High Court: కవిత.. మహిళ అని సానుభూతి చూపలేం!
ABN , Publish Date - Jul 02 , 2024 | 03:45 AM
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. ఈడీ, సీబీఐ కేసులకు సంబందించి ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. మహిళ అనే కారణంతో కవితపై సానుభూతి చూపలేమని కోర్టు స్పష్టం చేసింది.
బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
పలుకుబడి గల మహిళ.. నిస్సహాయురాలిగా భావించలేం
మద్యం కుంభకోణంలో కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. ఈడీ, సీబీఐ కేసులకు సంబందించి ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. మహిళ అనే కారణంతో కవితపై సానుభూతి చూపలేమని కోర్టు స్పష్టం చేసింది. ఒక విద్యావంతురాలిగా పలుకుబడి కలిగిన మహిళగా ఆమె చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించింది. ఈ రీత్యా కేసులో ఆమె పాత్ర, ఆమెకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాల ఆధారంగానే బెయిల్ ఇవ్వాలో లేదో నిర్ణయించాలే తప్ప మహిళ అన్న విషయానికి అంత ప్రాధాన్యం ఉండకూడదని కోర్టు అభిప్రాయపడింది. ఢిల్లీలో కొత్త మద్యం విధానం కుంభకోణం ప్రధాన కుట్రదారుల్లో కవిత కూడా ఒకరని ఈడీ సేకరించిన సాక్ష్యాలను బట్టి తేలిందని, ఈ కేసులో మరికొందరు నిందితులు కూడా ఆమె తరఫునే పనిచేశారని, ఫలితంగా ఆమెను ఓ నిస్సహాయ మహిళగా భావించలేమని కోర్టు స్పష్టం చేసింది.
కేసుకు సంబంధించి సమన్లు ఇచ్చిన తర్వాతే ఫోన్లు పార్మట్ చేశారని, ఫలితంగా కవిత సాక్ష్యాలను చెరిపేసినట్లు అనుమానాలున్నాయని వ్యాఖ్యానించింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు సంబంధించి ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా బలమైన ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని, ఈ దశలో ఆమెకు బెయిల్ మంజూరు చేయలేమని తీర్పులో స్పష్టం చేసింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈడీ అరెస్టు చేసింది. 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. కవిత తిహాడ్ జైల్లో ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసినట్లు ప్రకటించింది. తొలుత.. తన కుమారుడికి పరీక్షలున్నాయని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరగా ట్రయల్ కోర్టు తిరష్కరించింది. తర్వాత ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు సాధారణ బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్లు దాఖలు చేయగా ట్రయల్ కోర్టు మరోసారి తిరష్కరించింది. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
బెయిల్ మంజూరు చేయాలని ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయగా 2 పిటిషన్లు కలిపి ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలో ఒకేసారి విచారించింది. మే 27, 28 తేదీల్లో హైకోర్టులో సుధీర్ఘ వాదనలు జరిగాయి. ఢిల్లీ మద్యం కేసుతో కవితకు సంబంధమే లేదని, అక్రమంగా అరెస్టు చేశాయని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. అయితే, ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితది కీలకపాత్రని, ఆమె సూత్రదారి, పాత్రదారి అని దర్యాప్తు సంస్థలు బలంగా వాదించాయి. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. జూన్‌లో హైకోర్టులో సెలవులు ఉండడంతో ఈలోపే తీర్పు వెల్లడించాలని కవిత తరఫు న్యాయవాది కోరారు. సెలవులకు ముందే తీర్పు ఇస్తానని న్యాయమూర్తి చెప్పినప్పటికీ సెలవులు ముగిసిన తర్వాత సోమవారం తీర్పు ఇచ్చారు. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ పిటిషన్లు తిరష్కరిస్తున్నట్లు తన తీర్పులో న్యాయమూర్తి వెల్లడించారు.
నేరానికి పాల్పడలేదని నిర్ధారణకు రాలేకపోతున్నాం
ఢిల్లీ మద్యం విధానం కేసులో ఈడీ సమర్పించిన సాక్ష్యాధారాలు, సెక్షన్ 250 కింద సాక్ష్యుల వాంగ్మూలాలు, సీఆర్పీసీ 144 కింద అప్రూవర్ల వాంగ్మూలాలు, వాట్సాప్ చాటింగ్‌లతోపాటు అనేక డాక్యుమెంటరీ సాక్ష్యాలు ఉన్నరీత్యా ఆమె నేరానికి పాల్పడలేదని కోర్టు నిర్ధారణకు రాలేకపోతోందని హైకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ స్వర్ణకాంత శర్మ తన తీర్పులో పేర్కొన్నారు. మనీలాండరింగ్ లోని సెక్షన్ 45 కింద ఆమెకు బెయిల్ ఇవ్వడానికి కారణాలేమీ లేవని చెప్పారు. తాను సమర్పించిన 9 మొబైల్ ఫోన్లను ఎవరు ఫార్మట్ చేశారన్న విషయంపై కవిత స్పష్టమైన వివరణ ఇవ్వలేదని, గత 2023 మార్చి 11న సమన్లు పంపిన తర్వాతే ఈ ఫోన్లను ఫార్మాట్ చేయడాన్ని బట్టి చూస్తే ఆమె సాక్ష్యాధారాలను చెరిపివేసినట్లు అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.
ఫలితంగా ఇప్పుడు బెయిల్‌పై విడుదల చేస్తే ఆమె మరిన్ని సాక్ష్యాలను చెరిపివేసే అవకాశం ఉన్నదని, అంతేకాక ఈ కేసులో పలువురు కీలక సాక్షులు ఆమె సన్నిహిత సహచరులు లేదా ఉద్యోగులు కావడాన్ని విస్మరించలేమని కోర్టు పేర్కొంది. ఆమె సమాజంలో పలుకుబడి కలిగిన మహిళ అని, రాజకీయాల్లో కూడా ఆమె అనుభవజ్ఞురాలని, ఈ రీత్యా ఆమె సాక్షులను ప్రభావితం చేయలేరని చెప్పలేమన్నారు. మద్యం కుంభకోణంలో దర్యాప్తు అత్యంత కీలకదశలో ఉన్నదని, తుది చార్జిషీట్లను దాఖలు చేయవలసి ఉన్నదని కోర్టు పేర్కొంది.