Share News

Mallikarjun Kharge: యూటర్న్‌ మోదీ!

ABN , Publish Date - Aug 26 , 2024 | 05:40 AM

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం కొత్తగా ప్రకటించిన ‘యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీం(యూపీఎ్‌స)’ను కాంగ్రెస్‌ ఎద్దేవాచేసింది.

 Mallikarjun Kharge: యూటర్న్‌ మోదీ!

న్యూఢిల్లీ, ఆగస్టు 25: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం కొత్తగా ప్రకటించిన ‘యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీం(యూపీఎ్‌స)’ను కాంగ్రెస్‌ ఎద్దేవాచేసింది. ఈ యూపీఎ్‌సలో ‘యూ’ అంటే మోదీ ప్రభుత్వ యూటర్న్‌లు అని అర్థమని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన ‘ఎక్స్‌’లో స్పందించారు.జూన్‌ 4 (ఎన్నికల ఫలితాల రోజు) తర్వాత ప్రధాని మోదీ అహంభావంపై ప్రజాధికారం విజయం సాధించిందన్నారు.


దీర్ఘకాలిక కేపిటల్‌ గెయిన్‌/ఇండెక్సేషన్‌, వక్ఫ్‌ బిల్లును జేపీసీకి పంపడం, బ్రాడ్‌కాస్ట్‌ బిల్లు, సివిల్స్‌లో లేటరల్‌ ఎంట్రీపై కేంద్రం వెనక్కి తగ్గడాన్ని ప్రస్తావించారు. ‘ఈ నిరంకుశ ప్రభుత్వం నుంచి 140 కోట్ల మంది భారతీయులను కాపాడేందుకు.. అది జవాబుదారీతనంతో వ్యవహరించేలా ఒత్తిడి కొనసాగిస్తాం’ అని పేర్కొన్నారు. కాగా.. కొత్త యూపీఎస్‌ స్కీంను దళితులు, గిరిజనులు, ఓబీసీలపై దాడిగా ఏఐసీసీ మీడియా-పబ్లిసిటీ విభాగం అధిపతి పవన్‌ ఖేరా అభివర్ణించారు.


‘పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వుడు కేటగిరీ వారికి వయోపరిమితి 40 ఏళ్లుగా ఉంది. యూపీఎ్‌ససీలో 37 ఏళ్లు మాత్రమే. యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీం ప్రకారం.. పూర్తి పెన్షన్‌ అందాలంటే ఉద్యోగి 25 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకోవాలి. ఈ పరిస్థితిలో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు ఈ సౌకర్యం ఎలా లభిస్తుంది’ అని ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్‌ పార్టీకే చెందిన ‘ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌’ చైర్మన్‌ ప్రవీణ్‌ చక్రవర్తి ఆయనతో విభేదించారు. కొత్త స్కీంను ఆయన స్వాగతించారు.

Updated Date - Aug 26 , 2024 | 05:40 AM