Lok Sabha Elections 2024: ఈవీఎంల స్టోరేజీ గిడ్డంగిలో 45 నిమిషాలు నిలిచిపోయిన సీసీటీవీలు
ABN , Publish Date - May 13 , 2024 | 05:38 PM
మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో ఈవీఎంల భద్రతపై ఆ నియోజకవర్గం ఎన్‌సీపీ(ఎస్‌పీ) అభ్యర్థి సుప్రియా సూలే ఆందోళన వ్యక్తం చేశారు. ఓటింగ్ అనంతరం ఈవీఎంలు భద్రపరచిన గిడ్డంగిలో సోమవారం ఉదయం 45 నిమిషాల పాటు సీసీటీవీలను స్విచ్ఛాప్ చేశారని ఆమె ఆరోపించారు.
ముంబై: మహారాష్ట్ర (Maharashtra)లోని బారామతి (Baramati) లోక్‌సభ నియోజకవర్గంలో ఈవీఎంల భద్రతపై ఆ నియోజకవర్గం ఎన్‌సీపీ(ఎస్‌పీ) అభ్యర్థి సుప్రియా సూలే (Supriya Sule) ఆందోళన వ్యక్తం చేశారు. ఓటింగ్ అనంతరం ఈవీఎంలు భద్రపరచిన గిడ్డంగిలో సోమవారం ఉదయం 45 నిమిషాల పాటు సీసీటీవీలను స్విచ్ఛాప్ చేశారని ఆమె ఆరోపించారు. బారామతి నియోజకవర్గంలో సుప్రియా సూలేపై ఆమె కజిన్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునీతా పవార్ పోటీ చేస్తున్నారు.
''బారామతి లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తర్వాత ఈవీఎంలు ఉంచిన గోదాములో సిసీటీవీలను ఈరోజు ఉదయం 45 నిమిషాలు నిలిపేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గోదాములో ఈ పరిణామం చోటుచేసుకోవడం అనుమానాస్పదంగా ఉంది. ఇది అది పెద్ద భద్రతా లోపం'' అని సుప్రియ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల ప్రతినిధులను, అధికారులను, జిల్లా యంత్రాగాన్ని సంప్రదించినా సంతృప్తికరమైన జవాబు రాలేదని, ఈవీఎంలు ఉంచిన ప్రాంతంలో టెక్నీషియన్లు కూడా అందుబాటులో లేరని ఆమె తెలిపారు. ఈవీఎంల స్టోరేజీ స్టేటస్‌ను తెలుసుకునేందుకు తన ఎన్నికల ప్రతినిధులను కూడా అనుమతించలేదని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ వెంటనే దీనిని పరిగణనలోకి తీసుకుని సీసీటీవీలు క్లోజ్ కావడానికి కారణాలను వెల్లడించాలని ఆమె కోరారు. ఈ ఘటనకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
కాగా, ఈవీఎంలు ఉంచిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాములోని సీసీటీవీ కెమెరాలు ఉదయం 10.30 గంటల నుంచి 11.15 నిమిషాల వరకూ స్విచ్ఛాప్ అయినట్టు సుప్రియ ఎన్నికల ప్రతినిధి లక్ష్మీకాంత్ ఖబియా తెలిపారు. సీసీటీవీలు 24 గంటలూ పనిచేస్తాయని ఎన్నికల అధికారులు చెప్పారని, తమ ప్రతినిధులు అక్కడే ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని ఖబియా చెప్పారు. అయితే సోమవారం సీసీటీవీలు 45 పాటు నిలిచిపోయినట్టు తమకు సమాచారం వచ్చిందని, పోలీసుల దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లడంతో పాటు, బారామతి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదును అందజేస్తున్నామని అన్నారు.
రిటర్నింగ్ అధికారి వివరణ
కాగా, గోదాము ఆవరణలో ఎలక్ట్రిక్ పనుల కారణంగా స్వల్పవ్యవధి పాటు కెమెరాల కేబుల్‌ను తొలగించినట్టు ఎన్నికల అధికారులు వివరణ ఇచ్చారు. దీనిపై బారామతి రిటర్నింగ్ అధికారి కవిత ద్వివేది మాట్లాడుతూ, ఎన్‌సీపీ (ఎస్‌పీ) ఫిర్యాదుపై విచారణ చేశామని, గోదాములోని ఒక కేబుల్‌ను ఎలక్ట్రీషియన్ తొలగించడంతో డిస్‌ప్లే యూనిట్ షట్‌డౌన్ అయినట్టు తెలిసిందని చెప్పారు.
Read Latest Telangana News and National News