Chennai: లోక్‌సభ ఎన్నికలకు జోరుగా ప్రచార వాహనాల తయారీ..
ABN , Publish Date - Mar 12 , 2024 | 12:58 PM
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీ నాయకులంతా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నాయకుల కోసం వాణిజ్య నగరమైన కోయంబత్తూరులో సకల సదుపాయాలతో హైటెక్ ప్రచార వాహనాలు తయారవుతున్నాయి.
చెన్నై: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీ నాయకులంతా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నాయకుల కోసం వాణిజ్య నగరమైన కోయంబత్తూరులో సకల సదుపాయాలతో హైటెక్ ప్రచార వాహనాలు తయారవుతున్నాయి. కోయంబత్తూరు(Coimbatore)లోని ఓ ప్రైవేటు సంస్థ ప్రధాన పార్టీల నాయకుల కోసం ప్రచార వాహనాల తయారీ కాంట్రాక్టును పొంది వాటిని ముమ్మరంగా తయారు చేస్తోంది. ఈ సంస్థ గతంలో రాజీవ్‌గాంధీ, కరుణానిధి, జయలలిత, డీఎండీకే చీఫ్ విజయకాంత్, కేరళ సీఎం కరుణాకరన్ తదితర నాయకుల కోసం ప్రచార వాహనాలను రూపొందించింది. ప్రస్తుతం లోక్‌సభ(Lok Sabha) ఎన్నికల సమీపిస్తుండటంతో ఆ సంస్థ పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖుల కోసం ప్రచార వాహనాలను తయారు చేస్తోంది. ఈ విషయమై ఆ సంస్థ యజమాని మహమ్మద్ రియాజ్ మాట్లాడుతూ... ఐదు దశాబ్దాలకు పైగా తమ సంస్థ ప్రచార వాహనాలను తయారు చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ నేతలు, ప్రముఖులకు తమ సంస్థ 95 శాతం దాకా ప్రచార వాహనాలను తయారు చేసిందన్నారు. రాష్ట్రంలోని నాయకులే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన నాయకుల కోసం ప్రచార వాహనాలు తయారు చేస్తున్నామని వివరించారు. రాజకీయ నాయకుల అవసరాలకు తగినట్టు ప్రచార వాహనాలు తయారు చేసి అందిస్తున్నామని చెప్పారు. తమ ఇళ్లలో ఉన్నట్లు ప్రచార వాహనంలో సదుపాయాలు ఉండేటట్లు తయారు చేయమని కోరుతున్నారని చెప్పారు. అందుకు తగినట్టే సోఫా, టాయ్‌లెట్, ఎల్‌ఈడీ లైట్లు, ఏసి తదితర సదుపాయాలతో ప్రచార వాహనాలను డెలివరీ చేస్తున్నామని చెప్పారు.
కొత్త వెరైటీలు...
ప్రస్తుతం నాయకులంతా కొత్త సాంకేతిక పద్ధతులతో కూడిన ప్రచార వాహనాలను ఇష్టపడుతున్నారని, ఆ ప్రకారం చుట్టూ తిరిగే కుర్చీ, మీట నొక్కగానే ప్రచారవాహనంపై తెరచుకునే విశాలమైన పైకప్పు, ప్రచారవాహనం లోపల నుంచి పైకి వెళ్లేలా వెడల్పయిన మెట్లు, తమకు ఇరువైపులా సెక్యూరిటీ గార్డులు నిలిచేందుకు ఏర్పాట్లు, వాహనం చుట్టూ గుమికూడే ప్రజలను చూడగలిగేలా 360 డిగ్రీల కోణంలో తిరిగే సీసీ కెమెరాల సదుపాయంతో తయారు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.