Delhi : నేడే నీతి ఆయోగ్ భేటీ
ABN , Publish Date - Jul 27 , 2024 | 04:54 AM
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం శనివారం జరగనుంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంపై చర్చలు
సమావేశాన్ని బహిష్కరించాలని ఇండియా కూటమి సీఎంల నిర్ణయం
హాజరు కాబోనని ఇప్పటికే ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
భేటీకి హాజరై బెంగాల్ విభజన ప్రతిపాదనపై నిలదీస్తానని మమత వెల్లడి
నీతి ఆయోగ్‌ను రద్దు చేసి ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరించాలని డిమాండ్
పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు.. హేమంత్ సోరెన్ హాజరుపై అనిశ్చితి
న్యూఢిల్లీ, జూలై 26(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం శనివారం జరగనుంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈమేరకు.. ‘వికసిత్ భారత్-2047’ పేరుతో నీతి ఆయోగ్ ఇప్పటికే ఒక ఆధారపత్రాన్ని రూపొందించింది.
ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం, ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా చేర్చడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రజల జీవన నాణ్యతను పెంచడం అవసరమని ఈ ఆధారపత్రంలో పేర్కొన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ప్రత్యేక ఆహ్వానితులు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, సభ్యులు పాల్గొంటారు.
అయితే.. విపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఈ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు ఈ భేటీకి రాబోమని ప్రకటించారు.
కాగా, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వెళ్తారా? వెళ్లరా? అనే దానిపై అనిశ్చితి నెలకొంది. మరోవైపు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని విభజించాలంటూ ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సుకాంత్ మజుందార్ ప్రధాని మోదీకి ప్రతిపాదన చేసిన నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం మమత, టీఎంసీ కీలక నేత డెరెక్ ఒబ్రెయిన్ మాత్రం నీతి ఆయోగ్ భేటీకి హాజరు కానున్నారు.
బెంగాల్ విభజనపై నీతిఆయోగ్ సమావేశంలో ప్రస్తావిస్తానని.. దాన్ని ప్రతిఘటిస్తానని మమత ప్రకటించారు. భేటీలో పాల్గొనేందుకు శుక్రవారం ఢిల్లీకి చేరుకున్న మమత.. మీడియాతో మాట్లాడారు. నీతి ఆయోగ్‌ను రద్దు చేసి, ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
‘బెంగాల్ విభజన’పై రాజకీయ రగడ
పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర భాగాన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కలపాలంటూ బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ ప్రధాని మోదీకి ప్రతిపాదన చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కేంద్ర సహాయ మంత్రి కూడా అయిన మజుందార్..
ఉత్తర బెంగాల్‌ను ఈశాన్య భారతంలో కలిపితే కేంద్రం నుంచి అధిక నిధులు వస్తాయని, అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికీ అభ్యంతరం ఉంటుందని తాను భావించడం లేదన్నారు. తన ప్రతిపాదనపై మోదీ దృష్టిసారిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు.
ఢిల్లీ నుంచి ఈ మేరకు ఆయన వీడియో ప్రకటన విడుదల చేశారు. అయితే, మంజుదార్ సూచనపై బెంగాల్ సీఎం మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ విభజన అంటే దేశ విభజనే అని మండిపడ్డారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు చేస్తున్న ఈ ప్రయత్నాలను శనివారం ప్రధాని ఆధ్వర్యంలో జరిగే నీతిఆయోగ్ సమావేశంలో నిలదీస్తానని తెలిపారు.
ఒకవేళ పట్టించుకోకుంటే సమావేశం నుంచి వాకౌట్ చేస్తానని హెచ్చరించారు. ‘‘బడ్జెట్‌లో మా రాష్ట్రంపై ఆర్థిక వివక్ష చూపారు. ఇప్పుడు భౌగోళికంగానూ విభజన చేయాలని చూస్తున్నారు. పార్లమెంటు జరుగుతుండగానే కేంద్ర మంత్రి ప్రతిపాదన చేశారు. దీనిని సహించేది లేదు’’ అని మమత వ్యాఖ్యానించారు. కాగా.. ఉత్తర బెంగాల్‌లో బీజేపీకి పట్టు ఎక్కువ. ఇటీవలి ఎన్నికల్లో కూచ్‌బెహార్ తప్ప ఇక్కడి అన్ని ఎంపీ సీట్లనూ ఆ పార్టీనే గెలుచుకుంది. టీఎంసీకి మాత్రం దక్షిణ బెంగాల్‌లో గట్టి పట్టు ఉంది. అందుకే బీజేపీ ‘ఉత్తర బెంగాల్’ అంశాన్ని తెరపైకి తెస్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది.