Share News

Google: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. గూగుల్‌ని ఇరికించేసిన ఎలాన్ మస్క్

ABN , Publish Date - Jul 29 , 2024 | 05:44 PM

గత కొన్ని నెలలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక్కొక్కటిగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తొలుత డొనాల్డ్ ట్రంప్‌పై ఓ దుండగుడు హత్యాయత్నం చేయడం..

Google: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. గూగుల్‌ని ఇరికించేసిన ఎలాన్ మస్క్
Elon Musk

గత కొన్ని నెలలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక్కొక్కటిగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తొలుత డొనాల్డ్ ట్రంప్‌పై (Donald Trump) ఓ దుండగుడు హత్యాయత్నం చేయడం, ఆ తర్వాత ఎన్నికల రేసు నుంచి జో బైడెన్ (Joe Biden) తప్పుకొని కమలా హారిస్ (Kamala Harris) రంగంలోకి దిగడం వంటివి చకచకా జరిగిపోయాయి. దీంతో.. ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఓవైపు తనపై జరిగిన దాడి కారణంగా ట్రంప్‌కు మద్దతు గణనీయంగా పెరగ్గా.. మరోవైపు కమలాకు భారీగా విరాళాలు అందుతున్నాయి. ఇలాంటి తరుణంలో.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ఈ వ్యవహారంలోకి ప్రముఖ టెస్ సంస్థ గూగుల్‌ని లాగాడు. ఈ ఎన్నికల్లో గూగుల్ జోక్యం చేసుకుంటోందంటూ పరోక్షంగా ఆరోపించాడు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం.. వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరికలు జారీ చేశాడు.


గూగుల్ జోక్యం చేసుకుంటోందా?

గూగుల్‌లో ప్రెసిడెంట్ డొనాల్డ్ అని ఎలాన్ మస్క్ టైప్ చేయగా.. సజెషన్స్‌లో ‘ప్రెసిడెంట్ డొనాల్డ్ డక్’, ‘ప్రెసిడెంట్ డొనాల్డ్ రీగన్’ పేర్లు కనిపించాయి. దీంతో.. వెంటనే స్క్రీన్‌షాట్ తీసి, ఎక్స్ వేదికగా దానిని షేర్ చేశాడు. ‘‘వావ్.. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై గూగుల్ నిషేధం విధించిందా? గూగుల్ ఏమైనా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోందా?’’ అనే ప్రశ్నలు సంధించాడు. మస్క్ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘గూగుల్ సంస్థ డెమోక్రాట్ల అధీనంలో ఉంది’ అని కామెంట్ చేశాడు. అందుకు మస్క్ సమాధానమిస్తూ.. ‘ఎన్నికల్లో వాళ్లు జోక్యం చేసుకుంటే, వాళ్లు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంటారు’’ అని బదులిచ్చాడు. మరికొందరేమో మస్క్‌పైనే విమర్శలు గుప్పించారు. ‘ఎక్స్’లోనూ మీకు నచ్చని ఖాతాలపై నిషేధం విధించారని.. అలాంటప్పుడు మీకు, గూగుల్‌కు తేడా ఏముందంటూ నిలదీశారు.


డొనాల్డ్ ట్రంప్ vs కమలా హారిస్

ఇదిలావుండగా.. బైడెన్ వైదొలిగిన తర్వాత కమలా హారిస్ రాకతో అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఇద్దరికీ దాదాపు సమానమైన మద్దతు లభిస్తోందని.. పోటీ గట్టిగానే ఉండబోతోందని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ పోల్ ప్రకారం.. హారిస్‌కు 47 శాతం, ట్రంప్‌కు 49 శాతం ఓట్లు నమోదయ్యే ఛాన్స్ ఉందట. అంటే.. ఇద్దరి మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంది. చూస్తుంటే.. ఈసారి పోరు హోరీహోరాగానే ఉండబోతోందని తెలుస్తోంది. మరి.. ఎవరు గెలుస్తారన్నది వేచి చూడాల్సిందే.

Read Latest International News and Telugu News

Updated Date - Jul 29 , 2024 | 11:08 PM