Share News

CBI : క్రైమ్‌ సీన్‌నే మార్చేశారు!

ABN , Publish Date - Aug 23 , 2024 | 02:58 AM

యావద్దేశాన్ని తీవ్ర దిగ్ర్భాంతిలోకి నెట్టిన కోల్‌కతా వైద్యవిద్యార్థిని హత్యాచార ఘటనకు సంబంధించి ఆర్జీకర్‌ ఆస్పత్రిలో క్రైమ్‌ న్‌సీన్‌ను మార్చేశారని సీబీఐ సంచలన వ్యాఖ్యలు చేసింది.

CBI : క్రైమ్‌ సీన్‌నే మార్చేశారు!

  • ఆత్మహత్య అంటూ తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించారు

  • సుప్రీంకోర్టుకు సమర్పించిన స్టేటస్‌ రిపోర్టులో సీబీఐ

  • ఎఫ్‌ఐఆర్‌ లేకుండా పోస్టుమార్టమా? కేసు నమోదులో జాప్యమా?.. ఇంత నిర్లక్ష్యాన్ని 30 ఏళ్లలో చూడలే: సుప్రీం

  • 15 రోజుల్లో శిక్ష పడేలా చట్టాలు.. మోదీకి మమత లేఖ

  • కోల్‌కతా పోలీసుల తీరు అత్యంత లోపభూయిష్టం: సుప్రీం కన్నెర్ర

న్యూఢిల్లీ, ఆగస్టు 22: యావద్దేశాన్ని తీవ్ర దిగ్ర్భాంతిలోకి నెట్టిన కోల్‌కతా వైద్యవిద్యార్థిని హత్యాచార ఘటనకు సంబంధించి ఆర్జీకర్‌ ఆస్పత్రిలో క్రైమ్‌ న్‌సీన్‌ను మార్చేశారని సీబీఐ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉదయం అత్యాచారం, హత్య జరిగితే పోస్టుమార్టం నిర్వహించి.. అంత్యక్రియలు ముగిశాక దాదా పు అర్ధరాత్రి 11:45 గంటలకు కోల్‌కతా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని.. ‘‘ఇది అత్యంత దిగ్ర్భాంతికరమైన వాస్తవం’’ అని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది.

పైగా.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటూ పోలీసులే తల్లిదండ్రులకు సమాచారమిచ్చి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని.. ఆ తర్వాతే హత్య అని చెప్పారని సీబీఐ తీవ్రంగా ఆక్షేపించింది. కేసులో వాస్తవాలను తొక్కిపెడుతున్నారనే అనుమానంతో హతురాలి సహచర వైద్యులు వీడియోగ్రఫీకి పట్టుబట్టడంతోనే పోస్టుమార్టం ప్రక్రియ ను వీడియో తీశారని నివేదికలో పేర్కొంది. కేసులో ఒక్క నిందితుడి ప్రమేయం ఉందనే బెంగాల్‌ పోలీసులు తేల్చారని పేర్కొంది.

ఈ మేరకు సీబీఐ గురువారం తన స్టేటస్‌ రిపోర్టును సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు ఉంచింది. ఆర్జీకర్‌ ఆస్పత్రిలో క్రైమ్‌సీన్‌ను మార్చేశారంటూ సీబీఐ తమ రిపోర్టులో స్పష్టం చేయడంతో బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వ తీరును దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర స్థాయిలో ఎండగట్టింది.


బెంగాల్‌ పోలీసులు వ్యవహరించిన తీరు నిర్లక్ష్యపూరితంగా ఉందని.. హత్యాచార ఘటన తర్వాత నిర్వహించాల్సిన ప్రక్రియను ఏమాత్రం అనుసరించలేదని మండిపడింది. ‘‘ఈ హత్యాచార కేసు ప్రక్రియలో మీ ప్రభుత్వం వ్యవహరించిన విధానాన్ని నా 30 ఏళ్ల వృతిపరమైన జీవితంలో ఎన్నడూ చూడలేదు’’ అని బెంగాల్‌ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయ బృందాన్ని ఉద్దేశించి ధర్మాసనంలోని సభ్యుడైన న్యాయమూర్తి జస్టిస్‌ పార్దివాలా వ్యాఖ్యానించారు.

ఎఫ్‌ఐఆర్‌ లేకుండా పోస్టుమార్టమా?

హత్యాచారం కేసును సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. సీబీఐ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, బెంగాల్‌ ప్రభుత్వం తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. హత్యాచార కేసులో పోలీసులు అనుసరించిన ప్రక్రియపై ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. ఓ అసహజ మరణంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండానే పోస్టుమార్టం నిర్వహించడంపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా.. కేసు నమోదులో బెంగాల్‌ పోలీసులు తీవ్ర జాప్యం చేయడమనేది ‘అత్యంత కలవరపాటుకు గురిచేసే అంశం’ అని న్యాయమూర్తి జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా వ్యాఖ్యానించారు. ‘‘జరిగింది అసహజ మరణం.. అదీ ఉదయం పూట. మరి.. పోస్టుమార్టం చేసిన తర్వాత ఎప్పుడో రాత్రి క్రైమ్‌సీన్‌ను అధీనంలోకి తెచ్చుకున్నారు. క్రైమ్‌సీన్‌ను సీజ్‌ చేయడంలో పోలీసులు ఎందుకింత ఆలస్యం చేశారు’’ అని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రశ్నించారు.

హత్యాచార ఘటన, వైద్యుల భద్రతపై ఆందోళన చేస్తున్న వైద్యసిబ్బంది వెంటనే విధుల్లో చేరాలని కోరుతూ వారిపై ఎలాంటి చర్యలూ ఉండబోవని తాము భరోసా ఇస్తున్నామని పేర్కొన్నారు. కాగా వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు తమ ఆందోళనను విరమించారు.


అయితే బెంగాల్‌లోని వైద్యులు మాత్రం ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా, త్యాచార దోషులకు కఠిన శిక్షలు పడేలా కేంద్ర చట్టాలను మరింత బలోపేతం చేయాలని బెంగాల్‌ సీఎం మమత డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ప్రధాని మోదీకి లేఖ రాశారు.

ముందురోజే కన్నేశాడా?

హతురాలైన జూనియర్‌ వైద్యురాలిపై ఘటనకు ముందురోజే నిందితుడు సంజయ్‌ రాయ్‌ కన్నేశాడా? సీబీఐలోని ఓ అధికారి మాటలు ఇదే సూచిస్తున్నాయి. ఘటనకు ముందు రోజు అంటే.. ఆగస్టు 8న ఉదయం 11 గంటలకు ఆర్జీకర్‌లోని ఛాతీ విభాగం వద్ద జూనియర్‌ వైద్యురాలు తన నలుగు రు సహచరులతో మాట్లాడుతుండగా.. అక్కడ సంజ య్‌ రాయ్‌ తచ్చాడినట్లు సీసీ ఫుటేజీ ద్వారా సీబీఐ తేల్చింది.

సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ రోజు ఆస్పత్రిలో ఛాతీ విభాగం వద్ద జూనియర్‌ వైద్యురాలు, ఆమె స్నేహితులవైపు రాయ్‌ కొద్దిసేపు తదేకంగా చూసి.. అక్కడి నుంచి వె ళ్లాడు. ఆరోజు రాత్రి కొందరు జూనియర్‌ వైద్యులతో కలిసి సంజయ్‌ రాయ్‌ డిన్నర్‌కు వెళ్లి.. అర్ధరాత్రి ఒంటి గంటకు థర్డ్‌ ఫ్లోర్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్లోకి ప్రవేశించాడు.

అక్కడికి 2:30 గంటలకు జూనియర్‌ వైద్యురాలొచ్చి, అతడితో ఏదో మాట్లాడి వెళ్లింది. రాయ్‌ మళ్లీ.. ఆస్పత్రిలోకి 9వ తేదీ తెల్లవారుజామున 4గంటలకు ప్రవేశించాడు. నేరుగా జూ నియర్‌ వైద్యురాలు నిద్రిస్తున్న కాన్ఫరెన్స్‌ హాల్లోకి వెళ్లాడు.

Updated Date - Aug 23 , 2024 | 02:58 AM