Share News

Central Government : నీట్‌ రద్దు చేయొద్దు

ABN , Publish Date - Jul 06 , 2024 | 03:04 AM

నీట్‌ యూజీ పరీక్షను రద్దు చేయొద్దని.. అలా చేస్తే నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.

Central Government : నీట్‌ రద్దు చేయొద్దు

  • నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది మంది

  • విద్యార్థులకు రద్దుతో తీవ్రనష్టం

  • భారీగా అవకతవకలు జరిగిన దాఖలాల్లేవు

  • ఇప్పటికే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాం

  • సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం

  • సర్కారుబాటలోనే రద్దును

  • వ్యతిరేకించిన ఎన్‌టీఏ

న్యూఢిల్లీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): నీట్‌ యూజీ పరీక్షను రద్దు చేయొద్దని.. అలా చేస్తే నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. నీట్‌ పరీక్ష నిర్వహణలో భారీ మొత్తంలో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని.. ఆ పరీక్షను రద్దు చేసి కొత్తగా పరీక్ష నిర్వహించడం హేతుబద్థం కాదని స్పష్టం చేసింది. అలా నిజాయతీగా పరీక్ష రాసిన లక్షలాది విద్యార్థుల ప్రయోజనాలను కాపాడడానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది.

నీట్‌ యూజీ ప్రశ్నాపత్రాల లీకేజీ సహా పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై.. కేంద్ర విద్యా శాఖ శుక్రవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది. నీట్‌ అక్రమాలపై సమగ్ర దర్యాప్తునకు సీబీఐని ఆదేశించినట్లు అందులో పేర్కొంది. అలాగే.. ఈ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఎజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్యర్యంలో పరీక్షలను సమర్థంగా, సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కోర్టుకు తెలిపింది. కేంద్రం బాటలోనే.. ఎన్‌టీఏ కూడా నీట్‌ పరీక్ష రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.


ఈ పరీక్షను ఎలాంటి అక్రమాలకూ తావులేకుండా జరిపామని.. మాల్‌ప్రాక్టీస్‌ జరిగినట్టు వస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవని.. పట్నా, గోధ్రాలోని కేంద్రాలలో మాత్రమే అక్రమాలు జరిగాయని పేర్కొంది. వ్యక్తిగత సంఘటనల ఆధారంగా మొత్తం పరీక్షను రద్దు చేయొద్దని ఎన్‌టీఏ విజ్ఞప్తి చేసింది. అలా రద్దు చేయడం వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందని.. మరీ ముఖ్యంగా అర్హులైన అభ్యర్థుల కెరీర్‌ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా.. నీట్‌ అక్రమాలపై దాఖలైన పిటిషన్లపై.. సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పర్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ నెల 8న విచారణ జరపనుంది.

Updated Date - Jul 06 , 2024 | 03:04 AM