Share News

Bandi Sanjay: మహిళలు, చిన్నారుల భద్రతకు రూ.13,412కోట్లు ఖర్చు..

ABN , Publish Date - Jul 31 , 2024 | 02:55 PM

దేశంలో మహిళల భద్రత కోసం వివిధ పథకాలు, కార్యక్రమాల కింద కేంద్ర ప్రభుత్వం రూ.13,412కోట్లు ఖర్చు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లోక్ సభలో వెల్లడించారు. మహిళా భద్రతా పథకాల కింద మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపుల కేసులను నిర్వహించే పరిశోధకులతోపాటు ప్రాసిక్యూటర్ల సామర్థ్యం పెంపొందించేందుకు శిక్షణ ఇచ్చే నిబంధన ఉందా?, ఏయే కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటూ ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ బదులిచ్చారు.

Bandi Sanjay: మహిళలు, చిన్నారుల భద్రతకు రూ.13,412కోట్లు ఖర్చు..

ఢిల్లీ: దేశంలో మహిళల భద్రత కోసం వివిధ పథకాలు, కార్యక్రమాల కింద కేంద్ర ప్రభుత్వం రూ.13,412కోట్లు ఖర్చు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లోక్ సభలో వెల్లడించారు. మహిళా భద్రతా పథకాల కింద మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపుల కేసులను నిర్వహించే పరిశోధకులతోపాటు ప్రాసిక్యూటర్ల సామర్థ్యం పెంపొందించేందుకు శిక్షణ ఇచ్చే నిబంధన ఉందా?, ఏయే కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటూ ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ బదులిచ్చారు. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు హోంమంత్రి ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దానికి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి సభలో వెల్లడించారు.


ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కోసం రూ.3,375 కోట్లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ కోసం రూ.531.24కోట్లు, స్కీం ఫర్ మోడర్నైజేషన్ ఆఫ్ ఫోరెన్సిక్‌కు రూ.280 కోట్లు, జైళ్ల ఆధునీకరణకు రూ.950కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే రాష్ట్రాల సైన్స్ ఫోరెన్సిక్ లాబరేటరీల పటిష్టత కోసం రూ.106.75కోట్లు, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలు, ఫోరెన్సిక్ డేటా సెంటర్, 6 సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీల ఆధునికీకరణకు మరో రూ.354.25కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.


అలాగే సేఫ్ సిటీ ప్రాజెక్టు కోసం రూ.2,840కోట్లు, మహిళలకు శిక్షణ, సామర్థ్యం పెంపు కోసం రూ.76.5కోట్లు, పేద ఖైదీల కోసం రూ.60కోట్లు, మానవ అక్రమ రవాణా నిరోధక(యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్) యూనిట్ కోసం రూ.113.76కోట్లు, మహిళా హెల్ప్ డెస్కులకు రూ.164.2 కోట్లు, చంఢీగడ్‌లో డీఎన్ఏ ల్యాబ్ ఏర్పాటుకు రూ.42.84 కోట్లు, మహిళలు, చిన్నారులపై సైబర్ నేరాల నియంత్రణకు రూ.224.76కోట్లు, సెంట్రల్ విక్టిమ్ కాంపోజిషన్ ఫండ్ కోసం రూ.200కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.


ఢిల్లీ పోలీస్ స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ ఫెసిలిటీ ఆఫ్ సోషల్ వర్కర్స్ , కౌన్సిలర్స్, న్యూ బిల్డింగ్ ఫర్ విమెన్ సెంట్రిక్ ఫెసిలిటీస్, స్పెషల్ నీడ్స్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ కోసం రూ.38.8కోట్లు, నేషనల్ ఫోరెన్సిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ పథకానికి రూ.2254కోట్లు, మొత్తంగా రూ.13,412కోట్లు మన అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు, బిడ్డల కోసం కేంద్రం ఖర్చు పెడుతున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వివరించారు.

Updated Date - Jul 31 , 2024 | 03:08 PM