Share News

Arvind Kejriwal: నేడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్?.. ఆప్ మంత్రులు ట్వీట్

ABN , Publish Date - Jan 04 , 2024 | 08:14 AM

అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం ఈడీ అరెస్ట్ చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. గురువారం ఉదయం అరవింద్ కేజ్రీవాల్‌ ఇంటిపై ఈడీ దాడులు చేస్తుందని, ఆ తర్వాత అరెస్ట్ అవకాశాలున్నాయని బుధవారం అర్ధరాత్రి చేసిన ట్వీట్‌లో వారు పేర్కొన్నారు.

Arvind Kejriwal: నేడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్?.. ఆప్ మంత్రులు ట్వీట్

ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం ఈడీ అరెస్ట్ చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. గురువారం ఉదయం అరవింద్ కేజ్రీవాల్‌ ఇంటిపై ఈడీ దాడులు చేస్తుందని, ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని బుధవారం అర్ధరాత్రి చేసిన ట్వీట్‌లో వారు పేర్కొన్నారు. ‘‘అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో గురువారం ఉదయం ఈడీ దాడి చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.’’ అని బుధవారం రాత్రి 11.50 గంటలకు ఆప్ మంత్రి అతిషి ట్వీట్ చేశారు. రెండు నిమిషాల తర్వాత మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇదే విషయాన్ని హిందీలో పోస్ట్ చేశారు. ఈడీ గురువారం ఉదయం కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంటుందని, ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.


ఈ వార్తలపై బీజేపీ నేతలు కూడా స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ భయపడడం ఏంటని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లను ఆయన విడిచిపెట్టాడా? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ ఈడీ సమన్లను దాటవేసే బదులు ఇండియా కూటమి నాయకులు అవినీతిలో పాఠాలు నేర్చోకోవాలని పేర్కొన్నారు. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్‌‌కు ఈడీ ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చింది. కానీ కేజ్రీవాల్ మాత్రం ఇప్పటివరకు ఒక్కసారిగా ఈడీ ముందు హాజరుకాలేదు. కేజ్రీవాల్‌కు మొదటగా గతేడాది నవంబర్ 2న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. ఆ తర్వాత డిసెంబర్ 21న, జనవరి 3న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు పంపింది. కానీ వాటిని కూడా కేజ్రీవాల్ దాటవేశారు.

Updated Date - Jan 04 , 2024 | 08:16 AM