Share News

ఢిల్లీ సీఎం పీఠంపై ఆతిశీ

ABN , Publish Date - Sep 22 , 2024 | 04:42 AM

ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై ఆతిశీ ఆసీనులయ్యారు. శనివారం, ఇక్కడ రాజ్‌నివా్‌సలో జరిగిన కార్యక్రమంలో ఎల్జీ వినయ్‌కుమార్‌ సక్సేనా అతిశీతో ప్రమాణం చేయించారు.

ఢిల్లీ సీఎం పీఠంపై ఆతిశీ

  • ఆమెతో ప్రమాణం చేయించిన ఎల్జీ వీకే సక్సేనా.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిపిన్న వయస్కురాలు ఆమే

  • ఢిల్లీకి 3వ మహిళా సీఎం.. దేశంలో 17వ మహిళా సీఎం

  • ప్రమాణం తర్వాత కేజ్రీవాల్‌కు ఆతిశీ పాదాభివందనం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై ఆతిశీ ఆసీనులయ్యారు. శనివారం, ఇక్కడ రాజ్‌నివా్‌సలో జరిగిన కార్యక్రమంలో ఎల్జీ వినయ్‌కుమార్‌ సక్సేనా అతిశీతో ప్రమాణం చేయించారు. ఆమెతో పాటు క్యాబినెట్‌ మంత్రులుగా సౌరభ్‌ భరద్వాజ్‌, గోపాల్‌ రాయ్‌, కైలాశ్‌ గెహ్లోత్‌, ఇమ్రాన్‌ హుస్సేన్‌, ముకేశ్‌ అహ్లావత్‌ ప్రమాణం చేశారు. మాజీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియా, ఆప్‌ నేతల కుటుంబసభ్యులు ఆతిశీ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. కార్యక్రమ అనంతరం కేజ్రీవాల్‌కు ఆతిశీ పాదాభివందనం చేశారు. ఆతిశీ సీఎంగా ప్రమాణం చేయడంతో ఢిల్లీలో వరుసగా నాలుగోసారి ఆప్‌ ప్రభుత్వం ఏర్పడినట్లయింది. మంత్రులకు శాఖలను కూడా ఆతిశీ కేటాయించారు.

ఆమె తన వద్ద 13 శాఖలను అట్టిపెట్టుకున్నారు. రెవెన్యూ, ఆర్థికం, విద్య తదితర ముఖ్యమైన శాఖలు ఆమె పరిధిలోనే ఉన్నాయి. సౌరభ్‌ భరద్వాజ్‌కు 8 శాఖలు, గోపాల్‌ రాయ్‌కు 3 శాఖలు, కైలాశ్‌ గెహ్లోత్‌కు 5శాఖలు, ఇమ్రాన్‌ హుస్సేన్‌కు 2 శాఖలు, ముఖేశ్‌ అహ్లావత్‌కు 5 శాఖలను ఆమె కేటాయించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఆమె కొద్దికాలమే సీఎం పదవిలో ఉంటారు. ఢిల్లీ సీఎం పదవి చేపట్టిన ఎనిమిదో వ్యక్తి ఆతిశీ. ఆమె వయసు 42 ఏళ్లు. ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిష్టించిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. దేశంలో 17వ మహిళా ముఖ్యమంత్రిగా, ఢిల్లీకి మూడో మహిళా సీఎంగా రికార్డుల్లోకి ఎక్కారు.


  • కేజ్రీవాల్‌ ఢిల్లీ ముఖచిత్రాన్ని మార్చారు

గత పదేళ్లలో ఢిల్లీ ముఖచిత్రాన్ని మార్చిన ఘనత మాజీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ది అని ముఖ్యమంత్రి ఆతిశీ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరి బాధను కేజ్రీవాల్‌ అర్థం చేసుకున్నారని, ప్రజలకు ఉచిత వైద్యం అందించడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల జీవితాలను మెరుగుపర్చడానికి కేజ్రీవాల్‌ కృషి చేశారని పేర్కొన్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సీఎంగా అవకాశమిచ్చినందుకు కేజ్రీవాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న కుట్రలను సఫలం కానివ్వబోమని తెలిపారు. సీఎం పదవిలో కొనసాగకుండా ఆ పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేయడం తనను బాధిస్తోందని తెలిపారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కేజ్రీవాల్‌ను సీఎంగా గెలిపించాలని ఢిల్లీ ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. బీజేపీ గెలిస్తే కుట్ర చేసి ఉచిత విద్యుత్తును నిలిపివేస్తుందని హెచ్చరించారు.

Updated Date - Sep 22 , 2024 | 04:42 AM