Share News

Loksabha Polls: రంగంలోకి కేజ్రీవాల్..?

ABN , Publish Date - May 15 , 2024 | 04:23 AM

మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎన్నికల ప్రచారం కోసం బెయిల్‌ రావడం ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరీ ముఖ్యంగా ఆప్‌ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో కేజ్రీ రంగంలోకి దిగితే రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

 Loksabha Polls: రంగంలోకి కేజ్రీవాల్..?
aravind kejriwal

నేటి నుంచి ఢిల్లీ సీఎం ఎన్నికల ప్రచారం.. ఈ నెల 25న ఢిల్లీలో పోలింగ్‌

రాజధానిలో కాంగ్రె్‌సతో

ఆప్‌ పొత్తు.. 4చోట్ల పోటీ

పంజాబ్‌లో అన్ని స్థానాల్లో

ఒంటరిగా బరిలోకి!

(సెంట్రల్‌ డెస్క్‌)

మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎన్నికల ప్రచారం కోసం బెయిల్‌ రావడం ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరీ ముఖ్యంగా ఆప్‌ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో కేజ్రీ రంగంలోకి దిగితే రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

రెండు వారాల బెయిల్‌ పొందిన కేజ్రీ శుక్రవారం బయటకు వచ్చారు. మరుసటి రోజే మీడియా సమావేశం ఏర్పాటు చేయగా.. పార్టీ కార్యకర్తలు, నేతలు భారీఎత్తున తరలివచ్చారు. దీంతో సమావేశం బహిరంగ సభను తలపించింది. ఆదివారం ఎమ్మెల్యేలతో సమావేశమైన కేజ్రీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఇండియా కూటమి పార్టీల అభ్యర్థులకు మద్దతుగా బుధవారం లఖ్‌నవూ, 16న జమ్‌షెడ్‌పూర్‌, 17న ముంబైలో పర్యటించడం ద్వారా నేరుగా ఎన్నికల కదన రంగంలోకి దిగనున్నారు. ఢిల్లీలో ఏడు స్థానాలకు గాను ఆప్‌ నాలుగుచోట్ల పోటీ చేస్తోంది. కాంగ్రె్‌సకు మూడు స్థానాలు కేటాయించింది.

ఢిల్లీలో ఆరో విడతలో ఈ నెల 25న పోలింగ్‌ జరగనుంది. పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్‌, ఆప్‌ వేటికవే పోటీ చేస్తున్నాయి. చాలాచోట్ల ప్రధాన ప్రత్యర్థులుగా తలపడతున్నాయి. ఈ రాష్ట్రంలో ఏడో విడతలో జూన్‌ 1న పోలింగ్‌ నిర్వహించనున్నారు.


కేజ్రీ లోటు ఢిల్లీలో స్పష్టం

ఆమ్‌ ఆద్మీ పార్టీకి పంజాబ్‌ కంటే ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ లేని లోటు మొన్నటివరకు స్పష్టంగా కనిపించింది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీని స్వీప్‌ చేసిన బీజేపీని ఈసారి నిలువరించాలంటే కేజ్రీనే మూలస్తంభం. అయితే, సరిగ్గా ఎన్నికల సమయంలో మద్యం కుంభకోణంలో ఆయనను అరెస్టు చేసి 50 రోజులు జైల్లో ఉంచడంతో ఆప్‌ డీలాపడిపోయింది. మరోవైపు ఆప్‌తో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాంగ్రె్‌సకు చెందిన పలువురు నాయకులు రాజీనామా చేశారు.

ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అర్విందర్‌ సింగ్‌ లవ్లీ బీజేపీలో చేరిపోయారు. క్షేత్రస్థాయిలోనూ రెండు పార్టీల శ్రేణుల మధ్య విభేదాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేజ్రీ రాక.. రెండు పార్టీల మధ్య సమన్వయాన్ని పెంచుతుందని.. ఉమ్మడి ప్రత్యర్థి బీజేపీని ఎదుర్కొనేందుకు బలం ఇస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేజ్రీవాల్‌ రాకతో ఆప్‌ కార్యకర్తల్లో నైతిక స్థైర్యం పెరిగింది. ఆప్‌-కాంగ్రెస్‌ ఎన్నికల సమన్వయ కమిటీలో చురుకుదనం వచ్చింది. అయితే, సుదీర్ఘ కాలం నుంచి ప్రత్యర్థులుగా ఉన్న పార్టీల మధ్య రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీపైనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

పంజాబ్‌ వెళ్లకుంటేనే మేలు?

ఢిల్లీలో కేజ్రీ ప్రచారం ఆప్‌నకు ఎంత బలమో పంజాబ్‌లో అంత ఇబ్బందికరం అన్న విశ్లేషణలు వస్తున్నాయి. సీఎం భగవంత్‌సింగ్‌ మాన్‌ ఇప్పటివరకు అంతా తానే అయి నడిపిస్తున్నారు. దీంతో కేజ్రీ వచ్చినా పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు. అంతేగాక, ఆయన రాక రాష్ట్రంలో ఆప్‌-కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య విభేదాలను మరింత రాజేస్తుందని.. ఆ ప్రభావం ఢిల్లీపైనా పడుతుందని పేర్కొంటున్నారు.

అన్నిటికిమించి కేజ్రీ రాక పంజాబ్‌లో అతివాద సిక్కు ఓటర్లు ఆప్‌నకు వ్యతిరేకం అవుతారని వివరిస్తున్నారు. ఖదూర్‌ సాహిబ్‌ నుంచి స్వతంత్రుడిగా పోటీ చేస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది అమృత్‌ పాల్‌సింగ్‌కు బెయిల్‌ రాకపోవడం, కేజ్రీవాల్‌కు ప్రచారం కోసం బెయిల్‌ దొరకడం ఆప్‌కు ఇబ్బందికరమవుతుందన్న భావన వ్యక్తమవుతోంది. ’

Updated Date - May 15 , 2024 | 10:23 AM