కువైట్ ప్రమాద మృతుల్లో.. ముగ్గురు ఆంధ్రులు
ABN , Publish Date - Jun 14 , 2024 | 03:07 AM
కువైట్‌లోని మంగ్‌ఫలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు దుర్మరణంపాలయ్యారు. తెలంగాణకు చెందిన మరో ముగ్గురు అగ్నికీలలు, దట్టమైన పొగను తప్పించుకునేందుకు భవనం పైనుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 50 మంది మృతిచెందగా..
మాతృభూమి నుంచి వస్తూనే మృత్యువు ఒడిలోకి శ్రీకాకుళం వాసి
ఇద్దరు తూర్పుగోదావరి జిల్లా వాసుల మృతి
కిందికి దూకిన ముగ్గురు రాష్ట్ర వాసులు క్షేమం
మృతదేహాల తరలింపునకు వాయుసేన విమానం.. పర్యవేక్షిస్తున్న
కేంద్ర మంత్రి
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
కువైట్‌లోని మంగ్‌ఫలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు దుర్మరణంపాలయ్యారు. తెలంగాణకు చెందిన మరో ముగ్గురు అగ్నికీలలు, దట్టమైన పొగను తప్పించుకునేందుకు భవనం పైనుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 50 మంది మృతిచెందగా.. వారిలో సింహభాగం(45 మంది) భారతీయులు, ముగ్గురు ఫిలిప్పైన్స్ జాతీయులు ఉన్నట్లు కువైట్ అధికారులు ప్రకటించారు.
సెలవులు ముగించుకుని..
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జంకిభద్రకు చెందిన తామడ లోకనాథం(31) ఆరేళ్లుగా ఎన్‌బీటీసీ సంస్థలో రోలింగ్ ఆపరేటర్ హెల్పర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలే భారత్ వెళ్లారు. సెలవులు ముగించుకుని, మంగళవారం అర్ధరాత్రి దాటాక కువైట్ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తన క్యాంప్‌నకు చేరుకుని, ప్రయాణ బడలికతో ఆదమరిచి నిద్రించారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో.. నిద్రలోనే మృత్యువు ఒడిలోకి జారుకున్నారు. నిబంధనల ప్రకారం ఆయన క్యాంప్‌నకు తిరిగి రాగానే.. ఆ వివరాలను ఎంట్రీ చేయించుకోవాలి. అలా చేయకపోవడం వల్ల క్యాంప్ లిస్టులో అతని పేరును చేర్చలేదు. దాంతో మరణ ధ్రువీకరణలో ఆలస్యమేర్పడింది. ఇదే క్యాంప్‌లో మరో ఐదుగురు తెలుగువారు ఆశ్రయం పొందేవారు. వారిలో తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడుకు చెందిన ఈశ్వర్ మీసాల(45), పెరవలి మండలం ఖండవల్లికి చెందిన మొల్లేటి సత్యనారాయణ(45) కూడా చనిపోయినట్లు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. వీరిద్దరూ హైవే స్టోర్‌లో డెలివరీ బాయ్స్‌గా పనిచేసేవారని తెలిసింది.
భవనం పైనుంచి దూకి..
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం, కొమ్మగూడెం గ్రామానికి చెందిన కె.గంగయ్యతోపాటు.. తెలంగాణకు చెందిన మరో ఇద్దరు కూడా ప్రమాదం జరిగిన భవనంలోనే ఉన్నారు. తెల్లవారుజామున ప్రమాదం జరగ్గానే వీరు తప్పించుకునే ప్రయత్నం చేశారు. మెట్లపైన కూడా మాడిపోయిన స్థితిలో మృతదేహాలు కనిపించడం.. దట్టమైన పొగ అలుముకుంటుండడంతో.. భవనం పైనుంచి దూకేశారు. కేబుల్ వైర్ల సాయంతో రెండో అంతస్తు నుంచి దూకినట్లు గంగయ్య ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.
డీఎన్‌ఏ పరీక్షలు..
ఈ ఘటనలో మొత్తం 50 మంది మృతిచెందగా.. మృతదేహాలు గుర్తించలేని విధంగా తయారయ్యాయ ని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో శ్రీహరి అనే కేరళీయుడు మృతిచెందగా.. కువైట్‌లోనే పనిచేసే అతని తండ్రి ప్రదీప్ తన కుమారుడి మృతదేహాన్ని గుర్తించడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చివరకు తన కొడుకు ఒంటిపై ఉండే టాటూ ద్వారా గుర్తించగలిగారు. శరీరమంతా మసిబారిపోయి, ముఖం ఉబ్బి ఉందని, టాటూ లేకుంటే.. గుర్తించడం కష్టమయ్యేదని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. మిగతా మృతదేహాల గుర్తింపునకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఆ తర్వాతే స్వదేశాలకు మృతదేహాల తరలింపు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. కాగా.. మృతుల్లో చాలా మంది పార్ట్‌టైమ్ డెలివరీ బాయ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ప్రభుత్వం వద్ద వీరి వివరాలు పెద్దగా ఉండవు. దీంతో.. మృతదేహాల గుర్తింపులో ఆలస్యమేర్పడినట్లు సమాచారం. మృతుల్లో 45 మంది భారతీయులు, ముగ్గురు ఫిలిప్పైన్స్ వాసులు ఉన్నట్లు అధికారులు చెబుతుండగా.. మరో ముగ్గురి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
భారతీయుల్లో కేరళకు చెందినవారు 23 మంది, తమిళులు 8 మంది ఉన్నారు.మిగతా వారిలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి ముగ్గురేసి, ఒడిసా నుంచి ఇద్దరు, హరియాణా, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్ రాష్ట్రాలకు చెందిన ఒక్కో బాధితుడు ఉన్నారని భారత విదేశాంగ శాఖ గురువారం రాత్రి విడుదల చేసిన ప్రకటన స్పష్టం చే స్తోంది. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కృతి వర్ధన్ సింగ్ గురువారం ఉదయమే కువైట్ చేరుకున్నారు. వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడి, ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు కేంద్రం వాయుసేనకు చెందిన విమానాన్ని ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. మరోవైపు కువైట్ రాజు షేక్ మిషాల్ అహ్మద్ అల్-సబా కూడా మృతదేహాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కేరళీయులకు 14 లక్షల చొప్పున పరిహారం
కువైట్ అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు కేంద్రం రూ.2లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే..! తాజాగా గురువారం కేరళ సీఎం పినరయి విజయన్ రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఇస్తామని మలయాళీ వ్యాపారవేత్త యూసుఫ్ అలీ, రూ. 2 లక్షల చొప్పున అందజేస్తామని మరో వ్యాపారవేత్త రవి పిళ్లై వెల్లడించారు.
దారుణం జరిగిపోయింది: ఇబ్రహీం
కువైట్‌లోని ఓ చమురు సంస్థలో సీనియర్ సేఫ్టీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న హైదరాబాద్ సన్‌సిటీకి చెందిన మహమ్మద్ ఇబ్రహీం ఇమ్రాన్ బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘటనను గురించి ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. ‘‘ప్రమాదం జరిగిన క్యాంపు భవనం పక్క బ్లాక్‌లోనే మేము నివసిస్తున్నాం. తెల్లవారుజామున 4 గంటల సమయంలో పెద్దఎత్తున ఆర్తనాదాలు.. హాహాకారాలు వినిపించాయి. కిటికీలోంచి బయటకు చూస్తే.. దట్టమైన పొగ, మంటలు కనిపించాయి. సేఫ్టీ ఆఫీసర్ కావడం వల్ల అవసరమైన సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రమాదస్థలి వద్దకు పరుగులు తీశాను. చూస్తుండగానే.. మూడో అంతస్తు నుంచి ఒకరి తర్వాత ఒకరు.. ఇలా ఐదారుగురు కిందకు దూకుతూ కనిపించారు. వారిలో ఒకరు నా కళ్ల ముందే మరణించారు’’ అని ఆయన వివరించారు.
మృతులు వీరే
ఎన్నికల ఫలితాలు చూసి..
శ్రీకాకుళం, జూన్ 13(ఆంధ్రజ్యోతి)/సోంపేట: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్రకు చెందిన తామాడ లోకనాథం నిరుపేద కుటుంబానికి చెందినవారు. ఇటీవలే తమ ఊళ్లోని గ్రామదేవత సంబరాల కోసం కువైట్ నుంచి వచ్చారు. ఎన్నికల ఫలితాలను చూసి.. అందరితో సరదాగా గడిపి.. మంగళవారం కువైట్ బయలుదేరారు. అర్ధరాత్రి దాటాక కువైట్‌లోని తమ క్యాంపునకు చేరుకుని, నిద్రకు ఉపక్రమించారు. అగ్నిప్రమాదంతో నిద్రలోనే తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. లోకనాథం మృతితో జింకిభద్రలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమను ఆదుకుంటాడనుకున్న కొడుకు ఇకలేడని తెలుసుకుని, లోకనాథం తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. మృతదేహాన్ని వెనక్కి రప్పించేలా కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు చొరవ తీసుకుంటున్నట్లు తెలిసింది.
నాలుగు రోజుల్లో వస్తాడనుకుంటే..
పెరవలి, జూన్ 13: మీసాల ఈశ్వర్ పదేళ్లుగా కువైట్‌లోని హైవే సూపర్‌మార్కెట్‌లో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇటీవలే కుమార్తెకు వివాహం నిశ్చయమవ్వగా.. విమానం టికెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో కువైట్ నుంచి రావడాన్ని మరో నాలుగు రోజులకు వాయిదా వేసుకున్నారు. నాలుగు రోజుల్లో వస్తాడనుకున్న ఈశ్వర్.. విగత జీవిగా వస్తుండడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కుటుంబాన్ని పోషించేందుకు వెళ్లి..
మొల్లేటి సత్యనారాయణ తన కుటుంబాన్ని పోషించేందుకు పదేళ్లుగా కువైట్‌లోపనిచేస్తున్నారు. ఈయనకు భార్య, విద్యాభ్యాసం చేస్తున్న ఓ కుమారుడు, వ్యవసాయ పనులు చేసుకునే తల్లిదండ్రులున్నారు. బుధవారం నాటి అగ్నిప్రమాదంలో సత్యనారాయణ తీవ్ర గాయాలపాలయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతిచెందారు. కుటుంబ సభ్యులకు ఇంకా విషయం తెలియదని ఖండవల్లి గ్రామస్తులు తెలిపారు.