Share News

Ex vice-chairman of NITI Aayog Rajiv Kumar: ప్రత్యేక హోదాపై కేంద్రం దృష్టి పెట్టాలి!

ABN , Publish Date - Jun 24 , 2024 | 03:42 AM

ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలు సుదీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తున్న ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా దృష్టి సారించాలని నీతి ఆయోగ్‌ మాజీ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌ సూచించారు.

Ex vice-chairman of NITI Aayog Rajiv Kumar:  ప్రత్యేక హోదాపై కేంద్రం దృష్టి పెట్టాలి!

  • ఏపీ, బిహార్‌ల డిమాండ్‌ను పరిశీలించాలి

  • నీతి ఆయోగ్‌ మాజీ ఉపాధ్యక్షుడి సూచన

  • కేంద్రంపై ఆర్థిక భారం పడుతుందని వ్యాఖ్య

న్యూఢిల్లీ, జూన్‌ 23: ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలు సుదీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తున్న ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా దృష్టి సారించాలని నీతి ఆయోగ్‌ మాజీ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌ సూచించారు. అయితే, ఈ విషయంలో తొందరపడితే ఆర్థిక భారంతో ఇబ్బందులు పెరుగుతాయని చెప్పారు. ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. బిహార్‌, ఏపీలు కోరుతున్న ప్రత్యేక హోదా డిమాండ్‌ సుదీర్ఘకాలంగా ఉన్నదేనని తెలిపారు. దీనిని అత్యంత జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఎందుకంటే.. ఏయే ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక హోదా కోరుతున్నారనేది కీలకమని తెలిపారు. తొందర పడి నిర్ణయం తీసుకుంటే.. రేపు మరిన్ని రాష్ట్రాలు కూడా హోదా కోసం డిమాండ్‌ చేస్తాయని రాజీవ్‌కుమార్‌ తెలిపారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు హోదా కోరుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా విషయాన్ని నిశితంగా సమీక్షించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ పనిని ఆర్థిక సంఘం చేయొచ్చన్నారు. ‘‘ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ ఉంది. కానీ, ప్రధాని మాత్రం ఇప్పటికీ ఈ విషయంలో మౌనంగానే ఉన్నారు’’ అని రాజీవ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.


మరిన్ని విషయాలు

  • 2014లో జరిగిన ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఏపీ హైదరాబాద్‌ నగరాన్ని కోల్పోయి ఆర్థికంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తోంది.

  • 2000 సంవత్సరంలో ఉమ్మడి బిహార్‌ విడిపోయి.. గనులు, భూగర్భ వనరులు ఎక్కువగా ఉన్న జార్ఖండ్‌ నూతన రాష్ట్రంగా అవతరించింది. దీంతో బిహార్‌ నష్టపోయింది. ఈ నేపథ్యంలో 2005 నుంచి ప్రత్యేక హోదా కోసం బిహార్‌ డిమాండ్‌ చేస్తోంది.

  • ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఇస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే పథకాలకు 90 శాతం నిధులను కేంద్రమే ఇవ్వాల్సి ఉంటుంది. హోదా లేని రాష్ట్రాలకు కేంద్రం 60 శాతమే నిధులు ఇస్తుంది. మిగిలిన నిధులను ఆయా రాష్ట్రాలు కేటాయిస్తాయి.

  • కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాల వాటాను 14వ ఆర్థిక సంఘం 32 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. కానీ, ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలను రద్దు చేసింది.

  • 1969లో తొలిసారి రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కేటగిరీని ప్రవేశ పెట్టారు. అప్పట్లో ఐదో ఆర్థిక సంఘం దీనిని సిఫారసు చేసింది.

  • ప్రధానంగా కొండ ప్రాంతాలు, అంతర్జాతీయ సరిహద్దులు ఉన్న రాష్ట్రాలు, ఆర్థికంగా, మౌలిక వసతుల పరంగా వెనుకబడిన రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక హోదాను సిఫారసు చేయడం గమనార్హం.

Updated Date - Jun 24 , 2024 | 03:42 AM