Share News

Delhi: ఉద్యోగ వర్గాలకు కేంద్రం ఊరట!

ABN , Publish Date - Jun 18 , 2024 | 05:09 AM

మోదీ 3.0 ప్రభుత్వం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న కొత్త బడ్జెట్‌లో ఉద్యోగ వర్గాలు, వేతన జీవులకు ఊరట కలిగించే విధంగా పలు నిర్ణయాలు ప్రకటించనుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి.

Delhi: ఉద్యోగ వర్గాలకు కేంద్రం ఊరట!

  • ఆదాయపు పన్ను తగ్గించే యోచన

  • మఽధ్యతరగతి ప్రజల వద్ద

  • డబ్బు మిగిలేలా ఆర్థిక విధానాలు

  • బడ్జెట్‌పై కొనసాగుతున్న కసరత్తు

  • బడ్జెట్‌పై కొనసాగుతున్న కసరత్తు

న్యూఢిల్లీ, జూన్‌ 17: మోదీ 3.0 ప్రభుత్వం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న కొత్త బడ్జెట్‌లో ఉద్యోగ వర్గాలు, వేతన జీవులకు ఊరట కలిగించే విధంగా పలు నిర్ణయాలు ప్రకటించనుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. కిందిస్థాయి శ్లాబుల్లో ఉన్నవారికి ప్రయోజనం కలిగించేలా పన్నులు తగ్గించే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నాయి. సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపుపై దృష్టి పెట్టడం కన్నా, మధ్య తరగతి వర్గం ప్రజల చేతుల్లో నాలుగు డబ్బులు ఉండేటట్టు చూసి తద్వారా ఆర్థిక ప్రగతికి దోహదపడాలన్న ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఆదాయపు పన్ను భారం తగ్గితే ఆ రూపంలో ఆదా అయిన సొమ్ముతో వస్తువులు కొనుగోలు చేస్తారని, దాని ద్వారా ఒకదానితో మరికొటి ముడి పడి ఉండే ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని అంచనా వేస్తోంది. ప్రస్తుతం వార్షిక ఆదాయం రూ.3 లక్షల వరకు ఉంటే 5ు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంది. అది శ్లాబుల వారీగా పెరుగుతుంది.


ఆదాయం రూ.15 లక్షలకు చేరుకుంటే పన్ను 30ు పెరుగుతుంది. ఆదాయం అయిదు రెట్లు పెరిగితే పన్ను శ్లాబు మాత్రం ఆరు రెట్లు పెరుగుతోంది. ఈ పెరుగుదలలో హేతుబద్ధత లేదని, శ్లాబులు కూడా మరీ ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. జులైలో ప్రవేశపెట్టనున్న 2024-25 బడ్జెట్‌పై ఆర్థిక మంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ కసరత్తు ప్రారంభించారు. మంగళవారం రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రాతో చర్చలు జరపనున్నారు. ఈ నెల20న పారిశ్రామిక వర్గాలతో భేటీ అయి సలహాలు స్వీకరించనున్నారు. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు క్రిమినల్‌ చట్టాలను జులై ఒకటో తేదీ నుంచే అమల్లోకి తీసుకురానున్నట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్‌ వెల్లడించారు. ఈ విషయంలో పునరాలోచన ఏమీ లేదని స్పష్టం చేశారు. ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌-1872 చట్టాల స్థానంలో కేంద్ర కొత్త క్రిమినల్‌ చట్టాలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

Updated Date - Jun 18 , 2024 | 05:09 AM