Ashwini Vaishnav : వ్యవసాయాభివృద్ధికి..ఏడు కొత్త పథకాలు
ABN , Publish Date - Sep 03 , 2024 | 03:07 AM
దేశంలో వ్యవసాయాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏడు కొత్త పథకాలను ప్రకటించింది. వీటిల్లో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్(రూ.2,817 కోట్లు), క్రాప్ సైన్స్ స్కీమ్(రూ.3,979 కోట్లు) ఉన్నాయి.
ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం
రూ. 14 వేల కోట్ల విడుదలకు పచ్చజెండా
రైతు ఆదాయం పెంపే లక్ష్యం: అశ్వినివైష్ణవ్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: దేశంలో వ్యవసాయాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏడు కొత్త పథకాలను ప్రకటించింది. వీటిల్లో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్(రూ.2,817 కోట్లు), క్రాప్ సైన్స్ స్కీమ్(రూ.3,979 కోట్లు) ఉన్నాయి. సోమవారం ప్రధాని మోదీ నేతృత్వంలో భేటీ అయిన కేంద్ర క్యాబినెట్.. ఈ పథకాలకు రూ.14 వేల కోట్లను విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి అశ్వినివైష్ణవ్ వివరాలను వెల్లడించారు. ఏడు కొత్త పథకాలతో రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు.
‘‘ఆహారం, పోషకాల భద్రతను దృష్టిలో పెట్టుకుని క్రాప్ సైన్స్ పథకాన్ని ప్రకటించాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతోపాటు.. కృషి విజ్ఞాన కేంద్రాల అభివృద్ధికి రూ.1,202 కోట్లను కేటాయించినట్లు వివరించారు. కాగా, ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ముంబై-ఇండోర్ మధ్య రైల్వే లైన్‌కు ఆమోదముద్ర వేసింది. 309 కిలోమీటర్ల ఈ రైల్వేలైన్ నిర్మాణ వ్యయం రూ.18వేల కోట్లుగా పేర్కొన్న మంత్రి.. 2028-29 లోగా ఈ మార్గంలో రైళ్లు పరుగులు పెడతాయన్నారు. సుఖోయ్ యుద్ధ విమానాల కోసం హెచ్ఏఎల్ ద్వారా 240 ఏరో ఇంజన్లను సమకూర్చుకొనేందుకు క్యాబినెట్ కమిటీ ఆమోదించింది.