Share News

Congress : నీట్‌ అక్రమాలపై నిరసనల యుద్ధం

ABN , Publish Date - Jun 20 , 2024 | 03:37 AM

నీట్‌ అక్రమాలపై దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్‌ సిద్ధమైంది. ఆ పరీక్ష నిర్వహణలో మోదీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ.. పేపర్‌ లీకేజీలతో అన్యాయానికి గురైన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం (21న) అన్ని రాష్ట్రాల్లోని తమ పార్టీ ప్రధాన కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది.

Congress : నీట్‌ అక్రమాలపై నిరసనల యుద్ధం

రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు.. అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లకు ఇప్పటికే లేఖలు

పార్లమెంటు సమావేశాల్లోనూ పోరు

న్యూఢిల్లీ, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): నీట్‌ అక్రమాలపై దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్‌ సిద్ధమైంది. ఆ పరీక్ష నిర్వహణలో మోదీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ.. పేపర్‌ లీకేజీలతో అన్యాయానికి గురైన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం (21న) అన్ని రాష్ట్రాల్లోని తమ పార్టీ ప్రధాన కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఈ మేరకు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, పార్టీ శాసనసభాపక్ష నేతలకు లేఖ రాశారు. సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ ఆందోళనలలో పాల్గొనాలని ఆదేశించారు. బిహార్‌, గుజరాత్‌, హరియాణాలో చేసిన అరెస్టులతో.. నీట్‌ నిర్వహణలో వ్యవస్థీకృత అవినీతి జరిగిందని స్పష్టమవుతోందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో మాల్‌ ప్రాక్టీస్‌ జరుగుతోందని ఈ అరెస్టులతో తెలిసిందన్నారు. సోమవారం నుంచి కొత్త లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నీట్‌ అక్రమాలపై ఉధృతపోరుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక.. పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకులను బీజేపీ వ్యవస్థీకృతం చేస్తోందని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సందీప్‌ పాఠక్‌ ధ్వజమెత్తారు. నీట్‌ నిర్వహణలో అక్రమాలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని.. కేంద్ర విద్యాశాఖ మంత్రిని సస్పెండ్‌ చేయాలని.. లేదా ఈ అవకతవకలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో ఆప్‌ యువ విభాగం నేతలు.. నీట్‌ పరీక్ష రద్దు కోరుతూ కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ ఇంటి బయటన నిరసనకు దిగారు. ఇదిలా ఉండగా, నీట్‌లో అక్రమాలు, అరెస్టులపై కేంద్ర విద్యాశాఖ బిహార్‌ పోలీసుల నుంచి నివేదిక కోరింది.


నకిలీ పత్రాలతో కోర్టుకు..

జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ తన నీట్‌ ఫలితాన్ని వెల్లడించలేదని, తన ఓంఎంఆర్‌ షీట్‌ చినిగిపోయినట్టు తెలిపిందని పేర్కొంటూ ఆయుషి పటేల్‌ అనే విద్యార్థిని అలహాబాద్‌ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. తన ఆరోపణలకు సంబంధించి ఆమె నకిలీ పత్రాలను కోర్టుకు సమర్పించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయుషి ఆరోపణలను అప్పట్లోనే ఎన్‌టీఏ తీవ్రంగా ఖండించింది. ఆమె ఓఎంఆర్‌ షీట్‌ చినిగిపోలేదని, ఆమెకు 335 మార్కులు వచ్చాయని ప్రకటించింది. కానీ ఆ మార్కులు తనవి కావని.. వేరొకని నంబర్‌తో తనకు ఆ మార్కులు ఇచ్చారని వాదిస్తూ ఆయుషి ఓ వీడియోను విడుదల చేసింది. కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ఆ వీడియోను షేర్‌ చేశారు.

Updated Date - Jun 20 , 2024 | 03:37 AM