INDIA Alliance: ఇండియా కూటమికి బిగ్ షాక్!.. నితీష్ కుమార్ గుడ్‌బై?
ABN , Publish Date - Jan 25 , 2024 | 05:40 PM
విపక్షాల ఇండియా కూటమికి మరో షాక్ తగలడం ఖాయమా?. రెండు రోజుల వ్యవధిలోనే ముచ్చటగా మూడవ కీలక నేత కూటమికి గుడ్‌బై చెప్పబోతున్నారా? అంటే ఔననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ లోక్‌సభ ఎన్నికల ముందు యూ-టర్న్ తీసుకొని బీజేపీతో జట్టు కట్టనున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
న్యూఢిల్లీ: విపక్షాల ఇండియా కూటమికి మరో షాక్ తగలడం ఖాయమా?. రెండు రోజుల వ్యవధిలోనే ముచ్చటగా మూడవ కీలక నేత కూటమికి గుడ్‌బై చెప్పబోతున్నారా? అంటే ఔననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ లోక్‌సభ ఎన్నికల ముందు యూ-టర్న్ తీసుకొని బీజేపీతో జట్టు కట్టనున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి థాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ అవార్డును ప్రదానం చేయాలని నిర్ణయించిన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీకి నితీష్ కుమార్ ధన్యవాదాలు తెలిపిన మరుసటి రోజే ఈ వార్తలు తెరపైకి వచ్చాయి.
గత రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు కీలక నేతలు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లో, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పాయి. నితీష్ కుమార్ కూడా దూరమైతే కూటమికి భారీ ఎదురుదెబ్బని చెప్పక తప్పదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా కూటమిని మార్చడం నితీశ్ కుమార్‌కు పరిపాటిగా మారింది. ఈసారి కూటమి మారితే ఐదవసారి కానుంది. 2013లో ఎన్‌డీఏ, మహాఘట్‌బంధన్ కూటముల మధ్య ఆయన ఊగిసలాడారు. అయితే సీఎం పదవిని ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చూసుకుంటున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో పాల్గొనాలంటూ హస్తం పార్టీ పంపిన ఆహ్వానానికి కూడా ఆయన స్పందించలేదంటూ వార్తలు వస్తున్నాయి. ఇండియా కూటమి ఎన్నికల సన్నాహాల్లో స్పష్టత లేకపోవడం, ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆమోదం లేకపోవడంతో నితీశ్ కుమార్ కలత చెందారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల చర్చల్లో జాప్యం కూడా ఇందుకు కారణంగా విశ్లేషించాయి.