రాజ్యాంగం రెడ్‌బుక్‌ని నక్సలిజంతో పోల్చుతారా?
ABN , Publish Date - Nov 11 , 2024 | 03:50 AM
రాజ్యాంగం రెడ్‌బుక్‌ని అర్బన్ నక్సలిజంతో పోలుస్తారా... అంటూ ప్రధాని మోదీ, బీజేపీలను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రశ్నించారు.
2017లో ప్రధాని అదే రెడ్‌బుక్‌ను అప్పటి రాష్ట్రపతికి ఇవ్వలేదా: ఖర్గే
ముంబయి, నవంబరు 10 : రాజ్యాంగం రెడ్‌బుక్‌ని అర్బన్ నక్సలిజంతో పోలుస్తారా... అంటూ ప్రధాని మోదీ, బీజేపీలను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రశ్నించారు. అటువంటి ప్రతినే 2017లో ప్రధాని మోదీ అప్పటి రాష్ట్రపతి కోవింద్‌కి ఇచ్చారని గుర్తుచేశారు. అందుకు సంబంధించిన ఫొటోని ఖర్గే విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. నవంబరు 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మహా వికాస్ అఘాడీ(ఎంవీయే) మేనిఫెస్టో ఆదివారం విడుదల చేసిన ఆయన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ... ఈ వ్యాఖ్యలు చేశారు. వివిధ సామాజిక వర్గాల స్థితిగతులను తెలుసుకుని వెనుకబడిన వర్గాల వారికి లబ్ధి చేకూర్చేందుకే కాంగ్రెస్ కులగణన చేయాలని డిమాండ్ చేస్తుందే తప్ప ప్రజలను విభజించేందుకు కాదన్నారు. అలాగే రెడ్‌బుక్ రాజ్యాంగ ప్రతిని చూపిస్తూ ప్రధాని మోదీ, బీజేపీ చెబుతున్నట్లు అది ఖాళీ పుస్తకం కాదన్నారు. ప్రధానిని మళ్లీ ప్రాథమిక పాఠశాలలో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. కాగా రెడ్‌బుక్ చేతబూని రాహుల్‌గాంధీ అర్బన్ నక్సల్స్, అరాచక శక్తుల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల ఆరోపించారు.