Train Accident: మరో రైలు ప్రమాదంలో ముగ్గురు మృతి, 34 మందికి గాయాలు.. కారణమిదేనా..
ABN , Publish Date - Jul 19 , 2024 | 07:29 AM
దేశంలో మరో ఘోర రైలు(train accident) ప్రమాదం చోటుచేసుకుంది. గత నెలలో జరిగిన కాంచన్ గంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటన మరువక ముందే తాజాగా మరొకటి జరిగింది. చండీగఢ్ నుంచి దిబ్రూఘర్ వెళ్తున్న దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్ రైలు యూపీ(Uttar Pradesh)లోని గోండా(Gonda) జిల్లాలో గురువారం సాయంత్రం పట్టాలు తప్పింది.
దేశంలో మరో ఘోర రైలు(train accident) ప్రమాదం చోటుచేసుకుంది. గత నెలలో జరిగిన కాంచన్ గంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటన మరువక ముందే తాజాగా మరొకటి జరిగింది. చండీగఢ్ నుంచి దిబ్రూఘర్ వెళ్తున్న దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్ రైలు యూపీ(Uttar Pradesh)లోని గోండా(Gonda) జిల్లాలో గురువారం సాయంత్రం పట్టాలు తప్పింది. ఈ క్రమంలో జిలాహి, మోతిగంజ్ రైల్వే స్టేషన్ మధ్య రైలులోని 14 కోచ్‌లు చెల్లాచెదురయ్యాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా, 34 మంది గాయపడ్డారు.
ప్రమాదం తర్వాత దాదాపు 500 మీటర్ల రైల్వే ట్రాక్ నేలకూలింది. విద్యుత్ లైన్లు కూడా దెబ్బతిన్నాయి. గాయపడిన వారిని గోండాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్పించారు. అక్కడ వైద్యుల బృందం వారికి చికిత్స చేస్తోంది. పట్టాలు తప్పిన చండీగఢ్-దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్ రైలు 600 మంది ప్రయాణికులతో అసోంకు బయలుదేరింది.
ఎక్స్‌గ్రేషియా
ప్రమాదంపై సమాచారం అందుకున్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే భద్రతపై కొనసాగుతున్న కమిషన్ విచారణతో పాటు రైల్వే మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి విచారణను ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్‌గ్రేషియాను కూడా ప్రకటించారు.
కారణమిదేనా..
ఈ ఘటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ప్రయాణించే అనేక రైళ్లను(trains) రద్దు చేశారు. 16 రైళ్ల రూట్లను మార్చారు. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైలు, బస్సు సౌకర్యాలు కల్పించారు. ప్రయాణీకులను బస్సులో సమీపంలోని మాన్కాపూర్ స్టేషన్‌కు తీసుకువెళతారు. అక్కడి నుంచి మరొక రైలులో పంపిస్తారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిగ్నల్ తప్పిందా, లేదా లోకో పైలట్ తప్పిదమా లేక ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రమాద సమయంలో రైలు వేగం గంటకు 100 కి.మీ.గా ఉన్నట్లు శాఖాపరమైన వర్గాల సమాచారం. వర్షం కారణంగా ట్రాక్‌కు ఇరువైపులా నీరు నిలిచిపోవడంతో ట్రాక్‌కు గండి పడడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
హెల్ప్‌లైన్ నంబర్లు
సహాయం కోసం అధికారులు హెల్ప్‌లైన్ నంబర్‌లను ఏర్పాటు చేశారు: 8957400965 (గోండా), 8957409292 (లక్నో), మరియు 9957555960 (దిబ్రూగర్).
ఇవి కూడా చదవండి:
NEET: పరీక్ష కేంద్రాల వారీగా నీట్ ఫలితాలు..
Maharashtra: గడ్చిరోలి ఎన్‌కౌంటర్ మృతదేహాల గుర్తింపు..
For Latest News and National News click here