Delhi High Court : వాట్సాప్ సంభాషణలు సాక్ష్యాలు కావు
ABN , Publish Date - Jul 06 , 2024 | 05:06 AM
వాట్సాప్ సంభాషణలను ఎవిడెన్స్ యాక్ట్-1872 ప్రకారం సాక్ష్యాలుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, జూలై 5: వాట్సాప్ సంభాషణలను ఎవిడెన్స్ యాక్ట్-1872 ప్రకారం సాక్ష్యాలుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అవి వాస్తవమైనవేనంటూ తగిన ధ్రువీకరణ పత్రం ఉంటే తప్ప సాక్ష్యంగా గుర్తించలేమని తెలిపింది. ఢిల్లీ వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ ఈ మేరకు నిర్ణయాన్ని వెలువరించారు. డెల్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ సంస్థపై అదీల్ ఫిరోజ్ అనే వినియోగదారుడు 2022లో జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు పెట్టాడు.
డెల్ సంస్థ మాత్రం 2023 డిసెంబరు 31న ఫోరంలో తన సమాధానాన్ని సమర్పించింది. ఫిర్యాదుకు సంబంధించిన అన్ని పత్రాలు తమకు అందనందున సమాధానం ఇవ్వడంలో జాప్యం జరిగిందని పేర్కొంది. ఇందుకు సాక్ష్యంగా వాట్సా్‌పలో ఫిర్యాదుదారు ఫిరోజ్, తమ సంస్థ ప్రతినిధుల మధ్య జరిగిన సంభాషణల స్ర్కీన్షాట్లను సమర్పించింది. అయితే జిల్లా ఫోరం ఈ స్ర్కీన్ షాట్లను సాక్ష్యంగా ఆమోదించలేదు. దీనిపై డెల్ రాష్ట్ర ఫోరం, ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించగా... హైకోర్టు కూడా వినియోగదారుల ఫోరాలతో ఏకీభవించింది.