Scientific Research: వయసును ఇక అడ్డుకోవచ్చు!
ABN , Publish Date - Jul 19 , 2024 | 05:21 AM
ఎక్కువ కాలంపాటు జీవించటం, ఆరోగ్యంగా జీవితాన్ని గడపటం.. ఎన్ని తరాలు మారినా, ఎన్ని శతాబ్దాలు గడిచిపోయినా.. ఎప్పటికప్పుడు మనుషులు కోరుకునేది ఇదే. కాలం గడుస్తున్నకొద్దీ మనిషి సగటు జీవితకాలం పెరుగుతోంది.
వయసుతోపాటే శరీరాన్ని క్షీణింపజేసే ఐఎల్-11 ప్రోటీన్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు
వాషింగ్టన్, జూలై 18: ఎక్కువ కాలంపాటు జీవించటం, ఆరోగ్యంగా జీవితాన్ని గడపటం.. ఎన్ని తరాలు మారినా, ఎన్ని శతాబ్దాలు గడిచిపోయినా.. ఎప్పటికప్పుడు మనుషులు కోరుకునేది ఇదే. కాలం గడుస్తున్నకొద్దీ మనిషి సగటు జీవితకాలం పెరుగుతోంది. అయితే, దానిని మరింత పెంచటానికి, ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ సంభవించే శారీరక దుర్భలత్వాన్ని అధిగమించటానికి అనేక (యాంటీ ఏజింగ్) పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ దిశగా.. సింగపూర్ శాస్త్రవేత్తలు తాజాగా ఓ ముందంజ వేశారు. వయసు పెరుగుదలకు కారణమవుతున్న ఓ ప్రోటీన్‌ను వారు తొలిసారిగా గుర్తించారు.
ఈ ప్రోటీన్ ఉత్పత్తిని అడ్డుకోవటం ద్వారా.. వయసు పెరుగుతున్న కొద్దీ సంభవించే శారీరక క్షీణత ప్రక్రియ వేగాన్ని తగ్గించవచ్చని తెలిపారు. తద్వారా దీర్ఘకాలం జీవించే అవకాశం ఉంటుందన్నారు. సింగపూర్‌లోని డ్యూక్-ఎన్‌యూఎ్‌స మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. మనుషుల్లో గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తుల పనితీరులో ఇంటర్‌ల్యూకిన్ (ఐఎల్-11) అనే ప్రోటీన్ కీలక ప్రభావం చూపుతున్న విషయాన్ని వీరు గుర్తించారు. ఈ ప్రోటీన్ ఉత్పత్తి పెరుగుతున్నా కొద్దీ కాలేయంలో, పొట్టలో కొవ్వు పేరుకుపోతోందని, కండరాలు బలహీనపడుతున్నాయని వెల్లడైంది. ఇవన్నీ శారీరక ధృడత్వాన్ని తగ్గించి.. తద్వారా వయసు పెరుగుదల ప్రక్రియను కొనసాగించే లక్షణాలే.
ఆడ ఎలుకల్లో ఆయుర్దాయం మరింత వృద్ధి
సింగపూర్ శాస్త్రవేత్తలు తమ పరిశోధన కొనసాగిస్తూ ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించారు. వాటి నుంచి ఐఎల్-11 ప్రోటీన్‌ను తొలగించటం, ఐఎల్-11 నిరోధక చికిత్సను నిర్వహించటం వంటివి జరిపారు. దీని ద్వారా ఎలుకల్లో.. వయసు పెరుగుతున్న కొద్దీ సంభవించే శారీరక క్షీణత, వ్యాధులు, బలహీనత మొదలైన వాటి నుంచి రక్షణ లభించింది. వాటి సగటు జీవితకాలం 24.9ు పెరిగింది. 75 వారాల వయసులో ఉన్న ఎలుకల్లో (ఇది మనుషుల్లో దాదాపు 55 ఏళ్ల వయసుతో సమానం) ఐఎల్-11 నిరోధక చికిత్సను ప్రారంభించి అవి మరణించే వరకు కొనసాగిస్తే.. మగ ఎలుకల సగటు జీవితకాలం 22.5ు, ఆడ ఎలుకల సగటు జీవితకాలం 25ు పెరిగింది. అంతేకాదు, ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చే తెల్ల కొవ్వు బదులు క్యాలరీలను ఖర్చు చేసే బ్రౌన్‌ఫ్యాట్ ఉత్పత్తి ఎలుకల్లో మొదలైంది. గుండె సంబంధిత సమస్యల నుంచి కూడా వాటికి రక్షణ లభించింది.
ఈ ఫలితాలపై డ్యూక్-ఎన్‌యూఎ్‌స డీన్ ప్రొఫెసర్ థామస్ కాఫ్‌మన్ మాట్లాడుతూ, ఐఎల్-11 ప్రోటీన్ గురించి తాజాగా వెల్లడైన అంశాలు.. వృద్ధులు మరింత ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించటానికి దోహదపడతాయని చెప్పారు. కండరాల పటుత్వం, శారీరక దృఢత్వం పెరగటం ద్వారా వృద్ధులు జారి పడిపోయే ప్రమాదం కూడా గణనీయంగా తగ్గుతుందన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యవంతమైన దీర్ఘకాలిక జీవితాలు గడిపేలా ఐఎల్-11 చికిత్సను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నది మా లక్ష్యం’ అని పరిశోధనలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త స్టార్ట్‌కుక్ పేర్కొన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు తాజాగా సైన్స్ జర్నల్ నేచర్‌లో ప్రచురితమయ్యాయి. వయసు పెరుగుదల ప్రక్రియను నెమ్మదింపజేసే పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. మనుషుల జీవితకాలాన్ని ఒక ఏడాది కాలం పాటు పొడిగిస్తే.. అది 38 ట్రిలియన్ డాలర్ల (రూ.83,62,225 కోట్ల) సంపదను సృష్టిస్తుందని అంచనాలున్నాయి.