని సెకన్లపాటు శ్వాస బిగపట్టడం వల్ల ఎక్కిళ్లు తగ్గుతాయి. మెల్లిగా డీప్ శ్వాస తీసుకోవడం ద్వారా కూడా ఎక్కిళ్లకు చెక్ పొట్టొచ్చు. అవి వచ్చే సమయంలో మీ వద్ద పేపర్ బ్యాగ్ ఉంటే అందులో శ్వాస తీసుకోండి. ఇలా చేయడం వల్ల ఎక్కిళ్లు తగ్గుతాయి. అలాగే చల్లటి నీరు తాగడం లేదా ముఖం కడగడం వల్లా ఎక్కిళ్ల సమస్యకు చెక్ పెట్టొచ్చు. బెల్లం, షుగర్ వంటి చక్కెర పదార్థాలను నెమ్మదిగా నమలడం వల్ల ఎక్కిళ్లు తగ్గే అవకాశం ఉంది. మరో అద్భుతమైన చిట్కా ఏంటంటే.. చెంచా బియ్యం తినడం వల్ల ఎక్కిళ్లు తగ్గిపోతాయి. ఆగకుండా వస్తుంటే ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌లో నుంచి ఐస్ క్యూబ్ తీసి నెమ్మదిగా నమలడం మెుదలుపెట్టండి. దీని వల్ల ఉపశమనం లభిస్తుంది. చెంచాడు లెమన్ జ్యూస్ తాగడం వల్ల కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి. అలాగే వెల్లుల్లి రెబ్బను నోట్లో వేసుకుని నమలడం ఎక్కిళ్ల సమస్యకు పరిష్కారం చూపుతుంది.


అయితే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. సాధారణంగా ఎక్కిళ్లు వచ్చినప్పుడు కొన్ని నిమిషాల్లో తగ్గిపోతాయి. పైన తెలిపిన చిట్కాలు పాటించినప్పటికీ ఆగకుండా వస్తుంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి. అలాగే నొప్పి, జ్వరం, వాంతులు వంటి సమస్యలు ఉన్నప్పుడు ఆగకుండా ఎక్కిళ్లు వచ్చినా వెంటనే వైద్యల వద్దకు వెళ్లడం మంచిది.

Updated Date - Sep 18 , 2024 | 07:20 AM