Haryana Assebly Elections: ఆప్ చేతిలో దెబ్బ తప్పదా..?
ABN , Publish Date - Sep 15 , 2024 | 05:33 PM
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ ప్రభావం కాంగ్రెస్, బీజేపీ స్పష్టంగా పడే అవకాశముందని అంటున్నారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికీ రెండు రోజుల్లో రాజీనామా చేయనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన కేజ్రీవాల్ అప్పటికప్పుడు చేశారా? లేకుంటే వ్యూహాత్మక ఆడుగుల్లో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా? అంటే వ్యూహాత్మక అడుగుల్లో భాగంగానే కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ పండితులు చెబుతున్నారు.
Also Read: Delhi CM: అరవింద్ కేజ్రీవాల్ వారసురాలు అతిషేనా..?
బీజేపీ గద్దె దింపడమే లక్ష్యమా?
బీజేపీ అధికారంలో ఉన్న హరియాణా అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆ పార్టీని గద్దె దింపడమే లక్ష్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు సీఎం కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే.. ఆ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొన వచ్చని కేజ్రీవాల్ భావిస్తున్నారని వారు పేర్కొంటున్నారు.
Also Read: Serilingampally MLA: అరెకపూడి గాంధీ నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు
బరిలో ఆప్ ఒంటరిగా.. బీజేపీ వ్యతిరేక ఓటు..
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా బరిలో నిలిచింది. దీంతో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే కాదు.. ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ పార్టీకి సైతం గట్టి దెబ్బ తప్పదనే అవకాశముందని వారు పేర్కొంటున్నారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం.. పట్టణ ఓటర్లపై పడుతుందన్నారు. అలాగే ఢిల్లీ, పంజాబ్ సరిహద్దుల్లోని బీజేపీ వ్యతిరేక ఓట్లను సైతం ఆమ్ ఆద్మీ పార్టీ కొల్లగొట్టే అవకాశముందని వారు స్పష్టం చేస్తున్నారు. ఏదీ ఏమైనా.. హరియాణా అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని సుస్పష్టం చేస్తున్నారు.
Also Read: J&K Assembly polls: ముస్లింలను విడగొట్టేందుకే ఇంజనీర్ రషీద్ విడుదల
పొత్తుపై పలుమార్లు చర్చలు.. కానీ విఫలం..
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో జత కట్టి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ క్రమంలో పొత్తుపై ఇరు పార్టీల అగ్రనేతలు పలు దఫాలుగా చర్చలు సైతం జరిపారు. కానీ సీట్ల సర్దుబాటు విషయంలో ఏకాభిప్రాయానికి రాలేదు. దీంతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒంటరిగా బరిలో దిగిన సంగతి తెలిసిందే.
సార్వత్రిక ఎన్నికల్లో తప్పని ఓటమి
అదీకాక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఈ రెండు పార్టీలు కలిసి 10 స్థానాల్లో పోటీ చేశాయి. కురుక్షేత్రలో ఆప్ అభ్యర్థిని బరిలో నిలపగా... ఆ స్థానంలో పార్టీ ఓటమి పాలైంది. ఇక 9 స్థానాల్లో నిలిచిన కాంగ్రెస్ పార్టీ మాత్రం 5 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులు గెలుపొందారు. 90 అసెంబ్లీ స్థానాలున్న హరియాణా అసెంబ్లీకి అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.