Share News

Kharge: మోదీ హామీ నినాదం నియంతృత్వం వైపు.. ప్రధానిపై ఖర్గే స్ట్రాంగ్ కామెంట్స్..

ABN , Publish Date - Feb 25 , 2024 | 07:58 PM

బీజేపీ ఇచ్చిన మోదీ గ్యారెంటీ హామీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. ఇది దేశాన్ని నియంతృత్వం వైపు ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు

Kharge: మోదీ హామీ నినాదం నియంతృత్వం వైపు.. ప్రధానిపై ఖర్గే స్ట్రాంగ్ కామెంట్స్..

బీజేపీ ఇచ్చిన మోదీ గ్యారెంటీ హామీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. ఇది దేశాన్ని నియంతృత్వం వైపు ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. కర్ణాటక సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహించిన రాజ్యాంగం, జాతీయ ఐక్యత సదస్సు కార్యక్రమానికి ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పన్నుల ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నప్పుడు దానిని మోదీ హామీ అని ఎలా అంటారని ప్రశ్నించారు. పన్ను చెల్లిస్తున్నారు కాబట్టి ఇది ప్రజల హామీ అని, మోదీ హామీ కాదని ఫైర్ అయ్యారు. ప్రధాని తన మాటల్లో అన్నీ తానే అని చెప్పే అలవాటు ఉందని.. ఇది ప్రజాస్వామ్య భారతాన్ని నియంతృత్వం వైపు తీసుకువెళ్లడానికి కారణమవుతుందని మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు.

"హక్కుల కోసం పోరాడే దేశాల్లో ప్రజాస్వామ్యం మనుగడలో ఉంటుంది. హక్కులను విస్మరిస్తే, నియంతృత్వానికి దారి తీస్తుంది. ఎన్నికల్లో హార్స్ ట్రేడింగ్ వంటి చర్యలు రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఒక పార్టీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. ఆ సర్కార్ ను కూలగొట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అలవాటుగా మారింది. కర్ణాటక, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఇటువంటి ప్రయోగాలు జరిగాయి." అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వివరించారు.


ఇదే కార్యక్రమంలో పాల్గొన్న జమ్మూ-కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా భారత ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో కుల అణచివేతను మరింతగా పెంచే మనుస్మృతి ఆధారిత ప్రభుత్వానికి బీజేపీ బాటలు వేస్తోందని సీతారాం ఏచూరీ విమర్శించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 25 , 2024 | 07:58 PM