Assembly Bypoll Results 2024: 10 స్థానాల్లో 'ఇండియా' కూటమి ఘనవిజయం, 2 సీట్లకే పరిమితమైన బీజేపీ
ABN , Publish Date - Jul 13 , 2024 | 08:16 PM
ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీనిచ్చిన 'ఇండియా' కూటమి 7 రాష్ట్రాల్లోని 13 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుని సత్తా చాటుకుంది. 'ఇండియా' కూటమి 10 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. బీజేపీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. ఒక సీటును స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు.
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీనిచ్చిన 'ఇండియా' (INDIA) కూటమి 7 రాష్ట్రాల్లోని 13 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో (Assembly Bypolls) మెజారిటీ సీట్లు గెలుచుకుని సత్తా చాటుకుంది. 'ఇండియా' కూటమి 10 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. బీజేపీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. ఒక సీటును స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు. గత బుధవారంనాడు పశ్చిమబెంగాల్‌లోని 4, హిమాచల్ ప్రదేశ్‌లోని 3, ఉత్తరాఖండ్‌లోని 2, పంజాబ్, మధ్యప్రదేశ్, బిహార్, తమిళనాడుల్లో చెరో స్థానానికి పోలింగ్ జరుగగా, శనివారంనాడు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించారు.
'ఇండియా' కూటమిలోని ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో చెరో రెండు సీట్లు గెలుచుకోగా, తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమబెంగాల్‌లోని 4 అసెంబ్లీ స్థానాలు గెలిచి క్లీన్‌స్వీప్ చేసింది. పంజాబ్‌లో 'ఆప్' ఒక సీటు గెలుచుకుంది. తమిళనాడులోని ఒక సీటును డీఎంకే కైవసం చేసుకుంది. మరోవైపు, బీజేపీ 2 స్థానాల్లో గెలుపొందింది. మధ్యప్రదేశ్‌లోని అమర్‌వారా, హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్ పూర్‌లో విజయం సాధించింది. బీహార్‌లోని రూపాలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ విజయం సాధించారు.
Assembly bypolls results 2024: సీఎం భార్య గెలుపు, కాంగ్రెస్‌కు 2, బీజేపీకి ఒకటి
విజేతలు వీరే..
హిమాచల్ ప్రదేశ్: డెహ్రా, నలాగఢ్ సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. హమీర్‌పూర్‌లో బీజేపీ గెలిచింది. డెహ్రా నుంచి ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు భార్య కమలేష్ ఠాకూర్ తన బీజేపీ ప్రత్యర్థి హోష్యార్ సింగ్‌పై 9,399 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. నలాగఢ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి హర్దీప్ సింగ్ బవా 8,990 ఓట్లతో బీజేపీ అభ్యర్థి కేఎల్ ఠాకూర్‌పై గెలిచారు. హమీర్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ఆశిష్ శర్మ కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేందర్ వర్మపై 1,571 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్‌లో ఉప ఎన్నిక జరిగిన రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలుచుకుంది. బద్రీనాథ్ నుంచి కాంగ్రెస్ నేత లఖపట్ సింగ్ బుటోలా 5,244 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ నేత రాజేంద్ర సింగ్ భండారిపై గెలవగా, మంగళౌర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి క్వాజి మొహమ్మద్ నిజాముద్దీన్ 422 సీట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి కర్తార్ సింగ్ భదనాపై గెలిచారు.
పశ్చిమబెంగాల్: మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మొత్తం నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. రాయ్‌గంజ్ నుంచి కృష్ణ కల్యాణి, రానాఘాట్ దక్షిణ్ నుంచి ముకుట్ మణి అధికారి, బగ్డా నుంచి మధుపర్న ఠాకూర్, మానిక్‌తాల నుచి సుప్తి పాండే గెలిచారు.
తమిళనాడు: విక్రవండి నియోజకవర్గాన్ని డీఎంకే తిరిగి నిలబెట్టుకుది. డీఎంకే అభ్యర్థి అన్నియూర్ శివ తన సమీప పీఎంకే అభ్యర్థి సి అన్బుమణిపై 67,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
మధ్యప్రదేశ్: అమర్‌వారా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కమలేష్ ప్రతాప్ షా తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి ధీరన్ షాపై 3,027 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
పంజాబ్: జలంధర్ వెస్ట్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మొహిందర్ భగత్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి శీతల్ ఆంగురల్‌పై 37,325 భారీ అధిక్యంతో భగత్ గెలిచారు.
బీహార్: రూపౌలి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి శంకర్ సింగ్ తన సమీప జేడీయూ అభ్యర్థి కళాధర్ మండల్‌పై 8,246 ఓట్లు ఆధిక్యంతో గెలిచారు.
For Latest News and National News click here