CM MK Stalin : కన్యాకుమారిలో అద్దాల వంతెన
ABN , Publish Date - Dec 31 , 2024 | 05:01 AM
ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన తమిళనాడులోని కన్యాకుమారిలో రూ.37 కోట్లతో నిర్మించిన ఫైబర్ గ్లాస్ వంతెనను సీఎం ఎంకే స్టాలిన్ సోమవారం ప్రారంభించారు.
రూ.37 కోట్లతో వివేకానంద మండపం, తిరువళ్లువర్ విగ్రహం మధ్య నిర్మాణం
ప్రారంభించిన తమిళనాడు సీఎం స్టాలిన్
చెన్నై, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన తమిళనాడులోని కన్యాకుమారిలో రూ.37 కోట్లతో నిర్మించిన ఫైబర్ గ్లాస్ వంతెనను సీఎం ఎంకే స్టాలిన్ సోమవారం ప్రారంభించారు. దీని పొడవు 77 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు ఉంటుంది. వివేకానంద స్మారక మండపం, 133 అడుగుల ఎత్తయిన తిరువళ్లువర్ విగ్రహ ప్రాంతాలను కలిపేలా ఈ వంతెనను నిర్మించారు. కన్యాకుమారి తీరంలో వివేకానంద స్మారక మండపానికి 77 మీటర్ల దూరంలో 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి హయాంలో తిరువళ్లువర్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ విగ్రహ ప్రతిష్టాపన జరిగి జనవరి 1వ తేదీకి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని తమిళనాడు ప్రభుత్వం రెండు రోజులపాటు రజతోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ మేరకు ఫైబర్ గ్లాస్ వంతెనను స్టాలిన్ ప్రారంభించారు. రజతోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన జ్ఞాన స్థూపాన్ని కూడా సీఎం ప్రారంభించారు. ఈ వేడుకలలో మంత్రులు దురైమురుగన్, ఈవీ వేలు, పీకే శేఖర్‌బాబు, ఎంపీలు టీఆర్.బాలు, ఎ.రాజా, కనిమొళి తదితరులు పాల్గొన్నారు.