Bihar Politics: క్షణక్షణం ఉత్కంఠ.. మంతనాల్లో పార్టీలు తలమునకలు
ABN , Publish Date - Jan 27 , 2024 | 02:56 PM
బీహార్ రాజకీయాల్లో తలెత్తిన సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి, బీజేపీతో కలిసి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వ్యూహరచన చేస్తుండగా, నితీష్‌ను అక్కున చేర్చుకునేందుకు బీజేపీ అధిష్ఠానం హస్తినలో పావులు కదుపుతోంది. ఇదే సమయంలో భవిష్యత్ కార్యాచరణపై ఆర్జేడీ సైతం వరుస సమావేశాలు జరుపుతోంది.
న్యూఢిల్లీ: బీహార్ రాజకీయాల్లో (Bihar politics) తలెత్తిన సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్షణంలోనో మరో క్షణంలోనో బీహార్ సీఎం నితీష్ కుమార్ (Nitish kumar) తన పదవికి రాజీనామా చేసి, బీజేపీతో కలిసి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వ్యూహరచన చేస్తుండగా, నితీష్‌ను అక్కున చేర్చుకునేందుకు బీజేపీ అధిష్ఠానం హస్తినలో పావులు కదుపుతోంది. ఇదే సమయంలో భవిష్యత్ కార్యాచరణపై అధికార మహాకూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న ఆర్జేడీ సైతం వరుస సమావేశాలు జరుపుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు గల అవకాశాలు, సంఖ్యాబలం కూడగట్టే అవకాశాలపై మంతనాలు సాగిస్తోంది.
హస్తినలో బీహార్ రాజకీయ పరిస్థితిపై కేంద్ర మంత్రి అమిత్‌ను ఆయన నివాసంలో ఎల్జేపీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ శనివారంనాడు కలుసుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం సమావేశంలో పాల్గొని పరిస్థితిని సమీక్షించారు. ''పొత్తులకు సంబంధించి సానుకూల పరిస్థితి ఉంది'' అని సమావేశానంతరం చిరాగ్ పాశ్వాన్ మీడియాకు తెలిపారు. బీహార్‌పై తన ఆందోళనను అగ్రనేతలకు వివరించానని, వివిధ అంశాలపై తనకు వారు హామీ ఇచ్చారని చిరాగ్ తెలిపారు. పరిస్థితిపై ఒక స్పష్టత రాగానే తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, ఇప్పటికైతే తాము ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నామని చెప్పారు.
బీజేపీ కోర్ కమిటీ మీట్..
మరోవైపు బీహార్ బీజేపీ కోర్ కమిటీ సమావేశం పాట్నాలో జరుగుతోంది. అసెంబ్లీలో విపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ సిన్హా, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, బీజేపీ ఎంపీ, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్, బీజేపీ బీహార్ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జేడీయూ, ఆర్జేడీ..
కాగా, జనతాదళ్ (యునైటెడ్) మాజీ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ (లలన్) సింగ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను పాట్నాలో శనివారం ఉదయం కలుసుకున్నారు. అటు, ఆర్జేడీ నేత, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నివాసం వద్ద ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు సమావేశమయ్యారు. విజయ్ కుమార్ మండల్, లలిత్ కుమార్ యాదవ్, అబ్దుల్ బారి సిద్ధిఖి, బీహార్ న్యాయశాఖ మంత్రి షమిమ్ అహ్మద్, బినోద్ జైశ్వాల్ తదితరులు తేజస్విని కలిసిన వారిలో ఉన్నారు.