అమెరికాలో భారీగా ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు
ABN , Publish Date - Nov 18 , 2024 | 02:10 AM
అనవసర ఖర్చులు తగ్గించేందుకు బడ్జెట్లో కోతలు విధించడమే ప్రథమ లక్ష్యమని ప్రకటించిన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చేందుకు కసరత్తు మొదలైంది.
వృథా ఖర్చుల తగ్గింపే రాబోయే ట్రంప్ సర్కార్ లక్ష్యం
ఇది అణుబాంబు తయారీలాంటి ‘మన్‌హట్టన్ ప్రాజెక్టు’
అధికార యంత్రాంగానికి ‘షేవింగ్’ తప్పదు
‘కరెంటు రంపాన్ని’ ఉపయోగిస్తాం: వివేక్ రామస్వామి
వాషింగ్టన్, నవంబరు 17: అనవసర ఖర్చులు తగ్గించేందుకు బడ్జెట్లో కోతలు విధించడమే ప్రథమ లక్ష్యమని ప్రకటించిన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చేందుకు కసరత్తు మొదలైంది. అధికారం చేపట్టిన వెంటనే అమలు చేసేలా కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్; భారత సంతతికి చెందిన బయోటెక్ కంపెనీ సీఈవో, రిపబ్లికన్ పార్టీ నాయకుడు వివేక్ రామస్వామి ఆధ్వర్యంలో ప్రభుత్వ సామర్థ్య విభాగం (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ-డోగ్) ప్రత్యేకంగా ఏర్పాటైంది. ప్రభుత్వ విభాగాల్లో సామర్థ్యం పెంచడమంటే భారీగా ఉద్యోగాల్లో కోత విధించడమేనని ఈ ఇరువురు సీఈవోలు భావిస్తున్నారు. ఇటీవల ట్రంప్ సొంత ఎస్టేట్ అయిన మార్ ఎ లాగోలో జరిగిన సన్మాన సభలో వివేక్ ప్రసంగిస్తూ ‘‘మస్క్, నేను కలిసి వాషింగ్టన్‌లోని అధికార యంత్రాంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది ‘ఎన్నిక ద్వారా నియమితులుకాని ఉద్యోగుల’ను బయటకు పంపి వేస్తాం.మేం ఆ పొజిషన్లో ఉన్నాం’’అని చెప్పారు.
‘‘మస్క్ గురించి మీకు పూర్తిగా తెలియదు. ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించడానికి ఆయన పెద్ద కరెంటు రంపమే తెస్తున్నారు. చాలా సరదాగా ఉంటుందిలే’’ అని వ్యాఖ్యానించారు. ఈ ‘కరెంటు రంపం’ ఆలోచనను అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలేయి నుంచి తీసుకున్నట్టు కనిపిస్తోంది. అధికారం చేపట్టిన వెంటనే సాహసోపేత పొదుపు చర్యలు తీసుకుంటానని మిలేయి ప్రకటించారు. ‘ఆర్థిక పోకిరీ’, ‘అరాచక పెట్టుబడిదారుడు’నని స్వయంగా చెప్పుకొన్నారు. అధికార యంత్రాంగం, ఆర్థిక లోటును తగ్గించేందుకు ‘కరెంటు రంపాన్ని’ ఉపయోగిస్తానని ప్రకటించారు. ఆ భావననే వివేక్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ‘క్షవరం’ చేయాల్సి ఉందని ఆయన అన్నారు. ‘‘ప్రభుత్వ యంత్రాంగం సైజును ‘షేవింగ్’’ చేయడం మా లక్ష్యం. ఇది మాత్రం సాధ్యమైనంత వరకు పారదర్శంగా జరగాలి’’అని పేర్కొన్నారు. ఈ కసరత్తును ఆయన ‘ఆధునిక మాన్‌హట్టన్ ప్రాజెక్టు’ అని అభివర్ణించారు.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అణుబాంబులు తయారు చేసేందుకు అమెరికా ప్రభుత్వం ‘మన్‌హట్టన్ ప్రాజెక్టు’ను నిర్వహించింది. ప్రస్తుతం భారీగా ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించేందుకు చేపట్టే ప్రాజెక్టు కూడా అంత తీవ్రమైనదేనని తెలిపారు. ఇందుకోసం దేశంలోని మేధావులను ఒక్క దగ్గర చేర్చుతున్నామని చెప్పారు. జీతం తీసుకోకుండా వారానికి 80 గంటలపాటు అంకితభావంతో పనిచేసేవారు కావాలంటూ ఉద్యోగ ప్రకటన ఇచ్చారు కూడా. ఉద్యోగుల తొలగింపు కారణంగా కీలకమైన ప్రభుత్వ విధులు కుంటుపడుతాయన్న హెచ్చరికలకు వివేక్ సమాఽధానమిస్తూ ‘నూతన ఆవిష్కరణలు, వ్యయం అదుపునకు కోతలు తప్పనిసరి’ అన్నారు. ‘‘మనం క్షీణదశలో ఉన్న దేశం అంటూ నిరాశ భావనను ఇంతవరకు మనకు కలిగించారు. అది తప్పని ఎన్నికల్లో రుజువైంది. దేశ నిర్మాతలు గర్వపడేలా తగిన సైజ్, లక్ష్యం ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ‘డోగ్’ పని అని అన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతివారం ఎక్స్‌లో ‘డోగ్కాస్ట్’ ప్రసారం చేసి మస్క్, వివేక్‌లు తమ అభిప్రాయాలను తెలుపుతారు.