Israel-Hamas War: టర్కీ అధ్యక్షుడు స్ట్రాంగ్ వార్నింగ్.. ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి మరీ..
ABN , Publish Date - Jul 29 , 2024 | 04:34 PM
గతేడాది అక్టోబర్ 7వ తేదీన ప్రారంభమైన ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా.. హమాస్‌ని పూర్తిగా అంతం చేయాలన్న ఉద్దేశంతో గాజాలో...
గతేడాది అక్టోబర్ 7వ తేదీన ప్రారంభమైన ఇజ్రాయెల్, హమాస్‌ల (Israel Hamas War) మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా.. హమాస్‌ని పూర్తిగా అంతం చేయాలన్న ఉద్దేశంతో గాజాలో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడుల కారణంగా అమాయక ప్రజలు చనిపోతున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. ఇజ్రాయెల్ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ (Tayyip Erdogan) తీవ్రంగా ఖండించారు. అంతేకాదు.. గాజాలో దాడులను ఆపాలని, అవసరమైతే ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి దాడులు జరుపుతామని వార్నింగ్ ఇచ్చారు.
ఇజ్రాయెల్‌కు వార్నింగ్
ఓ కార్యక్రమంలో తయ్యిప్ ఎర్డోగాన్ మాట్లాడుతూ.. ‘‘గాజాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులనను తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలస్తీనా ప్రజలకు టర్కీ అండగా నిలుస్తుంది. పాలస్తీనాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్ని అడ్డుకోవడానికి మనం బలంగా ఉండాలి. గతంలో లిబియాలోకి, అలాగే నాగోర్నో-కరాబాఖ్‌లోకి ప్రశేవించినట్టే.. ఇజ్రాయెల్‌లోకి ప్రవేశిస్తాం. అదే జరిగితే.. వారి సైన్యంపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి’’ అని పేర్కొన్నారు. తాము తలచుకుంటే చేయనిదంటూ ఏమీ లేదని తేల్చి చెప్పారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే.. తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. తాము ఇలా ఎందుకు చేయకూడదని చెప్పడానికి కారణాలేమీ లేవని.. ఇటువంటి చర్యలు తీసుకోవాలంటే తాము బలంగా ఉండాలని చెప్పుకొచ్చారు. కాగా.. నాటోలో టర్కీ కూడా ఉంది. ఇందులో యూఎస్, కెనడా, యూకే, జర్మనీలతో పాటు ఇజ్రాయెల్ మిత్రదేశాలు కూడా ఉన్నాయి.
ఇజ్రాయెల్ స్పందన
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంకా స్పందించాల్సి ఉంది. అయితే ఈలోపే ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కాట్జ్ స్పందించారు. ఇరాక్ నియంత సద్దా హుస్సేన్‌లాగా ఎర్డోగాన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘‘ఎర్డోగాన్ సద్దాం హుస్సేన్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఇజ్రాయెల్‌పై దాడులు జరుపుతామని బెదిరిస్తున్నారు. అంతకన్నా ముందు ఆయన అక్కడ ఏం జరిగిందో, ఎలా ముగిసిందో గుర్తుంచుకోవాలని సూచిస్తున్నా’’ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాగా.. 2003లో మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ హయాంలో సద్దాం హుస్సేన్ పాలనను అమెరికా పడగొట్టిన విషయం అందరికీ తెలిసిందే. తమ జోలికొస్తే అదే గతి పడుతుందని ఆయన పరోక్షంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్-హమాస్ వార్
హమాస్ ముష్కరులు ఇజ్రాయెల్‌లో సృష్టించిన ఊచకోత కారణంగా ఈ యుద్ధం మొదలైంది. హమాస్ దాడులకు ప్రతీకారంగా.. ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. హమాస్‌ని అంతం చేయాలన్న లక్ష్యంతో.. గ్రౌండ్ ఆపరేషన్స్‌తో పాటు వైమానిక దాడులు జరుపుతోంది. ఓవైపు ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు శాంతి చర్చలు జరుగుతున్నాయి కానీ, ఫలితం మాత్రం శూన్యం. ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తద్వారా.. గాజాలో వేలాదిమంది అమాయక ప్రజలు (ముఖ్యంగా పిల్లలు, మహిళలు) మరణిస్తున్నారు.
Read Latest International News and Telugu News