Share News

Anand Mahindra : మీ ఇంటికి ‘ఐరన్‌ డోమ్‌’!

ABN , Publish Date - Aug 25 , 2024 | 02:54 AM

దోమల బాధ భరించలేక రకరకాల పరిష్కారాలు వెతుకుతుంటాం. మార్కెట్లో మస్కిటో కాయిల్స్‌ నుంచి దోమల బ్యాట్‌లు, ఆల్‌ఔట్‌లు, జెట్‌లు వరకు బోలెడన్ని ఉపకరణాలు వచ్చేశాయి.

Anand Mahindra  : మీ ఇంటికి ‘ఐరన్‌ డోమ్‌’!

  • దోమల్ని చంపే వినూత్న యంత్రం.. చైనాలో తయారీ

  • రాడార్‌, లేజర్‌ టెక్నాలజీలతో పనిచేసే మెషిన్‌

  • ఎక్స్‌లో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర

ముంబై, ఆగస్టు 24: దోమల బాధ భరించలేక రకరకాల పరిష్కారాలు వెతుకుతుంటాం. మార్కెట్లో మస్కిటో కాయిల్స్‌ నుంచి దోమల బ్యాట్‌లు, ఆల్‌ఔట్‌లు, జెట్‌లు వరకు బోలెడన్ని ఉపకరణాలు వచ్చేశాయి.

దోమల మీద కొన్ని వేల కోట్ల రూపాయల పరిశ్రమ నడుస్తోంది. అయినా ఈ సమస్య నిర్మూలన కావటం లేదు సరికాదా.. ఎప్పటికప్పుడు డెంగీ, మలేరియా లాంటివి విజృంభిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా ఎక్స్‌ వేదికగా షేర్‌ చేసిన ఓ వీడియో అందరినీ ఆకర్షిస్తోంది. చైనాకు చెందిన ఓ వ్యక్తి, దోమల్ని చంపే బుజ్జి యంత్రాన్ని తయారు చేశాడని పేర్కొంటూ ఆ మెషిన్‌ వీడియోను ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేశారు.

‘ముంబైలో డెంగీ పెరుగుతున్న ప్రస్తుత సమయంలో.. ఈ సూక్ష్మ ఆయుధాన్ని ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తున్నా. ఇది దోమల్ని వెదికి మరీ చంపుతుంది. మీ ఇంటికి ఐరన్‌ డోమ్‌ (ఉక్కు తెర)లాగా రక్షణ కల్పిస్తుంది’ అని కామెంట్‌ పెట్టారు.

సదరు మెషిన్‌ చంపిన దోమల్ని ప్రదర్శిస్తున్న దృశ్యాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి. యుద్ధట్యాంకును పోలి ఉండే ఈ బుజ్జి యంత్రంలో ఓ రాడార్‌ ఉంటుంది. దోమలు ఎక్కడున్నాయో గుర్తించి రాడార్‌ ఆ సమాచారాన్ని యంత్రానికి అందిస్తుంది.

దానిలోంచి లేజర్‌ కిరణాలు వెలువడి దోమల్ని చంపుతాయి. శత్రుదేశాల రాకెట్‌, క్షిపణి దాడులను తిప్పికొట్టే ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ అంతర్జాతీయంగా పేరొందిన విషయం తెలిసిందే.

Updated Date - Aug 25 , 2024 | 02:54 AM