Ram Mandir: కాలినడకన లక్నో నుంచి అయోధ్యకు 350 మంది ముస్లింలు
ABN , Publish Date - Feb 01 , 2024 | 09:21 AM
అయోధ్య రాములోరిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఇతర మతాలకు చెందినవారు అయోధ్య చేరుకుంటున్నారు. వారిలో కొందరు ముస్లింలు ఉన్నారు. 350 మంది ముస్లింలు అయోధ్య రాములోరి దర్శనం కోసం వచ్చారు.
అయోధ్య: అయోధ్య ఆలయంలో బాల రాముడు విశేష పూజలు అందుకుంటున్నారు. రాములోరిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఇతర మతాలకు చెందినవారు అయోధ్య చేరుకుంటున్నారు. వారిలో కొందరు ముస్లింలు ఉన్నారు. 350 మంది ముస్లింలు అయోధ్య రాములోరి దర్శనం కోసం వచ్చారు. రాష్ట్రీయ్ స్వయం సేవక్ మద్దతు గల ముస్లిం రాష్ట్రీయ మంచ్ నేతృత్వంలోని బృందం బయల్దేరింది.
ముస్లిల బృందం లక్నో నుంచి కాలినడకన అయోధ్య చేరుకుంది. చలిలో 150 కిలోమీటర్లు కాలి నడకన వచ్చి తమ భక్తిని చాటుకుంది. ‘ప్రతి 25 కిలోమీటర్లు నడిచిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకున్నాం. రాత్రి పడుకొని, మరునాడు బయలుదేరాం. ఆరు రోజుల తర్వాత అయోధ్య చేరుకున్నాం. బాల రాముడిని దర్శించుకొని తరించాం. రాములోరి దర్శనం హిందు- ముస్లింల ఐక్యతను పెంచి, దేశ సమగ్రతను కాపాడుతుంది’ అని ముస్లిం రాష్ట్రీయ మంచ్ మీడియా ఇంచార్జీ షాహిద్ సయీద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
‘భగవాన్ శ్రీ రాముడు పూర్వీకుడు అని.. కులం, మతం కన్నా దేశం కోసం ప్రేమ, మానవత్వం ఎక్కువ. ఏ మతం ఇతరులను విమర్శించడం, ఎగతాళి చేయడం లేదంటే అసహ్యించుకోవాలి అని’ బోధించదని ఎంఆర్ఎం కన్వీనర్ రాజా రయీస్ తెలిపారు.