చెన్నైలో పారిశ్రామికవేత్త ఇంటిలో బాలిక హత్య
ABN , Publish Date - Nov 04 , 2024 | 03:50 AM
చెన్నైలో ఓ పారిశ్రామికవేత్త ఇంటిలో పనిచేస్తున్న 16 ఏళ్ల బాలిక చిత్ర హింసలకు గురై హతమైంది. ఈ హత్యకేసులో ఆ పారిశ్రామికవేత్త, ఆయన భార్య సహా ఆరుగురిని నగర పోలీసులు అరెస్టు చేశారు.
చెన్నై, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): చెన్నైలో ఓ పారిశ్రామికవేత్త ఇంటిలో పనిచేస్తున్న 16 ఏళ్ల బాలిక చిత్ర హింసలకు గురై హతమైంది. ఈ హత్యకేసులో ఆ పారిశ్రామికవేత్త, ఆయన భార్య సహా ఆరుగురిని నగర పోలీసులు అరెస్టు చేశారు. పాత కార్ల కొనుగోలు, అమ్మకాల వ్యాపారం చేసే పారిశ్రామికవేత్త మహమ్మద్ నిషాద్ చెన్నై అమింజికరైలో నివసిస్తున్నారు. ఆయన ఇంటిలో తంజావూరుకు చెందిన బాలిక (16) గతేడాది నుంచి పని చేస్తోంది. ఇంటి పనులు సక్రమంగా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిషాద్ ఆయన భార్య నజియా బాలికను హింసించేవారు. దీపావళి రోజున బాలికను ఆ దంపతులతో పాటు నజియా స్నేహితుడు లోకేశ్, అతని భార్య జయశక్తి ఇస్త్రీ పెట్టెతో వాతలు పెట్టి, సిగరెట్‌తో కాల్చి చిత్రహింసలకు గురిచేసి పొత్తికడుపులో కాళ్లతో తన్నారు. బాలిక అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో వారంతా భయంతో ఆమెను బాత్రూమ్లో పడేశారు. కాసేపటికి ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలిసి ఇంటికి తాళం వేసి నిందితులు పరారయ్యారు. ఆ తర్వాత మహమ్మద్ తనకు తెలిసిన అడ్వొకేట్ సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. నిషాద్, నజియా, లోకేశ్, జయశక్తితో పాటు బాలికను పనిలో చేర్పించిన సీమా, ఆమెకు తెలిసిన పనిమనిషి మహేశ్వరిని పోలీసులు అరెస్టు చేశారు.