Share News

Rahul Gandhi: టెంపో బిలియనీర్ల చేతిలో ప్రధాని తోలుబొమ్మ రాజు.

ABN , Publish Date - May 12 , 2024 | 02:34 AM

ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శనాస్ర్తాలు సంధించారు. ‘‘మోదీ.. టెంపో బిలియనీర్ల’’ చేతిలో ‘తోలుబొమ్మ రాజు’ అంటూ ఎద్దేవా చేశారు. అదానీ, అంబానీల నుంచి కాంగ్రెస్‌ టెంపోల్లో నగదు పొందుతున్నట్టు ప్రధాని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై రాహుల్‌ గాంధీ శనివారం మరోసారి విరుచుకుపడ్డారు.

Rahul Gandhi: టెంపో బిలియనీర్ల చేతిలో ప్రధాని తోలుబొమ్మ రాజు.

  • రాహుల్‌ గాంధీ విమర్శ

న్యూఢిల్లీ, మే 11: ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శనాస్ర్తాలు సంధించారు. ‘‘మోదీ.. టెంపో బిలియనీర్ల’’ చేతిలో ‘తోలుబొమ్మ రాజు’ అంటూ ఎద్దేవా చేశారు. అదానీ, అంబానీల నుంచి కాంగ్రెస్‌ టెంపోల్లో నగదు పొందుతున్నట్టు ప్రధాని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై రాహుల్‌ గాంధీ శనివారం మరోసారి విరుచుకుపడ్డారు.

శుక్రవారం లఖ్‌నవూలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగం సారాంశాలతో కూడిన ఒక వీడియోను ‘ఎక్స్‌’లో పంచుకున్నారు. ‘‘నరేంద్ర మోదీ ప్రధాని కాదు.. ఆయన ఒక రాజు. టెంపో బిలియనీర్ల చేతిలో ఆయన తోలుబొమ్మ రాజు’’ అంటూ హిందీలో పోస్ట్‌ చేశారు. లఖ్‌నవూలో జరిగిన కార్యక్రమంలోనూ మోదీ ప్రధాని కాదు రాజు అంటూ రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కాగా లోక్‌సభ ఎన్నికలపై బహిరంగ చర్చకు ఇద్దరు మాజీ జడ్జిలు, హిందూ పత్రిక మాజీ ఎడిటర్‌ ఎన్‌.రామ్‌ ఆహ్వానించడాన్ని స్వాగతిస్తున్నట్టు శనివారం రాహుల్‌ గాంధీ తెలిపారు.


ఇది ప్రధాన రాజకీయ పార్టీలు తమ దార్శనికతను ఒక వేదిక ద్వారా దేశానికి తెలియజేసేందుకు దోహదపడే సానుకూల చొరవగా ఆయన అభివర్ణించారు. ఈ చర్చలో తాను లేదా తమ పార్టీ చీఫ్‌ ఖర్గే పాల్గొంటామని, ఇందులో ప్రధాని కూడా పాల్గొంటారని ఆశిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ చర్చలో పాల్గొనాలని దేశం ఆశిస్తోందని ‘ఎక్స్‌’వేదికగా రాహుల్‌ పోస్ట్‌ చేశారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే శనివారం ప్రధానిపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి ముకేష్‌ అంబానీ, గౌతమ్‌ అదానీలు నల్లధనాన్ని పంపుతుంటే మోదీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. అంబానీ, అదానీల విషయంలో కాంగ్రెస్‌ మౌనంగా లేదని, నిజాలను ప్రజలకు చెప్తోందని అన్నారు.

Updated Date - May 12 , 2024 | 02:34 AM