Share News

Maharashtra: ఉల్లి మహా ఘాటు!

ABN , Publish Date - May 11 , 2024 | 04:51 AM

ఇప్పటివరకు వంటింటి బడ్జెట్‌పై ప్రభావం చూపిన ఉల్లిపాయ..ఈసారి మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశంకానుంది. దేశంలో యూపీ తర్వాత అత్యధిక లోక్‌సభ సీట్లున్న మహారాష్ట్ర (48)లో సగం స్థానాలకు 4, 5 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలతో పోలింగ్‌ పూర్తవుతుంది.

Maharashtra: ఉల్లి మహా ఘాటు!

  • 4, 5 దశల్లో మహారాష్ట్రలోని 24 సీట్లకు పోలింగ్‌

  • ఇందులో అత్యధికం ఉల్లి సాగు ప్రాంతాలే

  • ఎగుమతి నిషేధం, సుంకాలపై రైతుల ఆగ్రహం

  • నష్ట నివారణకు నిషేధాన్ని ఎత్తేసిన కేంద్రం

(సెంట్రల్‌ డెస్క్‌)

ఇప్పటివరకు వంటింటి బడ్జెట్‌పై ప్రభావం చూపిన ఉల్లిపాయ..ఈసారి మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశంకానుంది. దేశంలో యూపీ తర్వాత అత్యధిక లోక్‌సభ సీట్లున్న మహారాష్ట్ర (48)లో సగం స్థానాలకు 4, 5 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలతో పోలింగ్‌ పూర్తవుతుంది. ఇప్పటికే ఎన్సీపీ, శివసేన వంటి ప్రాంతీయ పార్టీలను చీల్చి అధికారంలోకి వచ్చి విమర్శలపాలైన బీజేపీకి కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద ఇబ్బందికరంగా మారింది. అలాగని విపక్షాలకు ఇదేమీ లాభం చేకూర్చే పరిణామమూకాదని రాజకీయ విశ్లేషకుల అంటున్నా రు. పశ్చిమ, ఉత్తర మహారాష్ట్రలో తదుపరి దశల ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 22 జిల్లాల పరిధి 13 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉల్లి ఎక్కువగా సాగవుతుంది. వీటిలో సోలాపూర్‌, లాతూర్‌, బారామతి, ఉస్మానాబాద్‌లో ఈనెల 7నే పోలింగ్‌ ముగిసింది. ఎన్నికలు జరగాల్సిన మిగతా ప్రాంతాల్లోని అత్యధిక శాతం ఉల్లి రైతులు రాజకీయ పార్టీల పట్ల మండిపడుతున్నారు. దీన్ని ఓటు రూపంలో చూపుతారని అంటున్నారు. దేశంలో 40 శాతం ఉల్లి పంట మహారాష్ట్రలోనే పండుతుంది.


కొన్ని నెలల క్రితం ఉల్లి ధరలు పెరగడంతో కేంద్రం ఎగుమతులపై 14ుసుంకం విధించింది. అంతకుముందు డిసెంబరులో విదేశాలకు ఎగుమతిని నిలిపివేసింది. కానీ, రైతుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణంకావడంతో ఈనెల 4న సుంకం ఎత్తివేసింది. కనీస ఎగుమతి ధరను టన్నుకు 850డాలర్లుగా స్థిరీకరించింది. అయి తే తమకు ప్రయోజనంలేదని రైతులు అంటున్నారు. మరోవైపు కనీస ఎగుమతి మద్దతు ధరను టన్నుకు 550డాలర్లకు తగ్గిస్తూ నే 40ు ఎగుమతి సుంకం విధించింది. దేశంలోనే అతిపెద్ద హోల్‌సేల్‌ ఉల్లి మార్కెట్‌ లాసల్‌గావ్‌కు దూలే, ధిండోరి, అహ్మద్‌నగర్‌, షిర్డీ, షిరూర్‌, బీడ్‌, మావల్‌తోపాటు మరికొన్ని నియోజకవర్గాల రైతులు పంటను తీసుకొస్తారు. వీటికే నాలుగు, ఐదో దశల్లో ఎన్నికలున్నాయి. గ్రామీణ ప్రాంతంలో బీజేపీ ప్రభుత్వం పై ఆగ్రహం ఎక్కువగా ఉంది. దీంతో పౌర సరఫరాల శాఖ మంత్రి చగన్‌ భుజబల్‌ రంగంలోకి దిగి ఎగుమతులపై నిషేధం తో ఉల్లి రైతులు ఆగ్రహంగా ఉన్నారని అంగీకరిస్తూనే.. ఈ నిర్ణయాన్ని వెనక్కుతీసుకున్నట్టు తమప్రచారంలో గుర్తుచేస్తున్నారు.


తమ సమస్యలపై సరిగా స్పందించలేదని ఉల్లి రైతులు విపక్షాలపైనా ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల్లో తమకే లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంలో శివసేన (ఉద్ధవ్‌), కాంగ్రెస్‌ పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేదని మహారాష్ట్ర ఉల్లి ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు భరత్‌ దిఘోలే వ్యాఖ్యానించారు. కేంద్ర వ్యవసాయ మంత్రి, ఎన్సీపీ (ఎస్సీ)అధినేత శరద్‌పవార్‌ చంద్వాడ్‌లో ఆందోళనకు దిగి కేంద్రాన్ని విమర్శించారని.. ధిండోరిలో ఆ పార్టీనే పోటీకి దిగిందన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే పవార్‌ నిరసనలు చేశారని ఆరోపించారు. ‘‘క్వింటా రూ.2,410చొప్పున 2 లక్షలటన్నుల ఉల్లిని కొంటామని కేంద్రం హామీనిచ్చింది. 99,150 టన్నులను ఎగుమతి చేయాలన్న నిర్ణయం అమలుకాలేదు. అంతకుముందు 3 లక్షల టన్నులు ఎగుమతి చేస్తామని విస్మరించారు. వినియోగదారులకు తక్కువ ధరకు అందించేందుకు ఉల్లి రైతులను బలి చేశారు’’ అంటూ రైతులు మండిపడుతున్నారు.

Updated Date - May 11 , 2024 | 04:51 AM