INDIA alliance: నితీష్, ఖర్గేలకు కీలక బాధ్యతలు.. రాహుల్ యాత్రకు లైన్ క్లియర్..?
ABN , Publish Date - Jan 03 , 2024 | 08:53 PM
విపక్ష కూటమిలో అసంతృప్తులను శాంతపరచడం ద్వారా రాహుల్ గాంధీ చేపట్టనున్న ''భారత్ న్యాయ్ యాత్ర'' కు లైన్ క్లియర్ చేసేందుకు ''ఇండియా'' కూటమి కీలక భాగస్వామి అయిన కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ ను కూటమి కోఆర్డినేటర్ గా నియమించే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ: విపక్ష కూటమిలో అసంతృప్తులను శాంతపరచడం ద్వారా రాహుల్ గాంధీ (Rahul gandhi) చేపట్టనున్న ''భారత్ న్యాయ్ యాత్ర'' (Bharat Justice Yatra)కు లైన్ క్లియర్ చేసేందుకు ''ఇండియా'' (I.N.D.I.A.) కూటమి కీలక భాగస్వామి అయిన కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar)ను కూటమి కోఆర్డినేటర్ (Coordinator)గా నియమించే అవకాశం ఉంది. దీనితో పాటు కూటమి చైర్మన్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నియమితులవుతారని తెలుస్తోంది. దీనిపై ఈనెల 4వ తేదీన ఖర్గే ఏర్పాటు చేసిన వర్చువల్ మీట్‌లో ఓ స్పష్టత రానుంది. నితీష్, లాలూ ప్రసాద్ యాదవ్‌తో ఖర్గే ఈ వర్చువల్ మీట్ జరుపనున్నారు.
కూటమిలో ప్రతిష్ఠంభన తలెత్తకుండా...
మణిపూర్ నుంచి ముంబై వరకూ రాహుల్ గాంధీ జనవరి 14 నుంచి రెండు నెలల పాటు ''భారత్ న్యాయ్ యాత్ర'' చేపట్టనున్నారు. ఈ తరుణంలో కూటమిలో ఎలాంటి ప్రతిష్ఠంభన తలెత్తకూడదని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం. ఇందులో భాగంగానే నితీష్‌ను కూటమి కన్వీనర్‌గా చేసేందుకు కాంగ్రెస్ చొరవ తీసుకుంది. 2024 ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కూటమిలో ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా చూడాలని ఆ పార్టీ కోరుకుంటోంది.
సొంతగూటి ఊహాగానాలు..
ఇండియా కూటమిలో ఇటీవల చోటుచేసుకున్న ఒకటి, రెండు పరిణామాలపై నితీష్ అసంతృప్తిగా ఉన్నారని, తిరిగి ఎన్డీయే గూటికి చేరబోతున్నారనీ ఊహాగానాలు వినిపించాయి. ఈ ఊహాగానాలు కాంగ్రెస్ పార్టీని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ కారణంగానే ఢిల్లీలో విపక్ష నేతల సమావేశం పూర్తికాగానే రాహుల్ గాంధీ నేరుగా నితీష్‌తో ఫోనులో మాట్లాడారు. బీజీపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుకు చొరవ తీసుకున్న నేతల్లో నితీష్ కీలకంగా ఉండటం కూడా ఇందుకు మరో కారణం. ఈ క్రమంలోనే ఇతర పార్టీల నేతలను కూడా కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకుంటూ చర్చలు సాగిస్తోంది. నితీష్ కుమార్‌కు కీలక బాధ్యతలు అప్పగించేందుకు అరవింద్ కేజ్రీవాల్ సహా దాదాపు నేతలంతా అంగీకరించినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నితీష్, లాలూ ప్రసాద్ యాదవ్‌తో ఖర్గే గురువారం జరుపనున్న వర్చువల్ మీట్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.