Chennai : బీఎస్పీ నేత హత్య కేసు నిందితుడు ఎన్‌కౌంటర్‌లో హతం
ABN , Publish Date - Jul 15 , 2024 | 04:25 AM
చెన్నై నగర శివారు ప్రాంతం మాధవరం వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో బీఎస్పీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకేసు నిందితుడు తిరువేంగడం హతమయ్యాడు. ఈ నెల 5వ తేదీ ....
చెన్నై, జూలై 14 (ఆంధ్రజ్యోతి): చెన్నై నగర శివారు ప్రాంతం మాధవరం వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో బీఎస్పీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకేసు నిందితుడు తిరువేంగడం హతమయ్యాడు. ఈ నెల 5వ తేదీ రాత్రి జరిగిన ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకు సంబంధించి 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో పేరుమోసిన రౌడీ తిరువేంగడం బీఎస్పీ నేత హత్యకు పథకం రూపొందించినట్టు విచారణలో వెల్లడైంది.
ఆ నేపథ్యంలో మాధవరంలోని ఇంటిలో మారణాయుధాలు దాచి ఉంచినట్టు తిరువేంగడం వాంగ్మూలం ఇవ్వడంతో వాటిని స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు తీసుకెళ్ళారు. మార్గమధ్యంలో రెట్టేరి వద్ద కాలకృత్యాలు తీర్చుకునేందుకు వ్యాన్ నుంచి దిగిన తిరువేంగడం పరారయ్యాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి పుళల్ వెజిటేరియన్ విలేజ్ ప్రాంతంలో షెడ్డులోదాగి ఉన్న అతన్ని చుట్టుముట్టారు. పోలీసులను చూడగానే తిరువేంగడం తన వద్దనున్న రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరుపటంతో ప్రాణాలు కోల్పోయాడు.