Share News

Donald Trump: జో బైడెన్‌పై కుట్ర జరిగిందా.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 28 , 2024 | 03:43 PM

ఇటీవల అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి వైదొలగిన జో బైడెన్ వ్యవహారంపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల రేసు నుంచి ఆయన్ను బలవంతంగా..

Donald Trump: జో బైడెన్‌పై కుట్ర జరిగిందా.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Donald Trump

ఇటీవల అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి వైదొలగిన జో బైడెన్ (Joe Biden) వ్యవహారంపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల రేసు నుంచి ఆయన్ను బలవంతంగా తప్పించారని, దీని వెనుక డెమోక్రటిక్ పార్టీ పెద్ద కుట్ర పన్నిందని ఆరోపించారు. రాజ్యాంగంలోని 25వ అధికరణను బూచిగా చూపించి మరీ.. ఆయన్ను తప్పుకోవాల్సిందిగా బెదిరించారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని బైడెన్ ఆశించారని, కానీ వాళ్లు పోటీ చేయనివ్వకుండా తప్పించారంటూ పేర్కొన్నారు. శనివారం మిన్నెసోటాలో జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.


సొంత పార్టీ వాళ్లే బెదిరించారు

‘‘అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి బైడెన్ వైదొలగడం వెనుక డెమోక్రాట్ల కుట్ర దాగి ఉంది. ఆయనకు 14 మిలియన్ ఓటర్ల మద్దతు ఉంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన అనుకున్నారు. కానీ.. వాళ్లు పోటీ చేయనివ్వకుండా తప్పించారు. ఆయన పట్ల వాళ్లు చాలా దారుణంగా ప్రవర్తించారు. బరి నుంచి తప్పుకోకపోతే.. అవమానకర రీతిలో తప్పించాల్సి వస్తుందని సొంతపార్టీవారే బెదిరించారు. ఇందుకు రాజ్యాంగంలోకి 25వ అధికరణను బూచిగా చూపించారు. ‘మానసికంగా, శారీరకంగా మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీరే స్వయంగా తప్పుకోండి.. లేకపోతే 25వ అధికరణ ద్వారా బలవంతంగా తప్పించాల్సి వస్తుంది’ అని డెమోక్రాట్లు బెదిరింపుల కారణంగా బైడెన్ తప్పుకున్నారు’’ అంటూ డొనాల్ట్ ట్రంప్ చెప్పుకొచ్చారు.


అసలేంటి ఈ 25వ అధికరణ?

ఒక అధ్యక్షుడు శారీరకంగా, మానసికంగా అసమర్థుడని భావిస్తే.. ఉపాధ్యక్షురాలితో పాటు కేబినెట్‌కు ఆ అధ్యక్షుడిని (ఆయన/ఆమె) తప్పించే అధికారం ఉంటుంది. అంతేకాదు.. అధ్యక్షుడు ఉన్నట్లుండి రాజీనామా చేసినా, ఏదైనా ప్రమాదంలో మరణించినా.. వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టవచ్చని ఈ అధికారణ తెలియజేస్తుంది. దీనిని అమెరికన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్య తర్వాత తీసుకొచ్చింది. ఈ అధికరణను అడ్డం పెట్టుకొని.. బైడెన్‌ను అధ్యక్ష ఎన్నికల బరి నుంచి సొంత పార్టీ వాళ్లే తప్పించారని ట్రంప్ ఆరోపిస్తున్నారు.


బరిలోకి దిగిన కమలా హారిస్

జో బైడెన్ రెండోసారి కూడా అధ్యక్ష ఎన్నికల బరిలో నిల్చోవాలని అనుకున్నారు. అందుకోసం ఆయన మొన్నటిదాకా జోరుగా ప్రచార కార్యక్రమాలతో పాటు ఫండ్ రైజింగ్ ఈవెంట్లను కూడా నిర్వహించారు. కానీ.. జులై 20వ తేదీన తాను ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో.. ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) రంగంలోకి దిగారు. మెజారిటీ పార్టీ ప్రతినిధుల ఆమోదంతో ఆమె అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో నిల్చున్నారు.

Read Latest International News and Telugu News

Updated Date - Jul 28 , 2024 | 03:43 PM